ఏతెంచితి మేలుకోటె!!!

సాధారణం

“Tourist places around Bangalore” అని గూగులమ్మని అడిగిన వెంటనే ఓ పేద్ద లిస్టు ఇచ్చినా సరే ఏం చేతనో ఈ సంవత్సర కాలంలో ఒక రోజు ట్రిప్స్ కి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు.ఈ సారి అలా కాకూడదని ఎక్కడికైనా వెళ్ళాలని నేనూ,మా వారు కుంచెం ఘాట్టిగా అనుకున్నాము. తనేమో ప్లేస్ నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పి చల్లగా జారుకున్నారు.సరే అని ఇద్దరు,ముగ్గురు ఫ్రెండ్స్ ని అడగ్గా బోలెడు ప్లేసెస్ చెప్పారు.మన వంతు ప్రయత్నం చేయాలి కదా అని “places for one day trip around Bangalore”  అని మళ్ళీ గూగులమ్మని అడగ్గా విసుక్కోకుండా అడిగిన  సమాచారాన్ని ఇచ్చింది.సరే ఇచ్చిన లిస్టులో ఒక్కో పేరు చూసుకుంటూ కరెక్ట్గా ఓ పేరు దగ్గర ఆగిపోయా.కొంచెం ఫ్లాష్ బాక్ గుర్తొచ్చింది.మధ్యలో ఈ ఫ్లాష్ బాక్ గోలెంటి అని మీరు అడగడం నాకు అర్ధం అయ్యింది.అక్కడికే వస్తున్నాను. ఆ పేరు చూడగానే ముళ్ళపూడి వారు గుర్తొచ్చారు. ఆయనకి దీనికి ఏంటి సంబంధం అనే కదా మీ ప్రశ్న.ముళ్ళపూడి వారు “కోతి  కొమ్మచ్చి”లో ఓ సారి మేలుకోటె అనే ఊరు గురించి రాసారు.అది చదివిన వెంటనే అది ఎక్కడుందో తెలియక పోయినా అక్కడికి వెళ్ళాలని అనిపించింది. ఇప్పుడు సరిగ్గా ఆ పేరు చూడగానే  అదంతా గుర్తొచ్చింది.వివరాలవి చూస్తే పొద్దున బయల్దేరి సాయంత్రానికి ఇల్లు చేరుకోవచ్చు అని తెలిసింది.ఇదే  మనకి తగినదని మనం మేలు కోటె కి వెళ్తున్నాము అని ఇంట్లో చెప్పేసా.

ఉదయం ఏడు గంటలకి బయల్దేరాలనుకున్నవాళ్ళం కుంచెం ఆలస్యమయ్యి ఇల్లు వదిలేసరికి ఎనిమిదయ్యింది.మేలుకోటె కి వెళ్ళాంటే బెంగళూరు-మైసూరు హై వే మీదుగా ప్రయాణం.దారంతా టూరిస్ట్ బళ్ళూ,కారులు.ట్రాఫిక్ కొంచెమెక్కువే ఉంది. అదేమిటని మా వాహన చోదకుడిని అడిగితే ఇది తక్కువ మేడం,పొద్దున 4,5 గంటలకి కి ఇంకా ఎక్కువుంటుంది అని సెలవిచ్చాడు.ఆ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగా దారిలో చన్నపట్న,రాం నగర,మద్దూరు,మండ్య లాంటి ఊళ్ళు మాకు స్వాగతం చెప్పి వీడ్కోలు పలికేసాయి.ఒక్కో ఊరికి ఒక్కో విశిష్ఠత ఉంది.  అదేమిటయ్యా అంటే…ఇవి..

రాం నగర-పట్టు మార్కెట్ కి ఫేమస్ కావడం చేత దీన్ని సిల్క్ సిటి అని అంటారు.కానీ నాకెక్కడ షాపులు కనిపిలా..కనిపిస్తే ఎంచక్కా షాపింగ్ చేసి నాలుగు “రేష్మి సీరెగళు” కొని వచ్చుందును. రాం నగర జిల్లాకి ప్రధాన కేంద్రం.

చన్నపట్నని “సిటి ఆఫ్  టాయ్స్” అని అంటారు.ఇక్కడ చెక్క బొమ్మలు ,లక్క వస్తువులు బాగా ఫేమస్. అప్పుడెప్పుడో ఓ సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఓ చెక్క వింటేజ్ కారు బొమ్మ, ఎడ్ల బండి తీసుకున్నాను. ఇంకా బోలెడు బొమ్మల కలెక్షన్ ఉంది.తీరిగ్గా వచ్చి షాపింగ్ చేసుకోవాలి.

మద్దూరు-దీనికి స్వాగత మరియు వీడ్కోలు ద్వారాలు లేకపోవడం వల్ల దీన్ని ఏమంటారో తెలియ లేదు. కానీ ఇక్కడి వడ బాగా ఫేమసంట. మద్దూరు వడ తినేదానికే టూరిస్ట్ లు వస్తారంట.

ఇహ పోతే తర్వాత వచ్చేది మండ్య.మండ్య జిల్లాకి ప్రధాన కేంద్రం. ఈ జిల్లా వ్యవసాయపరంగా వృద్ది చెందింది.ఇక్కడ చక్కెర ప్రధానంగా ఉత్పత్తి అవ్వడం చేత “సిటి ఆఫ్ సుగర్” అని అంటారు.మండ్య నగరాన్ని దాటి రాగానే  చుట్టూ చెరకు పొలాలు కనిపించాయి.

ఇవి దాటాక మేలుకోటె కి వెళ్ళడానికి సైన్ బోర్డ్ కనిపించింది.దారికి ఇటు అటు పక్క పొలాలు మధ్యలో చిన్న రోడ్. ఇది ఆ ఊరికి వెళ్ళేదానికి  దారి.ఏడుకి ముందే ఇల్లు వదిలి ఉంటే ఎండ వేడి తెలిసి ఉండేది కాదేమో.మేము వెళ్ళే సరికి మిస్టర్ సూర్యారావ్ తన ప్రతాపాన్ని చూపిస్తూన్నాడు.ఇంకెంత దూరం అని అనుకుంటుండగానే ఊరి పొలిమేరలోకి వచ్చేసాము. ఓ పక్కగా కొండలు,ఓ కొండ పైన గుడి…వావ్…భలే ఉందనిపించింది. అంతకు ముందే కొంచెం ఆ ఊరి గురించి నేను గూగులమ్మ ద్వారా కనుక్కోవడం చేత అది యోగ నరసింహ స్వామి వారి ఆలయం అని గుర్తు పట్టేసా.

మేలుకోటెలో ప్రధానంగా రెండు ఆలయాలు ఉన్నాయి.ఒకటి చెలువ నారాయణ స్వామి వారిది ఇంకొకటి కొండ పై ఉన్న యోగ నరసింహ స్వామి వారిది.మొదటగా చెలువ నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము.గుడి రద్దీగానే ఉంది.బాగా పాతది గా ఉంది. గర్భగుడికి దగ్గరలోనే ఉత్సవ మూర్తి విగ్రహం ఉంది. స్వామి వారి దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని చూసుకుని బయటకి రాగానే ఒక మండపం ఉంది. అక్కడ ఉన్న  స్థంభాల పై  శిల్ప కళ అద్భుతంగా ఉంది. వెంటనే కెమెరా కి పని చెప్పా.అక్కడ ఉన్న మంటపంలో కెమెరా కన్నులోనుంచి చూసినవి.

రంగనాథ స్వామి వారు


ఇక్కడ దర్శనం అయ్యాక కొండపై ఉన్న నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. అన్ని మెట్లు ఎక్కలేమని అత్తయ్య,మామయ్య గారు రాలేమని చెప్పారు. నేనూ,మా వారు వెళ్ళాము. ఓ అరగంటలో కొండ పైకి చేరుకున్నాము.మధ్యలో విశ్రమించడానికి చిన్న చిన్న మండపాల్లా ఉన్నాయి. అక్కడింకా పేద్ద క్యూ ఉంది.యోగ ముద్రలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని బయటకి రాగా అక్కడ నుంచి వ్యూ అద్భుతం గా ఉంది. అక్కడా కెమెరా కి పని చెప్పా. కొండ దిగి బయటకి రాగా కొద్ది దూరంలోనే కళ్యాణి అనే పుష్కరిణి ఉంది. పుష్కరిణి చుట్టూ మండపాలు అవీ ఉన్నాయి. ఈ పుష్కరిణిని చాలా సినిమాల్లో చూపించారంట.

కొండపై నుంచి తీసిన పుష్కరిణి చిత్రం

నరసింహ స్వామి వారి ఆలయం

చెలువ నారాయణ స్వామి వారి ఆలయ ప్రాకారం

ఇవన్నీ ముగించుకునేసరికి 3 గంటలయ్యింది.  అప్పటికే  ఆత్మా రాముడు గోలపెట్టేస్తున్నాడు. చెలువ నారాయణ స్వామి వారి  ఆలయం దగ్గరలోనే మఠాలు ఉన్నాయి. అవి యాత్రికులకి అన్నదానం,వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. కానీ హోటల్స్ లాంటివి లేవు.కానీ ఇక్కడి పులిహోర మరియు చక్ర పొంగలి చాలా బాగా ఉంటుండంట. ఏ మస్ట్ ట్రై అట. కానీ అక్కడ మాకేమి అవి కనిపించకపోతే   మండ్యకి వచ్చి భోజన కార్యక్రమాన్ని ముంగించుకున్నాము. ఇలాంటి రిస్కులు తీసుకోవడం ఎందుకనుకుంటే ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళడం బెటర్. మండ్య  నుంచి శ్రీ రంగపట్న దగ్గర అని చెప్తేనూ అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామి వారి దర్శనం చేసుకుని  వచ్చాము.

మేలుకోటెలో శ్రీ రామానుజాచార్యులు 12 ఏళ్ళ పాటు ఉన్నారన్న వివరాలు తప్పితే ఆ ఆలయాల ప్రాశస్త్యం గురిచిన వివరాలు ఏమీ తెలీదు. చెలువ నారాయణ స్వామి వారి ఆలయం బయట మాత్రం ఓ బోర్డ్ పెట్టారు కొన్ని వివరాలతో. మెయింటెనన్స్ చాలా చెత్తగా ఉంది. 😦  ఇట్టా కాదని కొంచెం గూగ్లిస్తే మొత్తం వివరాలు తెలిసాయి. మేలుకోటె ని ‘తిరునారాయణపురం‘ అని కూడా పిలుస్తారు. ఇవి కాక వేదాద్రి,యతిస్థలం,నారాయణాద్రి,యాదవగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి.ఇక్కడి మూల విరాట్టుని తిరునారాయణ అని కూడా పిలుస్తారు.ఉత్సవ మూర్తిని చెలువపిళ్ళె రాయ అని,సంపత్ కుమార అని పిలుస్తారు.అమ్మవారిని యదుగిరి తాయార్ అని అంటారు.కానీ  ఉత్సవ మూర్తి అసలు పేరు రామ ప్రియ అట.ఈ ఉత్సవ మూర్తి సూర్య వంశ  రాజులకు చెందిందనీ తరతరాలుగా ఆ వంశ రాజులు పూజించేవారని ప్రతీతి.స్వయం గా శ్రీ రామచంద్రుల వారు పూజించేవారు కనుకు దానికి ‘రామ ప్రియ‘ అనే పేరు వచ్చింది.  ఆ తరువాత చంద్ర వంశ రాజులు కూడా ఈ విగ్రహానికి పూజలు జరిపేవారట. ఈ విగ్రహం రాముల వారి చే మరియు కృష్ణుల వారి చే పూజలందుకున్నదని ప్రతీతి.శ్రీ కృష్ణుల వారే  స్వయం గా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని ఇంకో కథనం.

బిత్తిదేవ అనే కర్ణాటక రాజు రామానుజచార్యుల వారిని ఆదరించి శ్రీ వైష్ణవాన్ని తన మతంగా చేసుకుని తన పేరుని విష్ణువర్ధనుడిగా మార్చుకుంటాడు. అతనే పంచనారాయణ ఆలయాలను కట్టిస్తాడు. అప్పుడు ఈ నారాయణపురం గుడి శిథిలావస్థ లో ఉందని,మూల విరాట్టు కనిపించకుండా  పోతే తిరిగి ఆచార్యులవారికి యాదవగిరి కొండ పై తులసి మొక్కల మధ్య దొరగ్గా తిరిగి పునః ప్రతిష్టించారని చెప్తారు. దక్షిణాది పై ముస్లిం పాలకుల దండ యాత్రలు జరిగినప్పుడు,ఈ ఉత్సవ మూర్తి విగ్రహం కనిపించకుండా పోతే ఆచార్యుల వారే డిల్లీ లో ని ఓ ముస్లిం పాలకుడి వద్దనుండి తిరిగి తీసుకుని వచ్చారని ఇంకో కథనం.అతని కూతురు ఆ విగ్రహాన్ని విడిచి ఉండలేక ఆచార్యుల వారితో మేలుకోటేకి వచ్చి అందులోనే ఐక్యమయ్యిందని ఐతికం.ఆవిడనే ‘బీబీ నాచియర్‘ అని పిలుస్తున్నారు.

ఇక్కడి విగ్రహాలు  పన్నెండో శతాబ్దం కంటే ముందుదని పురావస్తు శఖాధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఆలయ నిర్వహణను తరువాత మైసూరు రాజులయిన ఒడెయార్లు స్వీకరించారు.  రాజా ఒడెయార్ ఈ స్వామి పరమ భక్తుడు.ఈ గుడికి తరచూ వచ్చి స్వామి వారి దర్శనం చేసుకునే వాడు.స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహుకరించాడు.దీనినే రాజ ముడి అని అంటారు.స్వామి లోనే ఐక్యం అయ్యారని నమ్మిక.అతని వంశస్తుడే ఐన కృష్ణరాజ ఒడెయార్ III ఇంకో కిరీటాన్ని స్వామి వారికి బహుకరించాడు. దానినే కృష్ణరాజ ముడి ,కృష్ణరాజ ముకుట అని అంటారు.ఈ రెండూ కాక ఇంకో పురాతన వజ్ర కిరీటం ఉంది.దాన్నే వైర ముడి,వజ్ర ముడి,వజ్ర ముకుట అని పిలుస్తారు. దీన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ఇచ్చారని చెప్తారు.

ఈ కిరీటాలను స్వామి వారికి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలంకరిస్తారు. మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలాగో  ఇక్కడ వైరముడి బ్రహ్మోత్సవాలు  అంత బాగా జరుగుతాయట. శ్రీ వైష్ణవులకి ముఖ్యమైన రోజు. వజ్రకిరీటానికి సూర్య రశ్మి సోకకుండా ఓ పెట్టెలో భద్రపరచి తీసుకు వస్తారట.కిరీటాని ఆచార్యుల వారి సన్నిధిలో ఉంచిన తరువాత ప్రధాన పూజరి కళ్ళకి గంతలు కట్టుకుని ఉత్సవమూర్తికి కిరీటాన్ని అలంకరిస్తారట. మాములప్పుడు ఈ కిరీటాన్ని చూడకూడదట.కిరీట ధారణ తరువాత స్వామి వారు తన దేవేరులతో పుర వీధుల్లో భక్త కోటికి దర్శనమిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం,నాగవల్లి మహోత్సవాలు ముఖ్యమైనవి.

యోగ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రహ్లాదుడు ప్రతిష్టించారని నమ్మకం. స్వామి వారికి కృష్ణరాజ ఒడెయార్ III స్వర్ణ కిరీటాన్ని బహుకరించారు.  ఇక్కడ సంస్కృత వేద పాఠశాల ఉంది. wild life sanctuary ఉంది.

బెంగళూరు-మైసూరు హైవే లో ఓ రెండు కాఫి డేలు ,ఓ బరిస్తా తో పాటు అడిగాస్,కదంబం,కామత్,మెక్ డి వంటి భోజన ఫలహారశాలలు ఉన్నాయి.ఛాయిస్ మీ ఇష్టం.మొన్న వెళ్ళినప్పుడు కె.యఫ్.సి రెడీ అవుతోంది. 🙂

అవండీ నా మేలుకోటే పర్యటన విశేషాలు..ఎలా ఉన్నాయి? అందరికీ నారాయణుని అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను…

నాకో డౌట్…రాముడు,కృష్ణుడు రెండూ విష్ణువు ధరించిన అవతారాలే కదా…మరి వాళ్ళు నారాయణుడిని పూజించడమేమిటి??నారాయణుడు అంటే కూడా విష్ణువే కదా.. ఈ డౌట్ ని క్లారిఫై చెయ్యగలరా ప్లీజ్…

14 responses »

 1. మీ ప్రయాణ విశేషాలు బావున్నాయ్ స్నిగ్ధ గారు
  చక్క బొమ్మలు మీరు కొన్నారా
  కొండపై నుంచి తీసిన పుష్కరిణి చిత్రం,నరసింహ స్వామి వారి ఆలయం రెండూ చాలా బాగా తీసారు

 2. బాగుందండీ మీ ట్రావెలాగ్ 🙂
  మీ టపా టైటిల్ చూసి నాకు సినీనటుడు మేల్ కోటే గుర్తొచ్చారు… ఆయనెవరు అంటారా ఇదిగో ఈ లింక్ లో చూడండి 🙂 http://www.jointscene.com/artists/Tollywood/Shankar_Melkote/35871

  • థాంక్సండీ వేణు గారు, నాకు ఈ ప్లేస్ పేరు విన్నప్పుడు ఆ నటుడే గుర్తొచ్చారు..ఆయన తెలియకపోవడమేంటండీ..నువ్వే కావాలి,అశ్వని,బావగారు బాగున్నారా లో ఉన్నారు కదా…అందుకే మేల్కోటె కి బదులు మేలు కోటె అని పెట్టా…
   🙂

 3. హాయ్ స్నిఘ్ద ఎలా వూన్నారు, మీ కొత్త టప బాగుందీ మెల్కొతె అందలని బాగా వర్ఱీంచారు

 4. snigdha garu
  chala manchi article rasaru andi
  manchi travelog idhi
  intha vipulanga oka vihara yatra gurinchi ee madhya chadhavaledhu.
  chala bhaga undhi
  konni akshara dosharu panti kindha ralla laaga noppettina
  vanta adbhutham ga undatam tho rallu noppetta ledhu..
  may be adhi eng to telugu transalation valla vachiu undavachu
  any way
  i become fan of ur blogs andi

  • థాంక్సండీ వంశీ గారు…మరీ ఫాన్లు,ఎ.సిలు అంటూ అనకండీ..నేను ఇంకా బ్లాగ్లోకం లో తప్పటడగుల స్టేజీలోనే ఉన్నాను…
   🙂

 5. కృష్ణుడి గురించి తెలీదుకానండి అమ్మాయ్‌గారు, రాముడు పూర్తిగా మానవ అవతారం. ఎక్కడాకూడా తాను భగవంతుడిననో, నారాయణుని అవతారమనో చెప్పుకున్నట్టు నే వినలేదు. అతడిని ఎఱిగిన ఋషులు,జ్ఞానులే ఆయనను నారాయణుడిగా గుర్తించారు.
  మిగతా విషయాలు బ్లాగు పెద్దలెవరైనా చెప్తారని ఆశిస్తున్నా

  • చారి గారు,చాన్నాళ్ళకి బ్లాగు వైపు చూసినట్లున్నారు..కుశలమేనా…రాముడి గురించి మీరు చెప్పింది నిజం…ఐతే ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు నారాయణుడిని పూజించారంటారా?
   ఈ ప్రశ్న కి ఎవరు సమాధానం చెప్పలేదండి..:( బ్లాగు పెద్దలు ఎవరైనా చెప్తే బాగుండు…
   కొత్త పిలుపు ఏంటండి??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s