Monthly Archives: డిసెంబర్ 2010

డిసెంబర్-జనవరి ఙ్ఞాపకాలు-1

సాధారణం

డిసెంబర్ అనగానే నాకు గుర్తొచ్చేవి ధనుర్మాసం,రంగవల్లులు,తిరుప్పావై పారాయణం,సంగీత  కచేరీలు, క్రిస్మస్ సంబరాలు,ఆంగ్ల సంవత్సరాది…నేను కూడా ఉన్నాను  అంటూ వచ్చే సంక్రాంతి..మొత్తానికి డిసెంబర్ టు జనవరి పండగలే  పండగలు…ఈ పండగలకి ఇచ్చే సెలవులూ…. మధ్యలో మేమూ ఉన్నాము అంటూ వచ్చే పరీక్షలూ…ఇలా ఎన్నో ఙ్ఞాపకాలు. వాటిలో కొన్ని…

చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదులేండి…ఒక ఆరేడు తరగతుల్లో ఉండేప్పుడు అన్నమాట. డిసెంబర్ రాగానే ముందుగా చూసుకునేది సెలవలెప్పుడు ఇస్తున్నారా అని…దాంతో పాటు  సంక్రాంతి సెలవల లిస్ట్ కూడా చూసుకునేదాన్ని…ఇవీ చూసుకున్న తర్వాత అసలైన దాన్ని చూసేదాన్ని.. హాఫ్ యియర్లీ  ఎగ్జాంస్ టైం టేబిల్….దీనికి ఒక ప్రణాళిక వేసుకునేవాళ్ళం ఎగ్జాంస్ కి ఎట్టా చదవలా అని.ఈ ప్రణాళిక కొనసాగుతోంటే ధనుర్మాసం రాగానే మా ఇంటికి దగ్గరలోనే ఉండే గుడిలో  నానమ్మ పూజ  చేయించేది…ఎందుకని అడిగితే ఈ నెలలో చేయిస్తే మంచిదమ్మా అని చెప్పేది…పూజ చేసే రోజు పొద్దునే లేచి త్వరగా గుడి కి వెళ్ళిపోయేవాళ్ళము…పూజ ముగించాక పూజరి ఇచ్చే పొంగలి కోసం వేచి చూసేవాళ్ళం…దాని రుచే వేరు!!!  అది తినేసి ఇంక స్కూల్ కి వెళ్ళిపోయేవాళ్ళము… ఈ పూజలు అవీ సాగుతోంటే ఇంకో పక్క పరీక్షలు వచ్చేసేవి..కౌంట్ డౌన్  మొదలయ్యేది..ఒక్కో  పేపర్ అయ్యేకొద్దీ ఏదో భారం దిగినట్లు   అనిపించేది…లెక్కల పరీక్ష రోజయితే చాలా టెన్షన్ గా వెళ్ళేదాన్ని-నాకు లెక్కలకి అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజులలో. :)పరీక్షల  టైంలో నాకో సెంటిమెంటుండేది…ఒక్కో పేపర్ ఈజీగా  వచ్చేకొద్దీ ఏదైనా పేపర్ టఫ్ గా వస్తుందేమో అని. ముఖ్యంగా  లెక్కలు. లెక్కల పేపర్ అయ్యిన వెంటనే ఒక పెద్ద భారం దిగినట్లు అనిపించేది.  లెక్కలు ఈజీగా వస్తే సైన్స్ టఫ్ గా వస్తుందేమో అని లేదా సోషల్ టఫ్ వస్తుందేమో అని.(ఈ సెంటిమెంట్ ఇంజీనీరింగ్ వరకు పోలేదు).ఇంక సొషల్ పేపర్ కూడా ఈజీ గా వస్తే ఇహ చూస్కోండి….ఎప్పుడెప్పుడు ఎగ్జాం రాసేసి ఇంటికి వెళ్ళిపోదామా  అని ఉండేది.

ఇంక  ఆ సోషల్ కూడా రాసేసాక ఫ్రెండ్సందరూ  చేరి  సెలవుల్లో ఏం  చెయ్యబోతున్నారో చెప్పేవాళ్ళు…న్యూ యియర్ కి కలుస్తామో లేదో కాబట్టి ఇప్పుడే క్రిస్మస్ విషెస్ మరియు Happy New Year wishes చెప్పేసుకునేవాళ్ళం…స్కూల్ రి ఒపెన్  జనవరి లో కాబట్టి…బాగులు సర్దేసుకుని బయల్దేరే టైంకి మా క్లాస్కి వచ్చే ఏదైనా ఒక సబ్జెక్ట్  టీచర్ పిల్లలందరినీ పిలిచి సెలవలు  అర్ధవంతంగా ఉపయోగపడ్డానికి తన సబ్జెక్ట్ question paper లోని questions కి ఆన్సర్స్   రాసుకొని రమ్మని  చెప్పింది అదీ విత్ ఔట్ చాయిస్  అన్నమాట.ఇట్టా చేస్తే  యాన్యూల్ ఎగ్జాంస్ కి   ఉపయోగకరంగా  ఉంటుందట.దీన్ని చూసి మిగతా టీచర్లు మేమేమి తక్కువ తినలేదని వచ్చి వారి సబ్జెక్ట్స్ ని కూడా రాసుకుని రమ్మని చెప్పేవారు.వాళ్ళ మూడ్  బాగుంటే ఒక సారి రాయమని చెప్పేవాళ్ళు లేదా మూడో లేక ఐదు సార్లో  రాసుకు రమ్మని చెప్పేవారు. ఇవి వినగానే సగం సంతోషం ఆవిరయ్యిపోయేది.కొంతమందేమో  అమ్మమ్మ ఊరుకో లేదా నానమ్మ ఊరుకో వెళ్ళి రాస్తామని చెప్పేవారు. ఇంకొంతమంది ముందుగానే రాసేసి తర్వాత  ఊరెల్తామనే వాళ్ళు. నేను మాత్రం త్వర త్వరగా హోం వర్క్ రాసేసి మిగతా రోజులు సరదాగా గడుపుదామని అనుకునేదాన్ని. మొదటి రోజు ఏం రాద్దాంలే…పరిక్షలకి చదివి అలసి పోయాము ఈ రోజు అవ్వనీ రేపు రాద్దాము అని  అనుకునేదాన్ని. రెండు,మూడో రోజు కూడా ఇలాగే అయ్యిపోయేది. మనసులో ఇవాళ రాసేద్దాము రేపు రాసేద్దామని అని ఉన్నా..బద్దకం..

ఇచ్చిన సెలవల్లో ఒక ఆరు రోజులు ఆయిపోయాక  అప్పుడు పుస్తకాలు   తీసేద్దాన్ని…రాయడానికి..స్కూల్ రిఒపెన్ కి రెండు రోజులు ఉందనగా  ఒక రెండు   సబ్జెక్ట్లు మిగిలిపోయేవి..ఇహ అప్పుడు చూసుకోండి నా టెన్షన్…నేనిలా ఉంటే మా చెల్లెలేమో ముందుగానే హోం వర్క్ అంతా చేసేసేది.ఏవో తంటాలు పడి రాసేసినా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయేది.అది పూర్తి  చెయ్యాలంటే  ఒక రాత్రంతా మేల్కొని  రాస్తే కాని అవ్వదు. నా పాట్లు చూసి  నాన్నగారు క్లాస్స్ పీకేవాళ్ళు..”ఎప్పుడూ ఇంతే…ముందే రాసేసి ఉంటే ఇన్ని   తంటాలు ఉండేవి కాదు కదా..ఎప్పుడూ నీది 11th  అవర్  ప్రిపరషనే. చిన్నిని   చూసి నేర్చుకో” అని.ఇలా నాన్నగారు వడ్డిస్తూంటే చిన్ని జాలితో(ఇది నాకు డౌట్) కూడిన నవ్వు నవ్వేది.దీనికి తోడు అమ్మ కూడా మరో నాలుగు చీవాట్లు అదనంగా వడ్డించేది.  ఏం చెస్తాం మన టైం బాడ్ అనుకుంటూ నెక్స్ట్ టైం నుంచి అలా చెయ్యనులే నాన్నా అని చెప్పేసేదాన్ని.  పరిస్థితి చెయ్యి దాటి   పోతోంది అనగా.. అమ్మ దగ్గరకి వెళ్ళేదాన్ని.అమ్మ మా స్కూల్లోనే పని  చేసేవారు. తను  హయ్యెర్ సెక్షన్స్ కి వెళ్ళేది. నా హోం వర్క్ పూర్తయ్యేలా లేదు. నువ్వు మా టీచర్ కి చెప్పమ్మా, మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదని,అందుకే రాయలేకపోయింది” అని. అమ్మ అప్పుడు ఒక లుక్ ఇచ్చి one and only puch డవిలాగ్ చెప్పింది.మిగతా పిల్లలు నా వల్ల నీ మీద partiality  చూపిస్తున్నారు అని అనుకోకూడదు.ఈ  పంచ్ డవిలాగ్ నాకు అర్ధం కాక బుర్ర గోక్కుంటే తనే అన్నది-“నాకు పిల్లలందరూ సమానమే. ఏ ఒక్కరు కూడా  నేను ఉన్నాను అని అందుకే నీ మీద partiality చూపిస్తున్నారు “అని అనుకోకూడదు. ఈ పాటికి కొంచెం అర్ధమయ్యింది ఏమనగా అంటే అమ్మ మనకి ఈ విషయం లో హెల్ప్ చెయ్యదు.ఇక మన పాట్లేవో మనమే పడాలి అని.

ఓ పక్క చూస్తే టైం తక్కువగా ఉంది..రాయల్సిన మేటర్ ఎక్కువగా ఉంది. పోనీ రాయకుండా వదిలేద్దామా అంటే పోయిన క్వార్టర్లీ పరీక్షలప్పుడు హోం  వర్క్ రాయకుండా కొంతమంది వస్తే వాళ్ళని క్లాస్ నుండి పంపిచేసిన సంగతి   గుర్తొచ్చింది. బాబోయ్, అసలే మనకి ఇలాంటి సంఘటనలు అంటే భయం. “ఇదంతా  అవసరమా నీకు?”అని ఎవరో అన్నట్లు వినిపించింది.ఎవరా అని చూస్తే  నాన్నగారు తన పన్లో ఉన్నారు, అమ్మ వంట గదిలో ఉంది,మా రాక్షసీ కాదు.వీళ్ళెవరు కాకుండా ఇంకెవరబ్బా అని అనుకుంటూ “దేవుడా,ఈ  సబ్జెక్ట్  టీచర్ రేపు స్కూల్ కి  రాకుండా చూడు, లేక మా క్లాస్ లో మిగతా జనాలు కూడా ఈ పేపర్ ని  కంప్లీట్ చెయ్యకుండా రావాలి” అని ప్రార్థిస్తుండగా మళ్ళీ అదే డవిలాగ్ వినిపించింది.ఈ సారి కొంచెం చెవులు రిక్కించి వినగా అది నా ఆత్మసీత వాణి.

ఆత్మసీత: “నేనప్పుడే చెప్పాను ముందుగానే రాసేయ్యమని,నువ్వు నా మాట విన్లేదు.ఇప్పుడు చూడు నీ పరిస్థితి”.
నేను: “నేనూ అనుకున్నాను రాద్దామని.ఎముంది కంప్లీట్ చెయ్యొచ్చులే అని అనుకున్నాను.నాకు మాత్రం తెలుసా ఇలా అవుతుందని”.

ఆత్మసీత: “అందుకే నా మాట వినాలి.ఇప్పుడు చూడు టైం తక్కువగా ఉంది.ఏం చేస్తావు”
నేను:” అప్పటికీ అమ్మని వెళ్ళి అడిగాను కొంచెం మా టీచర్ కి చెప్పమ్మా అని.తను ఒప్పుకోలేదు. అదే అర్ధం కావటం లేదు.ఎంతవరకు వీలైతే అంతవరకు రాస్తాను”

ఆత్మసీత:”పొనీ ఒక పని చెయ్యి. ఆన్సర్స్ రాసేప్పుడు  మధ్యలో మధ్యలో వదిలేసి అక్కడక్కడ రాస్తూ వెళ్ళు.త్వరగా అయ్యిపోతుంది”.
నేను:”ఏం మాట్లాడుతున్నావు.అలా రాయడం తప్పు. నీకు తెలుసు గా నేను సిన్సియర్  శిఖామణి అని. అలా రాయను.నా వల్ల ఎంత వరకు ఐతే అంత వరకు రాస్తాను అంతే”.

ఆత్మసీత: “నేను చెప్పాల్సింది చెప్పా.నీ ఖర్మ.ఇక నైనా లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోక ముందుగానే ఇవన్నీ రాసేసేయ్.నేను వెళ్తున్నాను”.

ఆత్మసీత మాటలు  వినాలా వద్దా అని అనుకుంటూ రాస్తున్నాను. రాస్తున్నాను రాస్తున్నాను ఇంకా వస్తూనే ఉంది. అప్పటికి ఇంకా రెండు మూడు ప్రశ్నలు మిగిలాయి.అవి కూడా పూర్తి చెయ్యలంటే  ఒక రెండు గంటలు పట్టేలా ఉంది.పొద్దున లేసి రాద్దామని డిసైడ్ అయ్యా.పొద్దున లేసి మళ్ళీ రాయడం స్టార్ట్ చేసా. స్కూల్ కి టైం అయిపోతోంది. అమ్మ  అరుస్తోంది  లేటవుతోందని.ఇంక ఆఖరికి ఒక ప్రశ్న మిగిలింది రాయడానికి. లాస్ట్ ప్రశ్న కదా మేడం చూడర్లే అని నా ఆత్మసీత చెప్పినట్లు మధ్యలో కొంత భాగం ఎగరగొట్టి రాసేసా. 😦 మనసులో తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్.  ఎక్కడ మా మేడం  కనుక్కుంటారేమో భయం గానే ఉంది . అమ్మ వచ్చి అడిగింది హోం వర్క్ చేసేవా అని. చేసేసాను అని చెప్పా. “బయల్దేరండీ,స్కూల్ కి టైమవుతోంది” అని చెప్పింది.ఆలాగే అమ్మా అని,నేను, చిన్ని బయల్దేరాము.

ఙ్ఞాపకాలు కొనసాగుతాయి…..