ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ఙ్ఞానులను పిలిచి ఇలా అభ్యర్థించాడు”మహానుభావులారా, ఎటువంటి సమయంలోనైనా, ఏ ప్రదేశంలో నైనా,ఏ పరిస్థితులలో అయినా ఉపయోగపడే సూచన ఏమైనా ఉందా? అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానమేదైనా ఉందా? మీ అమూల్య సలహాలు నాకు లభ్యం కాని సమయంలో నాకు ఉపయోగపడే సలహా ఏమైనా ఉందా” అని అర్ధించాడు.మహారాజు గారి ప్రశ్న విన్న ఆ ఙ్ఞానులు వెంటనే సమాధానం ఇవ్వలేకపొయారు. సుదీర్గ చర్చల అనంతరం, ఒక వృద్ధ ఙ్ఞాని అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని సెలవిచ్చాడు. ఈ సమాధానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఙ్ఞానులు రాజు గారి దగ్గరకి వెళ్ళి తమ సమాధానాన్ని ఒక చిన్న పత్రం పై రాసి రాజుకి ఇస్తూ”రాజా, నువ్వు ఇప్పటికిప్పుడు ఈ పత్రములోని సమాధానాన్ని చదవడానికి వీలు లేదు. నీకు ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురయ్యినప్పుడు, నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేని స్థితి లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తెరిచి చూడు” అని అన్నారు.అందుకు అంగీకరించిన రాజు ఆ పత్రమును ఎల్ల వేళలా తన దగ్గరే ఉండేలా తన వేలికి ఉండే వజ్రపుటుంగరంలో నిక్షిప్తం చేయించుకున్నాడు.
కొంత కాలం తరువాత పొరుగు రాజ్యము వారు రాజ్యమును ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఆ యుద్దంలో రాజు వీరోచితం గా పొరాడినప్పటికీ శతృ సేన ధాటికి తలవంచక తప్పలేదు. తన ప్రాణాలను రక్షింకోవడానికి రాజు ఒక గుర్రం పై పారిపోసాగాడు. శతృ సైన్యం అతన్ని వెంబడిస్తోంది.ఇంతలో గుర్రం హఠాత్తుగా ఆగిపోయింది. రాజు గుర్రం దిగి చూడగా అతని ముందు పెద్ద లోయ కనపడింది. ఒక్క అడుగు ముందుకి వేసి ఉంటే లోయలో పడిపొయేవాడే. వెనక్కి తిరిగి రావాలంటే దారి చిన్నగా ఉంది. శతృ సైన్యం తనని సమీపిస్తోందేమో అని అనిపించసాగింది. రాజుకి ఏం చేయ్యాలో తోచటం లేదు.
ఇలా తనలో తను ఆలోచిస్తుండగా రాజు దృష్టి తన వేలికి మెరుస్తున్న ఉంగరం పై పడింది. తనకి ఙ్ఞానులు అందించిన సందేశం, ఆ ఉంగరంలో నిక్షిప్తం చేసిన పత్రం అన్ని గుర్తుకి వచ్చాయి.వెంటనే ఆ పత్రాన్ని తీసి చూశాడు. ఆందులో ఇలా రాయబడి ఉంది.”ఈ క్షణమూ గడచిపోతుంది”.దాన్ని చదివిన రాజుకి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు.మరల చదివాడు.అతనికి ఇలా స్పురించింది-“నిజమే,ఈ క్షణం కూడా గడచిపోతుంది.నిన్నటి వరకు నేను ఒక రాజ్యానిధినేతగా అన్ని సౌఖ్యాలను అనుభవించాను. చుట్టు పక్కల ఉన్న రాజులందరికన్నా పరాక్రముడి గా పేరు గడించాను. ఈ రోజు నా రాజ్యం చేజారి పోయెలా ఉంది, నేను అనుభవిస్తున్న భోగభాగ్యాలు లేవు. శతృవులనుండి ఫారిపోతున్నాను. నిన్నటి వరకు నా దగ్గర అంతా వుంది నేడు ఏమీ లేదు. ఒక క్షణం లో నా జీవితం ఎలా మారిందో అలాగే ఈ క్షణం కూడా గడచిపోతుంది.”
ఇలా అనుకునేసరికి రాజు ముఖం పై ఒక ప్రశాంతత కనిపించింది. దేనినైనా సాధించగలను అనే నమ్మకం కలిగింది. కొంత సేపయ్యాక రాజుకి తనని వెంబడిస్తున్న శతృవుల గుర్రపు డెక్కల చప్పుడు తగ్గినట్లు అనిపించింది. రాజు తన సైన్యాన్ని మళ్ళీ కూడగట్టి శతృ సైన్యం తో పోరాడి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజలు విజయుడై వచ్చిన రాజుని ఘనం గా ఆహ్వానించారు. రాజధాని లో పండగ వాతావరణం నెలకొంది.పుర వీధుల్లో రాజు ఊరేగింపుగా వస్తుండగా అతని పై ప్రజలు పూల వర్షాన్ని కురిపించారు.వారి అభిమానానికి పులకించిన రాజు ” నేను ఎంత పరాక్రముడిని. ఇక నన్ను జయించుట ఎవరి తరము కాదు” అని అనుకున్నాడు. ఈ విజయొత్సవాలను,ప్రజల అభిమానాన్ని చూస్తున్న రాజుని ఒక విధమైన అహం ఆవరించసాగింది. ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న రాజు యథాలాపం గా తన ఉంగరాన్ని చూశాడు.వెంటనే ఙ్ఞానులు అందిచిన సందేశం గుర్తొచ్చింది. ఆందులో ఉన్న పత్రాన్ని మళ్ళీ తీసి చదివాడు-“ఈ క్షణం కూడా గడచిపోతుంది”.రాజు ని కమ్ముకున్న అహం పొరలు వీడసాగాయి.”నేనెంత మూర్ఖంగా ఆలోచించాను. ఈ క్షణం కూడా గడచిపోతోందంటే , ఇది నాది కాదు. గెలుపు నాది కాదు,ఓటమి నాది కాదు.సంతోషం ,దుఖం ఇవాళ ఉంటుంది,రేపు ఉండకపోవచ్చు. నేను కేవలం ప్రేక్షకుడినే” అని అనుకున్నాడు. గెలుపునైనా ఓటమిని సమంగా స్వీకరించే ప్రఙ్ఞ వచ్చింది.ఆనందమును,దుఖమును ఒక్కటి గా భావించే స్థితి లో కి వచ్చాడు. ప్రజా రంజకముగా పాలన సాగిస్తూ భావి తరాలకు స్పూర్తి గా నిలిచాడు.
కథ ఇంతటితో అవ్వలేదండొయ్!!! ఇప్పుడిక మన జీవితాల్లోకి ఈ కథని అన్వయించుకుందాము.
జీవితంలో ఎన్నొ ఆటుపోట్లని, సవాళ్ళని ఎదుర్కుని ఉంటాము. ఆనందం గా గడిపిన క్షణాలు ఎన్నో ఉండొచ్చు. కాని అవేవి శాశ్వతం గా ఉండలేదు.కాని ఈ ప్రపంచం లో ఏదీ శాశ్వతం కాదు ఒక్క మార్పు తప్ప. మార్పు ఒక్కటే శాశ్వతం. మనం ఈ మార్పు కి నిశ్శబ్ద సాక్షులం, ప్రేక్షకులం మాత్రమే. ఆందుకే దీన్ని అనుభవిద్దాము, అర్ధం చేసుకుందాము,ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిద్దాము, ఎందుకంటే-“ఈ క్షణం కూడా గడచిపోతుంది”.
P.S:నాకొచ్చిన ఈ-ఉత్తరం ఆధారం గా…