క్రితం వారాంతం మా ఆఫీస్ బృందం మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి మల్నాడ్ ప్రాంతం లో ఒకటైన హాసన్ జిల్లాలోని సక్లేష్ పూరకి వెళ్లాము. బెంగళూరు నుండి 6 గంటల ప్రయాణం.మల్నాడ్ మళె నాడు కి ఆధునిక రూపం.మళె నాడు లో మళె అంటే కొండ లేక వర్షం ,నాడు అంటే ప్రదేశం. షిమొగా,చిక్మగళూర్,హస్సన్,ఉత్తర కన్నడ జిల్లాలని మల్నాడ్ ప్రాంతం అని అంటారు.పశ్చిమ కనుమల అందాన్ని ఈ ప్రాంతంలో చూడొచ్చు.
మళె నాడ్ పేరుకి తగినట్లుగా మేము ప్రయాణం చేసిన మార్గం చుట్టూ కొండలతో, కాఫీ తోటలతో ,అప్పుడప్పుడు వర్షం పడుతూ చాలా ఆహ్లాదకరం గా ఉంది.దీని వల్ల అలసట తెలియలేదు.ఇంతలో మేము బస చెయ్యబోయె రిసార్ట్ వచ్చింది.పేరు Jenukallu Valley Retreat .రిసార్ట్ సక్లేష్పూర నుంచి 27 కి.మీల దూరం లో ఉంది.ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల బసకి ఇబ్బంది కలగలేదు.కాటేజస్ అన్ని సౌకర్యం గా మరియు శుభ్రంగా ఉన్నాయి. మరికొంతమందికి తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేశారు.
ప్రయాణం మొత్తం ఆటపాటలతో గడచిపోయింది. రిసార్ట్ చేరిన వెంటనే ఎవరికి వారు ముందుగా వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్ళి సామాను సర్దుకున్నాము.తరువాత జట్లుగా విడిపోయి వాలీ బాల్,త్రోబాల్ ఆడ్డం మొదలుపెట్టాము.తరువాత ఆ రాత్రి డి.జె నైట్ జరిగింది.అందరిలో దాగిఉన్న కళాకారులు బయటకి వచ్చారు.రాత్రి చాలా హుషారుగా గడచిపోయింది.మరుసటి రోజు స్లష్ వాలీ బాల్ ఆడి,దగ్గరలో ఉన్న జలపాతం కి వెళ్లివచ్చాము.జలపాతానికి చేరుకొవడానికి చిన్నపాటి త్రెక్కింగ్ చెయ్యవలసి వచ్చింది.తరువాత కాటేజస్ కి వచ్చి తయారయ్యి భోజనాలు కానిచ్చి మది నిండా ఙ్ఞాపకాలతో తిరిగి బెంగళూరుకి ప్రయాణమయ్యాము.
ఈ రిసార్ట్లో నాకు నచ్చిన మరొక అంశం భోజనం. మల్నాడ్ వంటలను రుచి చూపించారు. ఇంట్లో తయారు చేసిన భోజనం లానే ఉంది.
రిసార్ట్ కి దగ్గరలోనే జేనుకల్లు అని పిలవబడే కొండ ఉంది.ఇది కర్ణాటకలోని రెండవ పెద్దదైన శిఖరం.దీనిపైకి త్రెక్కింగ్ కి వెళ్తారట.కాని మాకు సమయాభవం చేత వెళ్లడం కుదరలేదు.సక్లేష్పూరకి దగ్గరలోనే కుక్కె సుబ్రమణ్య,ధర్మస్థల,బేలూర్ ,హళెబీడు,శ్రావణబెళగొల ప్రదేశాలు ఉన్నాయి.
ఈ రిసార్ట్ కి బృందంగా ఏర్పడి వెళ్లడమే మంచిది భద్రత దృష్ట్యా. బృందంగా వెళ్ళితే చాలా బాగా ఎంజాయ్ చేసి రావొచ్చు.