Monthly Archives: సెప్టెంబర్ 2010

నేను-నా వోల్వో బస్ ప్రయాణం

సాధారణం

House pasting no Festival అని మన మెగాస్టార్ గారే స్వయం గా చెప్పారు.నేను కూడా దీనికి అతీతురాలిని కాదు. అసలు ఈ సోది అంత ఎందుకంటరా…ఈ మధ్యే (అంటే ఓ  ఎనిమిది నెలల ముందన్న మాట) నేను చెన్నై నుంచి మన ఉద్యాన నగరికి షిఫ్ట్ అయ్యాను .ఇల్లు సర్దుకోవడాలు,అపార్ట్మెంట్ లో పరిచయాలు పెంచుకోవడాలు ఇత్యాది కార్యక్రమాలు పూర్తి అయ్యి కుదుటపడేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఒక నెల ఇంట్లో అలా రెస్ట్ తీసుకునేసరికి చాలా బోర్ కొట్టేసింది. అసలే ఉద్యోగానికి అలవాటు పడిన ప్రాణమాయే ఏం చెయ్యమంటారు ..వెంటనే ఉద్యోగాన్వేషణలో పడ్డా. ఇంటర్వూలు అలా అలా కానిస్తుండగా ఒక శుభ దినాన కొత్త ఉద్యోగం వచ్చింది… ఆహా ఏమి నా భాగ్యం అని సంబర పడుతోంటే మా వారు ఉద్యోగం రాగానే సంబర పడొద్దు రోజు వెళ్ళిరా అప్పుడు సంబర పడుతువు గాని అని అన్నారు.నా ఆనందం లో నేను ఉంటే తను ఎందుకు ఆ మాట అన్నారో నాకు అర్ధం కాలేదు. ఊద్యోగం వచ్చిన విషయం స్నేహితులకి చెప్తే అందరూ కంగ్రాట్స్  అన్నారు…తర్వాతేమో ఆఫీస్ ఎక్కడ అన్నారు..నేనెమో స్టైల్  గా ఐ.టి.పి.ఎల్ రోడ్ అన్నాను…వెంటనే అక్కడా!! అంటూ తమ హాశ్చర్యం తో కూడిన ఆనందాన్నో  లేక సంతాపమో  తెలియని ఒక భావాన్ని ప్రకటించారు. వీళ్ళు కూడా ఇలా అన్నారేమిటి అనుకుంటూ  ఆఫీస్ కి ఏ యే   బస్సులు  వెళ్తాయో ,ఎంత సేపు పడుతుంది అనే వివరాలు సేకరించే పనిలో పడ్డా.బస్ ఫ్రిక్వెన్సి  బాగుందని కాకపొతే 1 గంట పైన ప్రయాణం అని చెప్పారు.ఇంతకు ముందే చెన్నై లో  ఇంత టైం ప్రయాణం చేసి ఆఫీస్ కి వెళ్ళేదాన్ని కాబట్టి ఇక్కడ కూడా అంతసేపే  కదా పర్లేదులే  అని నాలో నేను సరిపెట్టుకున్నాను.పైగా బెంగళూరులో  చక్కగా వోల్వోస్ విత్ ఎ.సి  బస్సులు ఉన్నాయి ప్రయాణం అలసట తెలియదులే అని డిసైడ్ అయ్యాను.

ేను కొత్త ఆఫీస్ లో చేరే శుభదినం రానే  వచ్చింది. చక్కగా వోల్వో బస్ లో వెళ్ళాను. అటు ఇటుగా ఒక గంటలో ఆఫీస్ కి వచ్చేశాను. బాగుందనిపించింది,ఎందుకనగా ఇంతకు ముందు చెన్నైలో ఉన్నప్పుడు అఫీస్ బస్ మిస్ అయితే‘చెన్నై మానగర పోక్కు వరత్తు కళగం’(అదేనండీ Chennai Metropolitan Transport Corporation  వారు,ఇలా వారి భాషలో చెప్పకపొతే తమిళ సోదరులకి కోపం వచ్చేస్తుంది మరి) వారిచే నడప బడే బస్సులో ప్రయాణం చేసిన నాకు ఈ వోల్వో పుష్పక విమానం లా అనిపించింది. ఎందుకు అందరూ ఇలా భయపెట్టారో అర్ధం కాలేదు.ఒక వారం రోజులు బాగా…………..నే అనిపించింది. నేను వెళ్ళే రూట్,ఆఫీస్ కొంచం అలవాటయ్యింది.  ఇక వోల్వో లో నుంచి బెంగళూరు అందాలను మరియు అలాగే వారు ప్రయాణం టైం లో ఫ్రీ గా వినిపించే ఎఫ్.యం  పాటలను ఆస్వాదించడం మొదలు పెట్టాను.నా తోటి ప్రయాణికులేమో చక్కగా పాటలు వింటూనో లేక చదువుతూనో కనిపించేవారు.నాకు కాలక్షేపం అవ్వడం కోసం నేనూ చదవడం మొదలు పెట్టాను.వీరి పుణ్యమా అని నేను రెండు మూడు నవలలు పూర్తి చేసేశాను.

ఏ  మాటకి ఆ మాట చెప్పుకొవాలి ఈ ఎఫ్.యం  రేడియో  ల పుణ్యమా అని నాకు కన్నడ సినిమా ఙ్ఞానం  కొంచెం కలింగింది.వారి కన్నడ హాడుగళు  ఓ సారీ పాటలు వినడం జరిగింది.భాష అర్ధం కాకపోయినా   బాగున్నాయి.మన తెలుగు పాటల కంటే  చాలా నయం అనిపించింది.ఆహా ఈ హాడుగళు (పాటలు) వినడానికింత ఇంపుగా ఉన్నాయి,ఇక వీటిని తెరపై ఎలా చిత్రీకరించుంటారో అన్న ఉత్సుకత మొదలయ్యింది.ఇంటికి రాగానే కన్నడ ఛానెల్స్ పైన దాడి చెశాను. కొన్ని పాటల చిత్రీకరణ బాగుందని పించింది(ఇక్కడ హీరో,హీరోయిన్ల ముఖాలు చూడలేదనుకోండి) :).కాని ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది.

ఏదో అలా నా ప్రయాణం మూడు స్టాపింగ్స్,ఆరు పాటలతో గడచిపోతుండగా, మన  బెంగళూరు ప్రాధికారిక అభివృధి మండలి వారు ఫ్లై ఓవర్ల నిర్మాణమనే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానితో మెట్రో రైలు నిర్మాణ కార్యక్రమం కూడా.ఇహ చూసుకోండి నా కష్టాలు మొదలయ్యాయి. 😦  . అసలే ఇరుకిరుకు రోడ్లు,నత్త నడకగా సాగే  ట్రాఫిక్ దీనివల్ల నత్త కంటే స్లో గా మూవ్ అయ్యేది. బస్ లో కూర్చున్న వాళ్ళకి విసుగ్గా ఉంటే..నిలబడుకుని ప్రయాణం చేసే వారి పరిస్థితి ఇంకా దారుణం. నేను ఒకట్రెండు సార్లు నిలబడి ప్రయాణం చేసా. నా వల్ల కాలేదు. :(.వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతక్కగా మా ఆఫీస్ లోనే కొంత మంది కార్ పూలింగ్ చేసుకుని  వస్తున్నారని తెలిసి నేను కూడా చేరిపొయా.

ఈ బస్సుల్లో నిలబడి ప్రయాణం చేసే బాధ తప్పినా, ట్రాఫిక్ లో మాత్రం ఇరుక్కు పొతున్నాము. ఇంకా ఫ్లై ఓవర్ల నిర్మాణం కొనసాగుతూ………………………..నే ఉంది మరి. ఇప్పుడర్ధమయ్యింది మా వాళ్ళు నా పై హాశ్చర్యానందముతో కూడిన సంతాపాన్ని  ఎందుకు ప్రకటించారా అని. 😦

ఈ మధ్యే ఓ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయ్యిందని సంబర పడుతూంటే మళ్ళీ కొత్త నిర్మాణాలని  మొదలుపెట్టేసారు మన పాలికె వారు.దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 😦

కానీ ట్రాఫిక్ లేని టైంలో ,వోల్వో బస్సులో జనం తక్కువగా ఉన్నప్పుడు,అలా పాటలు వింటూ ప్రయణం చెయ్యడం ఆహా..నాకైతే గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. 🙂

ఇవండీ నా వోల్వో బస్సు ప్రయాణ కబుర్లు!!! ఈ టపా ఇప్పుడెందుకు రాశానంటారా రెండు రోజుల ముందే వోల్వో లో  ప్రయాణం చేసా అదీ ట్రాఫిక్   లేని టైంలో ..అదన్న మాట సంగతి…