Monthly Archives: మే 2011

ఏతెంచితి మేలుకోటె!!!

సాధారణం

“Tourist places around Bangalore” అని గూగులమ్మని అడిగిన వెంటనే ఓ పేద్ద లిస్టు ఇచ్చినా సరే ఏం చేతనో ఈ సంవత్సర కాలంలో ఒక రోజు ట్రిప్స్ కి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు.ఈ సారి అలా కాకూడదని ఎక్కడికైనా వెళ్ళాలని నేనూ,మా వారు కుంచెం ఘాట్టిగా అనుకున్నాము. తనేమో ప్లేస్ నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పి చల్లగా జారుకున్నారు.సరే అని ఇద్దరు,ముగ్గురు ఫ్రెండ్స్ ని అడగ్గా బోలెడు ప్లేసెస్ చెప్పారు.మన వంతు ప్రయత్నం చేయాలి కదా అని “places for one day trip around Bangalore”  అని మళ్ళీ గూగులమ్మని అడగ్గా విసుక్కోకుండా అడిగిన  సమాచారాన్ని ఇచ్చింది.సరే ఇచ్చిన లిస్టులో ఒక్కో పేరు చూసుకుంటూ కరెక్ట్గా ఓ పేరు దగ్గర ఆగిపోయా.కొంచెం ఫ్లాష్ బాక్ గుర్తొచ్చింది.మధ్యలో ఈ ఫ్లాష్ బాక్ గోలెంటి అని మీరు అడగడం నాకు అర్ధం అయ్యింది.అక్కడికే వస్తున్నాను. ఆ పేరు చూడగానే ముళ్ళపూడి వారు గుర్తొచ్చారు. ఆయనకి దీనికి ఏంటి సంబంధం అనే కదా మీ ప్రశ్న.ముళ్ళపూడి వారు “కోతి  కొమ్మచ్చి”లో ఓ సారి మేలుకోటె అనే ఊరు గురించి రాసారు.అది చదివిన వెంటనే అది ఎక్కడుందో తెలియక పోయినా అక్కడికి వెళ్ళాలని అనిపించింది. ఇప్పుడు సరిగ్గా ఆ పేరు చూడగానే  అదంతా గుర్తొచ్చింది.వివరాలవి చూస్తే పొద్దున బయల్దేరి సాయంత్రానికి ఇల్లు చేరుకోవచ్చు అని తెలిసింది.ఇదే  మనకి తగినదని మనం మేలు కోటె కి వెళ్తున్నాము అని ఇంట్లో చెప్పేసా.

ఉదయం ఏడు గంటలకి బయల్దేరాలనుకున్నవాళ్ళం కుంచెం ఆలస్యమయ్యి ఇల్లు వదిలేసరికి ఎనిమిదయ్యింది.మేలుకోటె కి వెళ్ళాంటే బెంగళూరు-మైసూరు హై వే మీదుగా ప్రయాణం.దారంతా టూరిస్ట్ బళ్ళూ,కారులు.ట్రాఫిక్ కొంచెమెక్కువే ఉంది. అదేమిటని మా వాహన చోదకుడిని అడిగితే ఇది తక్కువ మేడం,పొద్దున 4,5 గంటలకి కి ఇంకా ఎక్కువుంటుంది అని సెలవిచ్చాడు.ఆ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగా దారిలో చన్నపట్న,రాం నగర,మద్దూరు,మండ్య లాంటి ఊళ్ళు మాకు స్వాగతం చెప్పి వీడ్కోలు పలికేసాయి.ఒక్కో ఊరికి ఒక్కో విశిష్ఠత ఉంది.  అదేమిటయ్యా అంటే…ఇవి..

రాం నగర-పట్టు మార్కెట్ కి ఫేమస్ కావడం చేత దీన్ని సిల్క్ సిటి అని అంటారు.కానీ నాకెక్కడ షాపులు కనిపిలా..కనిపిస్తే ఎంచక్కా షాపింగ్ చేసి నాలుగు “రేష్మి సీరెగళు” కొని వచ్చుందును. రాం నగర జిల్లాకి ప్రధాన కేంద్రం.

చన్నపట్నని “సిటి ఆఫ్  టాయ్స్” అని అంటారు.ఇక్కడ చెక్క బొమ్మలు ,లక్క వస్తువులు బాగా ఫేమస్. అప్పుడెప్పుడో ఓ సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఓ చెక్క వింటేజ్ కారు బొమ్మ, ఎడ్ల బండి తీసుకున్నాను. ఇంకా బోలెడు బొమ్మల కలెక్షన్ ఉంది.తీరిగ్గా వచ్చి షాపింగ్ చేసుకోవాలి.

మద్దూరు-దీనికి స్వాగత మరియు వీడ్కోలు ద్వారాలు లేకపోవడం వల్ల దీన్ని ఏమంటారో తెలియ లేదు. కానీ ఇక్కడి వడ బాగా ఫేమసంట. మద్దూరు వడ తినేదానికే టూరిస్ట్ లు వస్తారంట.

ఇహ పోతే తర్వాత వచ్చేది మండ్య.మండ్య జిల్లాకి ప్రధాన కేంద్రం. ఈ జిల్లా వ్యవసాయపరంగా వృద్ది చెందింది.ఇక్కడ చక్కెర ప్రధానంగా ఉత్పత్తి అవ్వడం చేత “సిటి ఆఫ్ సుగర్” అని అంటారు.మండ్య నగరాన్ని దాటి రాగానే  చుట్టూ చెరకు పొలాలు కనిపించాయి.

ఇవి దాటాక మేలుకోటె కి వెళ్ళడానికి సైన్ బోర్డ్ కనిపించింది.దారికి ఇటు అటు పక్క పొలాలు మధ్యలో చిన్న రోడ్. ఇది ఆ ఊరికి వెళ్ళేదానికి  దారి.ఏడుకి ముందే ఇల్లు వదిలి ఉంటే ఎండ వేడి తెలిసి ఉండేది కాదేమో.మేము వెళ్ళే సరికి మిస్టర్ సూర్యారావ్ తన ప్రతాపాన్ని చూపిస్తూన్నాడు.ఇంకెంత దూరం అని అనుకుంటుండగానే ఊరి పొలిమేరలోకి వచ్చేసాము. ఓ పక్కగా కొండలు,ఓ కొండ పైన గుడి…వావ్…భలే ఉందనిపించింది. అంతకు ముందే కొంచెం ఆ ఊరి గురించి నేను గూగులమ్మ ద్వారా కనుక్కోవడం చేత అది యోగ నరసింహ స్వామి వారి ఆలయం అని గుర్తు పట్టేసా.

మేలుకోటెలో ప్రధానంగా రెండు ఆలయాలు ఉన్నాయి.ఒకటి చెలువ నారాయణ స్వామి వారిది ఇంకొకటి కొండ పై ఉన్న యోగ నరసింహ స్వామి వారిది.మొదటగా చెలువ నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము.గుడి రద్దీగానే ఉంది.బాగా పాతది గా ఉంది. గర్భగుడికి దగ్గరలోనే ఉత్సవ మూర్తి విగ్రహం ఉంది. స్వామి వారి దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని చూసుకుని బయటకి రాగానే ఒక మండపం ఉంది. అక్కడ ఉన్న  స్థంభాల పై  శిల్ప కళ అద్భుతంగా ఉంది. వెంటనే కెమెరా కి పని చెప్పా.అక్కడ ఉన్న మంటపంలో కెమెరా కన్నులోనుంచి చూసినవి.

రంగనాథ స్వామి వారు


ఇక్కడ దర్శనం అయ్యాక కొండపై ఉన్న నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. అన్ని మెట్లు ఎక్కలేమని అత్తయ్య,మామయ్య గారు రాలేమని చెప్పారు. నేనూ,మా వారు వెళ్ళాము. ఓ అరగంటలో కొండ పైకి చేరుకున్నాము.మధ్యలో విశ్రమించడానికి చిన్న చిన్న మండపాల్లా ఉన్నాయి. అక్కడింకా పేద్ద క్యూ ఉంది.యోగ ముద్రలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని బయటకి రాగా అక్కడ నుంచి వ్యూ అద్భుతం గా ఉంది. అక్కడా కెమెరా కి పని చెప్పా. కొండ దిగి బయటకి రాగా కొద్ది దూరంలోనే కళ్యాణి అనే పుష్కరిణి ఉంది. పుష్కరిణి చుట్టూ మండపాలు అవీ ఉన్నాయి. ఈ పుష్కరిణిని చాలా సినిమాల్లో చూపించారంట.

కొండపై నుంచి తీసిన పుష్కరిణి చిత్రం

నరసింహ స్వామి వారి ఆలయం

చెలువ నారాయణ స్వామి వారి ఆలయ ప్రాకారం

ఇవన్నీ ముగించుకునేసరికి 3 గంటలయ్యింది.  అప్పటికే  ఆత్మా రాముడు గోలపెట్టేస్తున్నాడు. చెలువ నారాయణ స్వామి వారి  ఆలయం దగ్గరలోనే మఠాలు ఉన్నాయి. అవి యాత్రికులకి అన్నదానం,వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. కానీ హోటల్స్ లాంటివి లేవు.కానీ ఇక్కడి పులిహోర మరియు చక్ర పొంగలి చాలా బాగా ఉంటుండంట. ఏ మస్ట్ ట్రై అట. కానీ అక్కడ మాకేమి అవి కనిపించకపోతే   మండ్యకి వచ్చి భోజన కార్యక్రమాన్ని ముంగించుకున్నాము. ఇలాంటి రిస్కులు తీసుకోవడం ఎందుకనుకుంటే ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళడం బెటర్. మండ్య  నుంచి శ్రీ రంగపట్న దగ్గర అని చెప్తేనూ అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామి వారి దర్శనం చేసుకుని  వచ్చాము.

మేలుకోటెలో శ్రీ రామానుజాచార్యులు 12 ఏళ్ళ పాటు ఉన్నారన్న వివరాలు తప్పితే ఆ ఆలయాల ప్రాశస్త్యం గురిచిన వివరాలు ఏమీ తెలీదు. చెలువ నారాయణ స్వామి వారి ఆలయం బయట మాత్రం ఓ బోర్డ్ పెట్టారు కొన్ని వివరాలతో. మెయింటెనన్స్ చాలా చెత్తగా ఉంది. 😦  ఇట్టా కాదని కొంచెం గూగ్లిస్తే మొత్తం వివరాలు తెలిసాయి. మేలుకోటె ని ‘తిరునారాయణపురం‘ అని కూడా పిలుస్తారు. ఇవి కాక వేదాద్రి,యతిస్థలం,నారాయణాద్రి,యాదవగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి.ఇక్కడి మూల విరాట్టుని తిరునారాయణ అని కూడా పిలుస్తారు.ఉత్సవ మూర్తిని చెలువపిళ్ళె రాయ అని,సంపత్ కుమార అని పిలుస్తారు.అమ్మవారిని యదుగిరి తాయార్ అని అంటారు.కానీ  ఉత్సవ మూర్తి అసలు పేరు రామ ప్రియ అట.ఈ ఉత్సవ మూర్తి సూర్య వంశ  రాజులకు చెందిందనీ తరతరాలుగా ఆ వంశ రాజులు పూజించేవారని ప్రతీతి.స్వయం గా శ్రీ రామచంద్రుల వారు పూజించేవారు కనుకు దానికి ‘రామ ప్రియ‘ అనే పేరు వచ్చింది.  ఆ తరువాత చంద్ర వంశ రాజులు కూడా ఈ విగ్రహానికి పూజలు జరిపేవారట. ఈ విగ్రహం రాముల వారి చే మరియు కృష్ణుల వారి చే పూజలందుకున్నదని ప్రతీతి.శ్రీ కృష్ణుల వారే  స్వయం గా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని ఇంకో కథనం.

బిత్తిదేవ అనే కర్ణాటక రాజు రామానుజచార్యుల వారిని ఆదరించి శ్రీ వైష్ణవాన్ని తన మతంగా చేసుకుని తన పేరుని విష్ణువర్ధనుడిగా మార్చుకుంటాడు. అతనే పంచనారాయణ ఆలయాలను కట్టిస్తాడు. అప్పుడు ఈ నారాయణపురం గుడి శిథిలావస్థ లో ఉందని,మూల విరాట్టు కనిపించకుండా  పోతే తిరిగి ఆచార్యులవారికి యాదవగిరి కొండ పై తులసి మొక్కల మధ్య దొరగ్గా తిరిగి పునః ప్రతిష్టించారని చెప్తారు. దక్షిణాది పై ముస్లిం పాలకుల దండ యాత్రలు జరిగినప్పుడు,ఈ ఉత్సవ మూర్తి విగ్రహం కనిపించకుండా పోతే ఆచార్యుల వారే డిల్లీ లో ని ఓ ముస్లిం పాలకుడి వద్దనుండి తిరిగి తీసుకుని వచ్చారని ఇంకో కథనం.అతని కూతురు ఆ విగ్రహాన్ని విడిచి ఉండలేక ఆచార్యుల వారితో మేలుకోటేకి వచ్చి అందులోనే ఐక్యమయ్యిందని ఐతికం.ఆవిడనే ‘బీబీ నాచియర్‘ అని పిలుస్తున్నారు.

ఇక్కడి విగ్రహాలు  పన్నెండో శతాబ్దం కంటే ముందుదని పురావస్తు శఖాధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఆలయ నిర్వహణను తరువాత మైసూరు రాజులయిన ఒడెయార్లు స్వీకరించారు.  రాజా ఒడెయార్ ఈ స్వామి పరమ భక్తుడు.ఈ గుడికి తరచూ వచ్చి స్వామి వారి దర్శనం చేసుకునే వాడు.స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహుకరించాడు.దీనినే రాజ ముడి అని అంటారు.స్వామి లోనే ఐక్యం అయ్యారని నమ్మిక.అతని వంశస్తుడే ఐన కృష్ణరాజ ఒడెయార్ III ఇంకో కిరీటాన్ని స్వామి వారికి బహుకరించాడు. దానినే కృష్ణరాజ ముడి ,కృష్ణరాజ ముకుట అని అంటారు.ఈ రెండూ కాక ఇంకో పురాతన వజ్ర కిరీటం ఉంది.దాన్నే వైర ముడి,వజ్ర ముడి,వజ్ర ముకుట అని పిలుస్తారు. దీన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ఇచ్చారని చెప్తారు.

ఈ కిరీటాలను స్వామి వారికి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలంకరిస్తారు. మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలాగో  ఇక్కడ వైరముడి బ్రహ్మోత్సవాలు  అంత బాగా జరుగుతాయట. శ్రీ వైష్ణవులకి ముఖ్యమైన రోజు. వజ్రకిరీటానికి సూర్య రశ్మి సోకకుండా ఓ పెట్టెలో భద్రపరచి తీసుకు వస్తారట.కిరీటాని ఆచార్యుల వారి సన్నిధిలో ఉంచిన తరువాత ప్రధాన పూజరి కళ్ళకి గంతలు కట్టుకుని ఉత్సవమూర్తికి కిరీటాన్ని అలంకరిస్తారట. మాములప్పుడు ఈ కిరీటాన్ని చూడకూడదట.కిరీట ధారణ తరువాత స్వామి వారు తన దేవేరులతో పుర వీధుల్లో భక్త కోటికి దర్శనమిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం,నాగవల్లి మహోత్సవాలు ముఖ్యమైనవి.

యోగ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రహ్లాదుడు ప్రతిష్టించారని నమ్మకం. స్వామి వారికి కృష్ణరాజ ఒడెయార్ III స్వర్ణ కిరీటాన్ని బహుకరించారు.  ఇక్కడ సంస్కృత వేద పాఠశాల ఉంది. wild life sanctuary ఉంది.

బెంగళూరు-మైసూరు హైవే లో ఓ రెండు కాఫి డేలు ,ఓ బరిస్తా తో పాటు అడిగాస్,కదంబం,కామత్,మెక్ డి వంటి భోజన ఫలహారశాలలు ఉన్నాయి.ఛాయిస్ మీ ఇష్టం.మొన్న వెళ్ళినప్పుడు కె.యఫ్.సి రెడీ అవుతోంది. 🙂

అవండీ నా మేలుకోటే పర్యటన విశేషాలు..ఎలా ఉన్నాయి? అందరికీ నారాయణుని అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను…

నాకో డౌట్…రాముడు,కృష్ణుడు రెండూ విష్ణువు ధరించిన అవతారాలే కదా…మరి వాళ్ళు నారాయణుడిని పూజించడమేమిటి??నారాయణుడు అంటే కూడా విష్ణువే కదా.. ఈ డౌట్ ని క్లారిఫై చెయ్యగలరా ప్లీజ్…

ప్రకటనలు

అప్పుడెప్పుడో చదివా…ఇప్పుడు రాస్తున్నా..

సాధారణం
అప్పుడెప్పుడో “Dark Goddess” టపా రాసినప్పుడు…ఈ నవల పూర్తి చేశా…అప్పుడే దీని గురించి రాద్దామని 
అనుకున్నాను…మళ్ళీ ఒక డౌట్ వచ్చింది…ఈ అమ్మాయికి ఏమి పన్లేదు ఎప్పుడూ పుస్తకాల గురించే రాస్తూ
ఉంటుంది అని అనుకుంటారని కొన్ని రోజులు ఆగా…:P..ఆ కొద్ది రోజులు ఇన్ని రోజులు అయ్యాయి…
మీరేమి అలా అనుకోరని నాకు తెలుసు…అందులోనూ ఇది నాకు బాగా నచ్చిన నవల.లేటయ్యితే అయ్యింది 
కానీ మంచి నవలని పరిచయం చేయటం మిస్సవ్వకూడదని ఇప్పుడు ఈ టపా స్టార్ట్ చేసా.

అనగనగా ఓ స్కూల్…ఎంతో మంది విద్యార్థులను మంచి విద్యావేత్తలు గా,మంచి పౌరులుగా తీర్చిదిద్దిన స్కూల్…
ఉత్తమ క్రీడాకారులను దేశానికి అందించిన ఘనత కలిగిన పాఠశాల.ఏ స్కూల్ కి లేని పే.....ద్ద క్రీడా 
మైదానం దీని సొంతం.మిగతా పాఠశాల్లలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న ఆ విద్యాధామం ప్రస్తుతం
గత వైభవాన్ని కోల్పోయి తన మనుగడ కోసం పోరాడుతోంది.అలాంటి పరిస్థితుల్లో ఆ స్కూల్లోనే ఇది వరకు
పనిచేసి రిటైరైన విశ్వనాథ శర్మని తిరిగి ప్రిన్సిపాల్ గా నియమించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానిస్తుంది.
శర్మగారు క్రీడా విభాగాన్ని అందులోనూ క్రికెట్ జట్టుని మరింత ప్రోత్సహించాలని కొన్ని తీర్మానాలను 
తయారు చేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ప్రవేశపెట్టగా డైరెక్టర్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
ఆ తీర్మానాన్ని ఇద్దరు బలంగా వ్యతిరేకిస్తారు.వారు ఆ స్కూల్లోనే పనిచేసే టీచర్,ఇంకొకరు ఆ స్కూల్
పూర్వ విద్యార్థి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి.ఆ క్రీడా మైదానంపై కన్నేసిన అతను ఎలాగైనా దాన్ని
సొంతం చేసుకోవాలని ఆశిస్తాడు.టీచరేమో తనని తాను ఆ స్కూల్కి ప్రిన్సిపల్ గా ఊహించుకుని మరిన్ని 
కోచింగ్ సెంటర్లు పెట్టాలని కోరుకుంటుంటాడు.

శర్మ గారు చెప్పినది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని,ఆట స్థలం వల్ల ఏ ఉపయోగం లేదని దానికి బదులు
ఆ స్థలంలో ఏదైనా బిల్డింగ్ కట్టి కోచింగ్ సెంటర్ లాంటిది ప్రారంభిద్దామని సలహా ఇస్తారు.అందుకు ఒప్పుకోని
శర్మగారు తన వంతు వాదనని వినిపిస్తారు.పిల్లలకి చదువుతో పాటు “Extra Curricular activities”
కూడా ముఖ్యమని అందులోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్స్ టీంలో ఉన్నారని వారిని ప్రొత్సహిస్తే 
భవిష్యత్తులో మరింత రాణిస్తారని చెప్తారు. దానికి కన్విన్స్ అయ్యిన డైరెక్టర్స్ శర్మ గారి తీర్మానాలను
ఆమోదించబోగా దాన్ని వ్యతిరేకించి గత కొన్నేళ్ళుగా ఏ టోర్ని గెలవని స్కూల్ జట్టు పై టైం వృధా
చేయొద్దని చెప్తారు. శర్మ గారు కొద్దిగా టైమివ్వమని ఈ సారి జరిగే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శన
చూసి నిర్ణయించుకోమని చెప్పగా దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోద ముద్ర వేస్తారు.

శర్మ గారు ఆ స్కూల్ పూర్వ విద్యార్థి మరియు మంచి క్రికెటరైన సంపత్ ని క్రికెట్ కోచ్ గా నియమిస్తారు.
మొదట సంపత్ కోచ్ గా పనిచెయ్యడానికి ఒప్పుకోకపోయినా శర్మ గారి పట్టుదల,తనపై ఉన్ననమ్మకానికి
తలవంచి కోచ్ గా బాధ్యతలను స్వీకరిస్తాడు.మంచి ప్లేయర్సే అయినా మొక్కుబడిగా ఆడే జట్టు సభ్యుల్లో
సంపత్ ఎలాంటి మార్పుని తెచ్చాడు. శర్మ గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపాడా?
అండర్ డాగ్స్ గా ఉన్న స్కూల్ టీం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ ఐన ఎవర్ గ్లేడ్ స్కూల్ తో పోటి పడిందా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే బుక్ చదవాల్సిందే.

ఇదీ నేను అప్పుడెప్పుడో చదివిన "The Men with in-A cricketing Tale " కథాంశం.
ఈ కథంతా చదివిన తరువాత మీకేదో గుర్తుకు వస్తోంది కదా...ఆలోచించండి...

"మేము గెలవగలం" అనే నమ్మకాన్ని టీంలో కలింగించడమే సంపత్ ప్రధాన కర్తవ్యం.ఇందులో సంపత్ జట్టు
సభ్యులను మరియు కెప్టెన్ ని ఎంపిక చేయడానికి వాడే స్ట్రాటెజి,టీం బలాబలాలను అంచనా వేసే విధానం
ఇవన్నీఆసక్తికరంగా ఉంటుంది. అందుకు అతను ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు అన్నది బుక్ చదివి
తెలుసుకుంటే బాగుంటుంది.క్రీడా నేపథ్యంలో మనకి ఎన్నో సినిమాలు ,పుస్తకాలు వచ్చుంటాయి.కాని క్రికెట్
నేపథ్యంగా తీసుకుని వచ్చిన తొలి ఆంగ్ల నవల ఇదేనట.దీన్ని రాసినది మన తెలుగతనే.
పేరు హరిమోహన్ పరువు.ఇది హరిమోహన్ గారి తొలి నవల.


కానీ చదివితే తొలి నవల అని అనిపించదు.అంత చక్కగా,సరళమైన ఆంగ్ల పదాలతో రాశారు.
నవల చదువుతున్నంతసేపు స్కూల్లో నేనూ కూడా ఒక స్టూడెంటయ్యిపోయా..
టీం సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా రాసారు.వారి మధ్యన ఉన్న ఫ్రెండ్ షిప్,వారి అలకలు
ఇవ్వన్నీ చదువుతోంటే నేను కూడా నా స్కూల్ రోజుల్లోకి వెళ్ళొచ్చా. ఎక్కడా మనకి ఏదో పాఠం చెప్తున్నట్లు
అనిపించదు.ఆయా పాత్రల ద్వారా మనకి బోలెడు మేనెజ్ మెంట్ టిప్స్ అందించారు రచయిత. 

అలాంటి వాటిలో కొన్ని టిప్స్... ఇవి నాకు నచ్చినవి...ఇంకా బోలెడు ఉన్నాయి...గుర్తురావడం లేదు....
ప్లీజ్ అడ్జస్ట్ మాడి...

   Believe in yourself.
   Key to success is to Relaxation. Key to relaxation is breathing.
   The indication of excellence is when the small things are done well.
   Slow down but don't stop while doing any work.

నవల చదివితే ఫన్,యాక్షన్ తో పాటు బోలెడంత మోటివేషన్,ఇన్స్పిరేషన్ ఫ్రీ.
ఈ నవల అన్ని వయసుల వారికి,క్రికెట్ ప్రేమికులకి, క్రికెటర్స్ అవ్వాలనుకుంటున్నవారికి రికమెండెడ్..
ముఖ్యం గా కార్పొరెట్స్ కి హైలీ రికమెండెడ్.

ఇంతకీ స్కూల్ స్కూల్ అని చెప్పాను గాని స్కూల్ పేరు చెప్పలేదు కదా...ఈ నవల్లో అతి ముఖ్య పాత్ర 
పోషించిన స్కూల్ పేరు "గోల్కొండ పబ్లిక్ స్కూల్"...

రచయిత గురించిన మరిన్ని వివరాలు కావాలంటే ఈ వెబ్ సైట్ హరిమోహన్ చూడండి..
ఇందులో రచయిత నవల ప్రచురణానుభవాలు గురించి తెలుసుకోవచ్చు.బుక్ లాంచ్ గురించిన విశేషాలు..
ఈ నవల పై ప్రముఖుల అభిప్రాయాలు,రచయిత వ్యక్తిగత వివరాలు మరెన్నో ఉన్నాయి.
త్వరలోనే మరో మంచి పుస్తకం కబుర్లతో.....