Monthly Archives: జూన్ 2011

ఆదిత్య మూడు ఆరు తొమ్మిది

సాధారణం

మొన్న వీకెండ్  చూసిన సినిమా  గురించి రాసిన టపాలో మన తెలుగులో ఇలాంటివి ఎందుకు రావని రాసాను. ఇది రాసేటప్పుడు ఇలా ఎందుకు రాస్తున్నానా అని ఫీల్ అయ్యి చివరాఖరికి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలూ చూసి నాకు రాయక తప్పలేదు.

కాని రాసినప్పటినుంచి ఒకటే ఫీలింగ్…మన సినిమాలని మనమే తక్కువ చేసుకుంటామా అని,దాంతో  నాలో నేను ఫీల్ అయ్యి,మధన పడ్డా. ఇలా బాధల్లో ఎన్ని  రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్నీ ఫీల్ అయ్యిపోయాను..

ఐయ్ బాలివుడ్ తరువాత మనమే ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నాము…పౌరాణికాలు,జానపదాలు ,భక్తి రస చిత్రాలు తీయడంలో మనకి మనమే సాటి, అలాంటి మన తెలుగులో డిఫరెంట్ గా సినిమా తీయలేదా అని కొంచెం సినిమాల  లిస్ట్  గురించి తీవ్రంగా ఆలోచించా..

చాలా కాకపోయినా కొన్ని అనిపించాయి  రోటిన్ కి భిన్నం గా ఉన్నవి…కాని వాటి గురించి తరువాత చూద్దామని అనుకుంటూండగా ఈ సినిమా తట్టింది….

యురేకా అని నాలో నేను అరచుకొని అరె  ఈ సినిమాని ఎలా మిస్సయ్యానబ్బా అని అనుకున్నా….

అసలు విషయం చెప్పమ్మా అని అక్కడెవరో  అంటున్నారు…చెప్తాను ఆగండి….

ఏదో సినిమాలో శ్రీలక్ష్మి గారు వాళ్ళాయనతో తను చూసిన సినిమాల గురించి డీటెయిల్డ్ గా  వర్ణిస్తారు… సో ఆ స్టయిలో..

“టంటడాయ్  తడంతడాయ్….శ్రీ దేవి మూవిస్ వారి ఆదిత్య 369….
తారాగణం : యువరత్న బాలకృష్న,నూతన నటి మోహిని,అమ్రిష్ పురి,టినూ ఆనంద్,మాస్టర్ తరుణ్
తదితరులు…
రచన:సింగీతం శ్రీనివాస రావు,జంధ్యాల
సంగీతం: "సంగీత ఙ్ఞాని,మేస్ట్రో" ఇళైయరాజా
నిర్మాత: అనితా కృష్ణ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు"



సినిమా గురించి చెప్పబోయే ముందు కొంచెం ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళాలి…మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి అని అనుకోకండే…
ఫ్లాష్ బాక్ కొంచెం చిన్నదే త్వరగా ముగించేస్తా…

మా పెదనాన్న గారింట్లో వి.సి.ఆర్ ఉండేది…వాళ్ళు అప్పుడప్పుడు వీడియో కేసెట్లు తెచ్చుకుని సినిమాలు 
చూసేవారు.పెదనాన్న గారు ఏదైనా కేసేట్ తెచ్చారంటే అందరి ఇళ్ళకీ ఆహ్వానం వెళ్ళేది.ఫలానా సినిమా 
తెచ్చాము చూద్దాము రండి అని..

మా పిల్లల గాంగ్ ఇలా పిలవడం తరువాయి వెంటనే వెళ్ళిపోయే వాళ్ళము…వెళ్ళేప్పడు తినడానికి కాసింత
కారప్పూసో,చేగోడిలో ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాళ్ళము.

అప్పటికే వాళ్ళింట్లో ఇలా వచ్చే గాంగ్ కోసం ఏర్పాట్లు జరిగిపోయేవి…చక్కగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాక…
అన్నయ్య వాళ్ళు సినిమా పెట్టే వాళ్ళు….కాస్త ఆలశ్యమైతే మేము చేసే గోల తట్టుకోలేక కాస్త ఆగండర్రా
ఫలానా వాళ్ళు వస్తున్నారు,వాళ్ళు రాగానే మొదలు పెడదాము అని బుజ్జగింపులు,ఎవరైనా సినిమా కొంచెం 
మిస్సయ్యితే వాళ్ళ కోసం మళ్ళీ రిప్లేలు,నచ్చిన పాట వస్తే రిపీట్లు,నచ్చనిది ఏదైనా వస్తే ఫాస్త్ ఫార్వార్డ్లు,
ఫాస్ట్ ఫార్వార్డ్ చేసినప్పుడు తెగ నవ్వుకునే వాళ్ళము..ఇవన్నీ చెయ్యడానికి వి.సి.ఆర్ ఆపరేటర్ ఒకళ్ళు 
పర్మనెంట్ గా ఉండేవాళ్ళు…సినిమా వేసినంత సేపు మిని థియేటర్లా ఉండేది వాళ్ళ ఇల్లు.


వేసవి సెలవులు వస్తే వీడియో కేసెట్లు అద్దె కిచ్చే దుకాణంలో ఓ ఖాతా తెరిచే వాళ్ళము..అలా కేసెట్లు
తెచ్చుకుని ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో…

భలే ఉండేది అప్పట్లో….ఇంటిల్లపాదీ కూర్చుని సినిమా చూడ్డం మధ్యలో అమ్మా వాళ్ళు వెళ్ళి చిరుతిళ్ళు ఏవో 
ఒకటి చేసుకుని పట్రావడం…. :)

అలా వాళ్ళింట్లో చూసా ఈ ఆదిత్య 369…కానీ అప్పటికేమి గుర్తు లేదు… తరువాత ఫోర్త్ ,ఫిఫ్త్ క్లాస్ కి వచ్చాక 
మన డి.డి8 లోనో ఎందులోనో చూసినట్లు గుర్తు… థియేటర్లో చూడ్డం మిస్సయినా ఒకటి రెండు సార్లు ఇలా 
ఇంట్లో చూడ్డం వల్ల బాగా గుర్తుండిపోయింది ఈ సినిమా....నా ఆల్ టైం ఫేవరిట్స్ జాబితా లో చేరిపోయింది…

ఆ తర్వాత ఎప్పుడు చూసినా అప్పుడే కొత్తగా మూవి చూస్తున్న ఫీలింగ్ కలిగేది… అది సింగీతం వారి దర్శకత్వ 
ప్రతిభా మహిమో,నటీ నటుల నటనో,ఇ’లయ రాజు’ గారి సంగీత మాయ వలనో మరి… 

సైంటిఫిక్  ఫిక్షన్ బేస్ చేసుకుని తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సినిమా ఇదొక్కటేనేమో…

కథ మనందరికి తెలిసిందే కాబట్టి దాని జోలికి వెళ్ళను….మిగతా విషయాలు మాట్లాడుకుందాము…

టైం మెషీన్లో కాలంలో వెనక్కి వెళ్ళడం,భవిష్యత్తులోకి ప్రయాణించడం ఇలాంటివి సాధారణ ప్రజానీకం అంటే
నా లాంటి వారికి కూడా అర్ధమయ్యే రీతిలో బహు బాగుగా చెప్పగలిగారు ఈ సినిమాలో.అదే అనుకుంటా 
ఈ సినిమా గొప్పతనం.

టైం మెషీన్లో వెనక్కి ముందుకు వెళ్ళే ఎపిసోడ్స్ లో కృష్ణ దేవరాయల ఎపిసోడే అదుర్స్.ఫ్యూచర్ది కూడా 
బానే ఉంటుంది.అంతర్లీనంగా ప్రపంచం మొత్తం డేమేజ్ ఐతే భావి తరాలు వాళ్ళు ఇలా ఉంటారు అని 
చెప్పినట్లు అనిపించింది.హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారు...

సినిమా మొత్తం మీద నచ్చిన కొన్ని సన్నివేశాలు…

తరుణ్,మిగతా పిల్లల గాంగ్ మ్యూజియం దొంగలను పట్టుకోవటానికి టినూ ఆనంద్ లేబొరేటరికి వెళ్ళి టైం మెషీన్ 
స్టార్ట్ చేస్తే వాళ్ళని కాపాడబోయి అందులో హీరో హీరోయిన్లు ఇరుక్కు పోవడం…వాళ్ళు కాలంలో
ప్రయాణించేటప్పుడు…చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలు ఒక ప్రెసెంటేషన్ లా స్క్రోల్ అవ్వడం… 

విజయనగరం చేరుకున్నాక ఆ వైభావాన్ని బాగా చూపించారు….రత్నాలను వీధులో పోసి అమ్మేవారు అన్న
దానికి ఓ సన్నివేశం పెట్టారు కదా…అష్ట దిగ్గజాలను చూపించడం..తెనాలి రామకృష్ణుడు రాజు గారు ఇచ్చిన 
సమస్యలను పూరించడం…అందులో మన హీరో గారు అతను చెప్పాలనుకున్నది ఇతను చెప్పడం…మీకెలా 
తెలుసంటే మేము సినిమా చూసాము…అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వర రావు గారు వేసారు..ఆయన్ని
చూసి తెనాలి రామకృష్ణుడు ఇంత అందం గా ఉంటారు..మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు…ఈ మధ్య 
ఒళ్ళు చేసి పొట్ట పెంచి కాస్త పొట్టయినట్లున్నారు” అని అంటే దానికి రామకృష్ణుడు నీ భాషలో పొట్టి,పొట్ట తప్ప 
మిగతా ఏమి అర్ధం కాలేదు బాలకా అని అనడం..

మేక తోక ఎపిసోడ్…:):)

ఇహ అక్కడ నుంచి  ఫ్యూచర్ లోకి వెళ్తే అక్కడ మెషీన్లు ఏది చెప్తే అదే మనుష్యులు వినడం….మనసులో 
కూడా తిట్టుకోలేకపోవడం..బ్రహ్మానందం గారి భార్య కనిపించి అమ్మాయి పెళ్ళి కుదిరింది..అందరికీ చెప్పెయండి..
అందరూ వాళ్ళింత్లో కూర్చుని టి.వి లో చూసేస్తారు..వచ్చేటప్పుడు కూరగాయలు చీప్ ఉన్నాయంట..1500కి 
టొమాటోలు అవీ తీసుకు రమ్మంటుంది…:):) భూమి మీద ట్రాఫిక్ ఎక్కువయ్యి స్కై లో కూడా ట్రాఫిక్ జాం 
అవ్వటం..బాగా తీసారు ఈ ఎపిసోడ్స్ అన్నీ…


ఇదంతా చెప్పి మన నటీనటుల గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీలవుతారు,చదువుతున్న మీరు ఫీలవుతారు,
నేనూ ఫీలవుతాను.కాబట్టి ప్రధాన పాత్రధారుల గురించి ఓ నాలుగు ముక్కలు కాకపోతే ఓ ఎనిమిది ముక్కలు…

బాలయ్య బాబు:మన బాలయ్య బాబు సినిమాలు ఈ మధ్యన వచ్చినవి చూట్టం కుదరడం లేదు గానీ
చిన్నప్పుడు తెగ చూసేదాన్ని....ఈ సినిమాలో ఐతే బాగా హేండ్ సం గా కనిపించారు…శ్రీ కృష్ణ దేవరాయల 
వారి పాత్ర లో ఐతేనా సూపర్…ఆ పాత్ర బాగా నప్పింది…మొత్తానికి కృష్ణకుమార్ గానూ,దేవరాయలుగానూ
జీవించేసారు….

అమ్రీష్ పురి: బహు బాగుగా నచ్చే విలన్లలో ఈయన ఒకరు…ఒక్కోసారి తనని చూసి భయమేసేది.ముచ్చటైన 
విషయమేమిటంటే తన సంభాషణలను తానే తెలుగులో  పలకడం.ఆ యాస తమషాగా ఉంటుంది…:)

చంద్ర మోహన్: తెనాలి రామకృష్ణుని పాత్రలో బాగా చేసారు...సినిమా లో బాలయ్య బాబు మరియు 
చంద్ర మోహన్ గారి ఎపిసోడ్స్ నాకు నచ్చింది.


టినూ ఆనంద్: సైంటిస్ట్ పాత్రలో జీవించేసారు…బాలు గారి గాత్రం అతికినట్లు సరిపోయింది. 

ఇక హీరోయిన్ విషయానికి వస్తే మోహిని…అది తన మొదటి సినిమా అంట తెలుగులో ఉన్నంతలో
బానే చేసింది.సహాయ పాత్రల విషయానికి వస్తే స్మిత, చలపతి రావు,జె.వి.సోమయాజులు గారు కృష్ణదేవరాయల 
ఎపిసోడ్లో కథ నడవడంలో బాగా తోడ్పడారు…  

ఫ్యూచర్ ట్రాక్ లో శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం గారి పాత్రలు కూడా అంతే…  

వీళ్ళవన్నీ చెప్పిన తరువాత మన హీరో తరుణ్ బాబు గురించి చెప్పాల్సిందే…నాకు తెలిసి అప్పుడే అనుకుంటా
అంజలి సినిమా వచ్చింది..ఆ హేంగ్ ఓవర్ లో ఉన్నప్పుడే తరుణ్ ఈ సినిమా లో నటించినట్లు ఉన్నాడు...
1990స్ లో బాల నటులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలు బాగా వచ్చాయి కదా….తరుణ్,షామిలి,షాలిని 
వీళ్ళందరికి నేను పిచ్చ పంకా అప్పట్లో.. వీళ్ళందరూ అప్పట్లో బాల సెలిబ్రిటీలు కదా..:) 


తన పాటలతో, బాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసారు మేస్ట్రో..అన్నీ పాటలు బాగుంటాయి..ఏ పాటని చెప్పను…
నాకు కుంచెం ఎక్కువగా నచ్చినవి అంటే “రాసలీల వేళ,జాణవులే” పాటలు.

1991 లో విడుదల  అయ్యిన ఈ సినిమా 1992 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందుకొంది…అప్పుడే 
ఈ సినిమా వచ్చి ఇరవయేళ్ళయ్యి పోయిందన్న మాట..

ఇందులో ఒక సమస్యని ఇస్తారు కదా “బలరాముడు సీతని చూచి ఫక్కున నగియె” అని..దాన్ని
తెనాలి రామకృష్ణుల వారు పూరిస్తారు…ఆ పద్యానికి అర్ధం చెప్పగలరా ప్లీజ్…నిన్నే యూట్యూబ్ లో చూసా..
కానీ నాకు అర్ధం కాలేదు..:( 

ఈ టపా రాస్తున్నంతసేపు సినిమా దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతోంది…ఈ వీక్ ఎండ్ సినిమా చూసెయ్యాలి
అని డిసైడ్ అయ్యిపోయా… 

అంతవరకు అందరికీ టాటా బై బై… ఉంటానేం..

మీరంతా as usual keep rocking!!!