Monthly Archives: జనవరి 2011

జస్ట్ బుక్స్-రీడ్. రెంట్. రిటర్న్

సాధారణం


పైన పేరు చూసి ఏంటా అనుకోకండీ..ఇది నేను సభ్యత్వం తీసుకున్న లైబ్రరీ పేరు.బెంగళూరు కొచ్చాక ఫిట్నెస్  స్పృహ పెరిగింది నాకు. అందుకే   వీలునప్పుడల్లా వాకింగ్ గట్రా చేస్తున్నాను. అహ నువ్వు వాకింగ్కి  వెళ్తే ఏంటి  వెళ్ళకపొతే ఏంటి అని మీరనుకోవడం నాకు తెలుస్తోంది.అంచేత ఆ టాపిక్   ఇక్కడితో ఆపేస్తున్నాను.నేను చెప్పొచ్చిన విషయం ఏంటంటే..అలా ఒక శుభదినం వాకింగ్ కి వెళ్ళి తిరిగి వస్తోంటే ఇంటి దగ్గర ఏదో షాప్ పెట్టడానికి   సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదోలే అనుకుని వెళ్ళిపోయాము.తరువాత చూస్తే  అక్కడో ఓ లైబ్రరీ వెలిసింది. పేరు “Just Books”. వావ్..మన కాలనీ లో లైబ్రరీ అనుకుంటూ వెళ్ళి చూశాము.పుస్తకాల కలెక్షన్ ఏముందా అని చూడ్డానికి   వెళ్ళిన మేము వారి స్కీంస్ కి ముచ్చటపడి సభ్యులమైపోయాము. వారి  దగ్గర  ఆ యా ప్రాంతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా    ఉండడం అందులో సభ్యత్వం తీసుకోవడానికి ముఖ్య కారణం. నా ఖాతాని ఏ పుస్తకం తో ప్రారంభించలా అని ఆలోచిస్తుండగా యద్దనపూడి  వారి  నవల  ఒకటి కనిపించింది. యద్దనపూడి వారి గురించి వినడమే తప్ప వారి నవలలు ఇంతవరకు చదవకపోవడం తో వారి నవలైన “కీర్తి కిరీటాలు” తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చానే కాని వెంటనే చదవడం కుదరలేదు.

ఒక సెలవు రోజున ఒక శుభ ముహూర్తాన నవలని చదవడం మొదలు పెట్టా.  మొదటి రెండు పేజీలు చదివిన వెంటనే కొంచెం బోర్  గా ఫీల్ అయ్యాను. తర్వాతర్వాత నవలలో లీనం  ఎంతగా అయ్యానంటే ఆ రోజే  పూర్తి చేసేంత. ఒక్క సారి 1960,1970లలో  చూసిన తెలుగు సినిమాలు ఙ్ఞప్తికి రాసాగింది.  Perfect Screenplay!! అంత బాగా రాసారు. ఈ నవల ఇదివరకు చదివిన వారికి ఇలా అనిపించి ఉండొచ్చేమో.

మొత్తానికి యద్దనపూడి వారి నవలతో నా ఖాతాకి శుభారంభాన్ని ఇచ్చిన తర్వాత కొన్ని కథల సంకలనాలు చదివాను.తరువాత కొన్ని ఆంగ్ల నవలలు. ప్రతిసారి నా లైబ్రరీ ముచ్చట్లు చెబుదామని అనుకోవడం  ఏవో కారణాల  వల్ల  కుదరకపోవడం జరుగుతోంది.

చివరకి కారణాలతో మిగిలిపోకూడదని  టపా మొదలుపెట్టేసా. “Just Books” వారిది మా కాలనీ లోనే కాక మెయిన్ రోడ్లోనూ ఒకటి ఉంది. చాలా రోజులుగా అనుకుంటున్నాను  ఆ శాఖలో తెలుగుపుస్తకాల  కలెక్షన్ ఏముందా అని. మా ఇంటి  దగ్గర ఉండే దానిలోని తెలుగు పుస్తకాలన్నీ చదివేసాను.లిమిటెడ్ కలెక్షన్ :(. మొన్నే ఓ రెండు బుక్స్ రిటర్న్ చేద్దామని మెయిన్ రోడ్లోని బ్రాంచ్ కి వెళ్ళాము.

అక్కడ తెలుగు కలెక్షన్ చూస్తే శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథా సంకలనాలు,యద్దనపూడి వారి నవలలు మరి కొన్ని కనిపించాయి. ఆహా…నాకు ఈ వారం అంతా పుస్తకాల పండగే అని అనుకుంటూ యద్దనపూడి వారి “సెక్రెటరి”  నవలని తెచ్చుకున్నాను.

ఈ సారి వెళ్ళినప్పుడు ఇంకా తెలుగు కలెక్షన్ వాళ్ళ దగ్గర ఏముందో చూడాలి…

P.S:వారి వెబ్ సైట్ ద్వారా తెలిసిందేమిటనగా వారి లోగో మారిందని…ఆ లోగోనే ఇక్కడ పెడుతున్నాను….