Category Archives: సినిమా కబుర్లు

1920(నో కంఫ్యూషన్స్,ఇది సినిమా పేరు)

సాధారణం

టైటిల్ చూసి ఈ పాటికి మీకు అర్ధమయ్యిఉంటుంది..కాబట్టి టైటిల్ గురించి నో ఉపోద్గాతంస్…డైరెట్టుగా మేటర్ లోకి వచ్చేస్తా…..

రెండు వారాల ముందు అనుకుంటా…

వన్ సాటర్డే….

ఆ వారం లో మిస్సయిన ఎపిసోడ్ల రీ టెలికాస్ట్‌లు చూస్తూ ఉన్నాను…

సినిమాలు ఏం వస్తాయో అని అలా వరసగా ఛానెల్స్ తిప్పుతోంటే…అప్పుడే ఒక సినిమా జూం ఛానెల్లో మొదలయ్యింది…

టైటిల్ చూస్తే 1920….అరె ఈ సినిమా చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాం కదా…ఇప్పుడు చూద్దాము..అని కూర్చున్నా…అరగంట చూద్దాము…బాలేకపోతే వెళ్ళి పడుకుందాం అని సినిమా చూడ్డం మొదలెట్టా..

ఆల్రెడి హారర్ సినిమా అని తెలుసు….ఒక్కటే చూడాలంటే కొంచెం భయమేసింది…కానీ సినిమా మధ్యాహ్నం వేసాడు చూసేవచ్చులే అని అనిపించింది…

యాక్చువల్లీ  రాత్రి,మరికొన్ని దయ్యం సినిమాలు ఇంట్లో వాళ్ళందరితో చూసి అలవాటవడం వల్ల ఒక్కటే చూడాలంటే భయమేసేది… ఎప్పుడైనా అలా హారర్ సినిమాలు చూడాలని అనిపిస్తే మా ఇంట్లో ఒక బాచ్‌ని రెడి చేసుకునేదాన్ని తోడుగా…వాళ్ళు రెడిగా లేకపోయినా ఆ సినిమా గురించి ఏదొ ఒకటి ఊదరగొట్టి..ఆ సినిమా బెమ్మాండం గా ఉంటుంది..ఎంత థ్రిల్లింగా ఉంటుందో తెలుసా..మనం చూద్దామని చెప్పి వాళ్ళని రెడి చేసేదాన్ని..

ఓ సారి ఏమయ్యిందంటే…ఓ అరవ డబ్బింగ్ సినిమా యాడ్ చూసా..చూస్తే ఏవో ఆత్మలు..మాంత్రికులు గట్రా ఉంది…అరరె ఇది కూడా ఏదో  హారర్ సినిమాగా ఉంది,ఇంటెరెస్టింగ్ గా ఉంది….కాని మనకి బాచి లేదే…ఇప్పుడేం చెయ్యాలని ఆలోచించా…

అమ్మ దగ్గరకి పిల్లలు ట్యూషన్ కి వచ్చేవాళ్ళు…

ట్యూషన్ అయ్యాక…మీకొకటి తెలుసా..రేపు టి.వి లో ఒక దయ్యం సినిమా వేస్తున్నారు…యాడ్ సూపర్ గా ఉంది…రేపందరం మనం ఇంట్లో చూద్దాము..మీరు వస్తారా అని అడిగా…సినిమా గురించి బోలెడంత బిల్డప్ ఇవ్వడం వల్ల వాళ్ళు వస్తామని ఒప్పుకున్నారు…అలాగే సేం టు  సేం మా రాక్షసి కి, అమ్మకి చెప్పడంతో వాళ్ళూ ఒప్పేసుకున్నారు…

అనుకున్నట్లుగానే ట్యూషన్ ఫ్రెండ్స్ వచ్చారు..  ఒక ఐదారు మంది తయారయ్యాము సినిమా చూడ్డానికి…. మధ్యలో తినడానికి చిరుతిండ్లూ తెచ్చుకుని పెట్టుకున్నాము…

సినిమా మొదలయ్యింది…దయ్యం రాలేదు…సర్లే మధ్యలో వస్తుందిలే అని అనుకున్నాను..ఇంటర్వెల్ కి రాలేదు..ఇదేం సినిమా ఇంతవరకు అసలు దీన్ని చూపీలేదు అని విసుగు వస్తోంది..మా ట్యూషన్ ఫ్రెండ్స్ నన్ను ఎగా దిగా చూట్టం మొదలెట్టారు..నాకేమి తెలుసు యాడ్ భయానకం గా చూపించారు,ఇప్పుడు కాకపోతే ఇంకొంచెం సేపు తరువాత వస్తుందిలే….మిగతా సినిమా చూడండెహె అని కవర్  చేసి కళ్ళు మూసుకున్నాను…

ఆ తర్వాత కరెక్టుగా క్లైమేక్స్ కి కళ్ళు తెరిచా..అప్పటికి గానీ దయ్యం రాలేదు..వచ్చినా ఎంతసేపు ఉందనుకున్నారు.. ఓ 10 నిమిషాలు కూడా ఉండలేదు..ఇంతలోపల అమ్మవారు ఆవహించిన వీరోయిన్ వచ్చి దయ్యాన్ని చంపేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేసింది…

సినిమా అయ్యాక ఫ్రెండ్స్ నీకో దండం నీ సినిమాకో దండం తల్లీ,మమ్మల్ని వదిలెయ్యి…మిస్ మాకు తలనొప్పిగా ఉంది ,ట్యూషన్ కి రేపొస్తాము అని అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు.అప్పటి వరకు కాం గా ఉన్న మా అమ్మ కొట్టడమొక్కటే తక్కువ… 🙂

అప్పటినుంచి బాచిలు ఫాం చేయకుండా…ఏదో అలా మధ్యాహ్నాలు మా తాతగారు,నాన్నమ్మ నిద్రపోతోంటే టి.వి సౌండ్ చాలా తక్కువలో పెట్టుకుని సినిమా చూసేదాన్ని…(హారర్ సినిమా వస్తే )

1920 కథ ఆల్రెడి తెలిసిందేలే ధైర్యం గా చూసేద్దాంలే అని తోడుకి మా వారిని పిలవలేదు…కొద్ది సేపయ్యక తనే వచ్చారు చూడ్డానికి…గంట తరువాతెళ్ళి పడుకుందామనుకున్న నేను…సినిమా మొత్తం చూసాను ….కాకపోతే 2 గంటల సినిమా ని 4 గంటలు వేసి చావకొట్టారు ఆ ఛానెల్ వాళ్ళు…

ఇప్పుడు కథ విషయం లోకి వస్తే….

కథారంభం 1920 లో,ఎండింగూ 1920లోనే …

అర్జున్  ఆంజనేయ స్వామి భక్తుడు…రోజూ స్వామి వారిని దర్శించుకుని హనుమాన్ చాలిసా చదవందే ఏ పని మొదలెట్టడు.ఆంగ్లో ఇండియనైన లీసాని  ఇష్టపడిన అర్జున్ తన తల్లిదండ్రులని ఒప్పించి పెళ్ళి చేసుకుందామని అనుకుంటాడు.అర్జున్ బంధువులు దానికి ఒప్పుకోక లీసాపై హత్యాయత్నం చేస్తారు.వారినుండి లీసని కాపాడి తనవాళ్ళని ,దేవుని పై ఉన్న నమ్మకాన్ని వదిలి తనని పెళ్ళి చేసుకుంటాడు.

ఆర్కిటెక్ట్ ఐన అర్జున్ కి పాలంపూర్ లోని ఒక హవేలి ని హోటల్ గా మార్చే కాంట్రాక్ట్ వస్తుంది.ఆ పనిపై పాలంపూర్లోని హవేలికి  అర్జున్,లీసా వెళ్తారు.ఆ హవేలికి వచ్చిన లీసాకి కొన్ని సంఘఠనలు ఎదురవ్వడంతో ఆ ఇంట్లో పని చేసే అతన్ని ఈ విషయం అడుగుతుంది.తనకేమి తెలియదు అంటూ అతను వెళ్ళిపోతాడు.

తన భయాన్ని అర్జున్ తో చెప్పగా అదంతా తన భ్రమ ని కొట్టిపడేస్తాడు.ఆ ఊళ్ళోని చర్చ్ ఫాదర్ ని కలిసిన  లీసా హవేలి లో జరుగుతున్నది చెప్పి,హవేలికి రమ్మని  అడుగుతుంది.ఆ హవేలి కి వచ్చిన చర్చి ఫాదర్ కి అక్కడ స్ట్రాంగ్ ఇవిల్ ప్రెసెన్స్ ఉందన్న సంగతి అర్ధమవుతుంది.ఆ రోజు రాత్రే ఫాదర్ పై హత్యాయత్నం జరుగుతుంది.

ఇంతకీ ఆ హవేలిలో ఉన్నదెవరు..లీసా కి దానికి ఏమిటి సంబంధం?చర్చి ఫాదర్ పై హత్యాయత్నం ఎందుకు జరుగింది? లీసా,అర్జున్,చర్చ్ ఫాదర్ ఏమయ్యారు? అనేది మిగతా కథ…

ఈ కథ చదివి మీకు చాలా కథలు గుర్తొస్తే నేనేం చేయలేను…

రాజ్ సినిమా తీసిన విక్రం భట్ ఈ సినిమా కి దర్శకుడు…ఆ తరువాత తన దర్శకత్వం లోనే “హాంటెడ్”  అని ఇంకో సినిమా వచ్చింది.మా కలీగ్స్ అందరు బాగుందని చెప్పారు….నేనింకా చూళ్ళేదు…చూసి తప్పకుండా టపా వేస్తాలేండి..డోంట్ వరి … 🙂

మంచి సౌండ్ సిస్టంలో చూసుంటే సినిమా బాగుండేది…ఇంట్లో ఆ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల నాకు భయం అనిపించలా…మధ్యలో పాటలు వచ్చి నన్ను నిద్రపుచ్చింది….సినిమాలో ప్రత్యేకం గా గ్రాఫిక్స్ వర్క్ చేసినట్లనిపించకుండా..సహజంగా ఉండేలా స్పెషల్ ఎఫెక్ట్స్ చేసారు…

వీరో,వీరోయిన్లు కొత్తవాళ్ళు…వీరోకన్నా,వీరోయిన్ బాగా చేసినట్లు అనిపించింది…

సినిమా మొత్తం చూసి ఆనక వేడిగా ఓ స్ట్రాంగ్ బోర్న్ విటా తాగాక తలనొప్పి తగ్గింది…సినిమా వల్ల వచ్చిందనుకునేరు…మధ్యాహ్నం నిద్ర ఆపుకుని చూడ్డం వల్ల వచ్చిన నొప్పి అది…

హమ్మయ్య, రెండు వారాలుగా అనుకుంటున్నాను..దీని పై పోస్టు వేద్దామని..ఎట్టకేలకు వేసేసా…1920 కథ చెప్పేసా… 🙂

ప్రకటనలు

చిల్లర్ పార్టి!!!

సాధారణం

చాలా రోజుల తరువాత ఏడ్చాను…

మీరు మరీ కంగారు పడిపోకండి…ఏమీ జరగలేదు….

ఓ సినిమా చూసి నవ్వాను,ఏడ్చాను…ఇంట్లో మిగతా వాళ్ళు నాతో పాటు కలిసి  చూస్తున్నారు కాబట్టి సరిపోయింది..లేదంటే మా ఇంట్లో ఓ నది ప్రవహించి ఆనకట్ట కట్టించుండే వారు…

ఓ ఆగండాడండి…మీ డౌట్ నాకు అర్ధమయ్యింది …ట్విస్ట్ సినిమా చూసి ఈ పరిస్థితి తెచ్చుకున్నావా అని జాలి పడకండే…ఓ పది నిమిషాలు దాన్ని చూసి నా జన్మ చరితార్ధమయ్యి చూస్తున్న వాళ్ళ చేత కూడా ఛానెల్ మార్పించాను…చూసిన పది నిమిషాల్లోనే ‘సుమనుడి’ నట కౌశల వైభవాన్ని చూసి తట్టుకోలేక ఇంత ఘాఠి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది…ఇది  ట్విస్ట్ వల్ల కలిగిన ఉపద్రవం కాదు అని బ్లాగు ప్రజలందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను….

మరి దేన్ని చూసి ఆ ఏడుపు,నవ్వు అనే కదా మీ డౌట్ అక్కడికే వస్తున్నాను…

షరా మాములుగా ఈ వారాంతం కూడా ఏం చేయాలి అని  ఆలోచిస్తుండగానే ఆదివారం వచ్చేసింది..ఓ మై గాడ్ అప్పుడే ఆదివారం వచ్చేసిందా సరిగ్గా నిద్రన్నా పోలేదు…కాబట్టి పనులన్నీ త్వరగా చేసేసి ఓ కునుకు తీయాలి అని డిసైడ్ అయ్యాను..వచ్చే వీకంతా కష్టపడ్డానికి రీచార్జింగ్ అన్నమాట… 🙂

వంట చేసేలోపు టి.వి లో కార్యక్రమాలు ఏం వస్తున్నాయో చూద్దామని పెట్టా…అన్నింటిలో మాములే..సినిమాలు సరిగ్గా ఆడకపోయినా మా సినిమా సూపరు..ఆహా ఓహో అని అనిపించేలా ఉంటుంది వచ్చి చూడండి బాబూ అని సదరు సినిమా స్టార్లు వచ్చి ఊదరకొడుతున్నారు…ఇంకొన్నింటిలో మా ఇంటి వంట,మీ ఇంటి వంట అంటూ వంటలు చెప్పిస్తున్నారు…ఇవీ మన లోకలూ కార్యక్రమాలు…

సరే అని జాతీయ భాషా ఛానెల్స్‌లో ఏమోస్తున్నాయో చూద్దామని అనుకున్నాను…ఆ ఇక్కడా ఏమోస్తుంది…మన తెలుగు సినిమాలు డబ్బింగ్ వే అనుకుంటూ మారుస్తూ వస్తున్నాను..కలర్స్ వారి ఛానెల్ దగ్గర రిమోట్ ఆగిపోయింది…అరె ఈ సినిమా ఎక్కడో చూసినట్లుందే అని అనుకుని ఏ సినిమా అని ఆలోచించగా  “చిల్లర్ పార్టి ” అని గుర్తొచ్చింది…

ఈ సినిమా థియేటర్ కి వెళ్ళి చూద్దామని అనుకున్నాను..కాని కుదరలేదు…ఈ  లోపలే టి.వి లో వేసేసాడు..ఓ రెండు నెలల ముందు అనుకుంటా “World T.V Premier” అని  వచ్చింది..ఆ రోజు మొత్తం సినిమా చూడ్డం కుదర్లేదు…

ఈ రోజైనా  ఫుల్లు సినిమా  చూద్దామని అనుకున్నాను…అప్పుడు గుర్తొచ్చింది మధ్యాహ్నం వంట చేయాలన్న సంగతి..సినిమా చూస్తూ కూరలవీ కట్ చేసుకుని…యాడ్లు వచ్చే టైంలో అన్నం,కూరలు స్టవ్ మీద పెట్టొచ్చా..

“Dont worry “కూరలవీ బానే వచ్చాయి..ఎవరికి ఏమి కాలేదు…

అలా మల్టి టాస్కింగ్ చేస్తూ సినిమా చూడ్డం  పూర్తి చేసా…

ఈ సినిమా చూసే చాలా రోజుల తరువాత నవ్వాను..అక్కడక్కడా ఏడ్చాను….

ఇంతకీ సినిమా కథాకమామీషు ఏమిటయ్యా అంటే..(డీప్ గా వెళ్ళను లేండి…ఆల్రెడి చూసిన వాళ్ళు బోర్ గా ఫీల్ అవ్వకండి)….

ముంబై లోని  చందన్ నగర్ సొసైటి కి చెందిన పిల్లల కథ ఇది.అక్కడి పిల్లలి గాంగ్ ని చిల్లర్ పార్టి అని పిలుస్తుంటారు ఆ అపార్ట్మెంట్లో ని అంకుల్స్ అండ్ ఆంటీస్..ఆ సొసైటిలోనే వారి కంటూ ఓ అడ్డాని ఏర్పాటు చేసుకుంటారు మన చిల్లర్ పార్టి గాంగ్.

ఆ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే వారి కార్లు తుడవడానికి “ఫట్కా” అనే కొత్త కుర్రాడు దిగుతాడు..ఫట్కా కి నా అనే వాళ్ళు ఎవరూ లేరు భిడు అనే నేస్తం తప్ప.భిడు అనేది ఒక్క కుక్క.

మొదట్లో ఫట్కాని ,భిడు ని సొసైటినుంచి పంపించడానికి ప్లాన్లు వేస్తారు మన చిల్లర్ పార్టి.వేరే సొసైటి పిల్లలతో ఆడాల్సిన క్రికెట్ మాచ్ లో తప్పని సరి అయి ఫట్కాని తీసుకోవాల్సి వస్తుంది. ఫట్కా వల్ల మాచ్ గెలవడంతో  చిల్లర్ పార్టి గాంగ్ ఫట్కా ,భిడు ని తమ గాంగ్లోకి ఆహ్వానిస్తారు..మంచి దోస్తులు అవుతారు..

అక్కడి సొసైటిలోని ఆట స్థలాన్ని ప్రారంభించడినికి వచ్చిన రాష్ట్ర మంత్రి గారి సెగట్రీని మన భిడు కరుస్తుంది…(ఎందుకు ఏమిటి,ఎలా అనే ఈ సీన్ నేను మిస్సయ్యాను,మీకు తెలిస్తే చెప్పండి).దానితో సదరు మంత్రి వారు  వీధి కుక్కలని తరిమెయ్యడానికి రూల్‌ని పాస్ చేస్తాడు..దాని ప్రకారంగా సొసైటి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేని వీధి కుక్కలని ముంబై నుండి తరిమేస్తారన్నమాట.దానితో మన చిల్లర్ పార్టి కి కష్టాలు మొదలవుతాయి..

ఆ సొసైటి పెద్దమనుషులు భిడు కి N.O.Cఇవ్వడానికి నిరాకరిస్తారు.అప్పుడు మన చిల్లర్ పార్టి వారిని ఒప్పించి N.O.C ఎలా తెచ్చుకున్నారు..సదరు మంత్రి కి ఎలా బుద్ది చెప్పారు అన్నదే మిగతా కథ….

ఇది పిల్లల సినిమా అని ముద్ర వేసారు కానీ ఇది అందరి సినిమా ….కొన్ని సంభాషణలు మనసుకి హత్తుకుంటాయి…

ముందుగా చెప్పుకోవాల్సింది కాస్టింగ్ గురించి..పిల్లలందరూ భలే ముద్దుగా ఉన్నారు..చక్కగా చేసారు…నాకు బాగా నచ్చిన కారెక్టర్…ఝాంగ్య..:)

ఫట్కా గా చేసిన అబ్బాయి కూడా చక్కగా చేసాడు..వాళ్ళ తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళంతా టి.వి సీరియల్స్‌లో కనిపించే వాళ్ళు…భిడు కుక్క కూడా ముద్దుగా భలే ఉంది…

అమిట్ త్రివేది చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం గా నిలిచింది..మాములుగా తీసి ఉంటే సినిమా గురించి ఏవరూ పట్టించుకో ఉండరేమో కానీ..U.T.V వంటి సంస్థ నిర్మిచడం పైగా సల్మాన్ ఖాన్ కూడా ఇంకో చిత్ర నిర్మాత అవ్వడంతో సినిమాకి బోలేడంత పబ్లిసిటి వచ్చింది…రణ్ బీర్ కపూర్ ఐటెం సాంగ్ ఈ చిత్రానికి ఇంకో ఆకర్షణ.మధ్యలో యాడ్స్ వల్ల విసుగొచ్చింది కానీ నాకైతే సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు……

చాలా  రోజుల తరువాత ఓ మంచి సినిమా చూసాను…:)

ఒక మంచి సినిమా అని మనం చెప్పాము…కానీ సినిమా ఫ్లాపట…ప్చ్..మంచి సినిమాని మనం హిట్ చేయలేమా… 😦

అపున్ గారంటీ దేతి హై ఫిల్మ్ దేఖ్నో కో..:)

ఆదిత్య మూడు ఆరు తొమ్మిది

సాధారణం

మొన్న వీకెండ్  చూసిన సినిమా  గురించి రాసిన టపాలో మన తెలుగులో ఇలాంటివి ఎందుకు రావని రాసాను. ఇది రాసేటప్పుడు ఇలా ఎందుకు రాస్తున్నానా అని ఫీల్ అయ్యి చివరాఖరికి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలూ చూసి నాకు రాయక తప్పలేదు.

కాని రాసినప్పటినుంచి ఒకటే ఫీలింగ్…మన సినిమాలని మనమే తక్కువ చేసుకుంటామా అని,దాంతో  నాలో నేను ఫీల్ అయ్యి,మధన పడ్డా. ఇలా బాధల్లో ఎన్ని  రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్నీ ఫీల్ అయ్యిపోయాను..

ఐయ్ బాలివుడ్ తరువాత మనమే ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నాము…పౌరాణికాలు,జానపదాలు ,భక్తి రస చిత్రాలు తీయడంలో మనకి మనమే సాటి, అలాంటి మన తెలుగులో డిఫరెంట్ గా సినిమా తీయలేదా అని కొంచెం సినిమాల  లిస్ట్  గురించి తీవ్రంగా ఆలోచించా..

చాలా కాకపోయినా కొన్ని అనిపించాయి  రోటిన్ కి భిన్నం గా ఉన్నవి…కాని వాటి గురించి తరువాత చూద్దామని అనుకుంటూండగా ఈ సినిమా తట్టింది….

యురేకా అని నాలో నేను అరచుకొని అరె  ఈ సినిమాని ఎలా మిస్సయ్యానబ్బా అని అనుకున్నా….

అసలు విషయం చెప్పమ్మా అని అక్కడెవరో  అంటున్నారు…చెప్తాను ఆగండి….

ఏదో సినిమాలో శ్రీలక్ష్మి గారు వాళ్ళాయనతో తను చూసిన సినిమాల గురించి డీటెయిల్డ్ గా  వర్ణిస్తారు… సో ఆ స్టయిలో..

“టంటడాయ్  తడంతడాయ్….శ్రీ దేవి మూవిస్ వారి ఆదిత్య 369….
తారాగణం : యువరత్న బాలకృష్న,నూతన నటి మోహిని,అమ్రిష్ పురి,టినూ ఆనంద్,మాస్టర్ తరుణ్
తదితరులు…
రచన:సింగీతం శ్రీనివాస రావు,జంధ్యాల
సంగీతం: "సంగీత ఙ్ఞాని,మేస్ట్రో" ఇళైయరాజా
నిర్మాత: అనితా కృష్ణ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు"సినిమా గురించి చెప్పబోయే ముందు కొంచెం ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళాలి…మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి అని అనుకోకండే…
ఫ్లాష్ బాక్ కొంచెం చిన్నదే త్వరగా ముగించేస్తా…

మా పెదనాన్న గారింట్లో వి.సి.ఆర్ ఉండేది…వాళ్ళు అప్పుడప్పుడు వీడియో కేసెట్లు తెచ్చుకుని సినిమాలు 
చూసేవారు.పెదనాన్న గారు ఏదైనా కేసేట్ తెచ్చారంటే అందరి ఇళ్ళకీ ఆహ్వానం వెళ్ళేది.ఫలానా సినిమా 
తెచ్చాము చూద్దాము రండి అని..

మా పిల్లల గాంగ్ ఇలా పిలవడం తరువాయి వెంటనే వెళ్ళిపోయే వాళ్ళము…వెళ్ళేప్పడు తినడానికి కాసింత
కారప్పూసో,చేగోడిలో ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాళ్ళము.

అప్పటికే వాళ్ళింట్లో ఇలా వచ్చే గాంగ్ కోసం ఏర్పాట్లు జరిగిపోయేవి…చక్కగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాక…
అన్నయ్య వాళ్ళు సినిమా పెట్టే వాళ్ళు….కాస్త ఆలశ్యమైతే మేము చేసే గోల తట్టుకోలేక కాస్త ఆగండర్రా
ఫలానా వాళ్ళు వస్తున్నారు,వాళ్ళు రాగానే మొదలు పెడదాము అని బుజ్జగింపులు,ఎవరైనా సినిమా కొంచెం 
మిస్సయ్యితే వాళ్ళ కోసం మళ్ళీ రిప్లేలు,నచ్చిన పాట వస్తే రిపీట్లు,నచ్చనిది ఏదైనా వస్తే ఫాస్త్ ఫార్వార్డ్లు,
ఫాస్ట్ ఫార్వార్డ్ చేసినప్పుడు తెగ నవ్వుకునే వాళ్ళము..ఇవన్నీ చెయ్యడానికి వి.సి.ఆర్ ఆపరేటర్ ఒకళ్ళు 
పర్మనెంట్ గా ఉండేవాళ్ళు…సినిమా వేసినంత సేపు మిని థియేటర్లా ఉండేది వాళ్ళ ఇల్లు.


వేసవి సెలవులు వస్తే వీడియో కేసెట్లు అద్దె కిచ్చే దుకాణంలో ఓ ఖాతా తెరిచే వాళ్ళము..అలా కేసెట్లు
తెచ్చుకుని ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో…

భలే ఉండేది అప్పట్లో….ఇంటిల్లపాదీ కూర్చుని సినిమా చూడ్డం మధ్యలో అమ్మా వాళ్ళు వెళ్ళి చిరుతిళ్ళు ఏవో 
ఒకటి చేసుకుని పట్రావడం…. :)

అలా వాళ్ళింట్లో చూసా ఈ ఆదిత్య 369…కానీ అప్పటికేమి గుర్తు లేదు… తరువాత ఫోర్త్ ,ఫిఫ్త్ క్లాస్ కి వచ్చాక 
మన డి.డి8 లోనో ఎందులోనో చూసినట్లు గుర్తు… థియేటర్లో చూడ్డం మిస్సయినా ఒకటి రెండు సార్లు ఇలా 
ఇంట్లో చూడ్డం వల్ల బాగా గుర్తుండిపోయింది ఈ సినిమా....నా ఆల్ టైం ఫేవరిట్స్ జాబితా లో చేరిపోయింది…

ఆ తర్వాత ఎప్పుడు చూసినా అప్పుడే కొత్తగా మూవి చూస్తున్న ఫీలింగ్ కలిగేది… అది సింగీతం వారి దర్శకత్వ 
ప్రతిభా మహిమో,నటీ నటుల నటనో,ఇ’లయ రాజు’ గారి సంగీత మాయ వలనో మరి… 

సైంటిఫిక్  ఫిక్షన్ బేస్ చేసుకుని తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సినిమా ఇదొక్కటేనేమో…

కథ మనందరికి తెలిసిందే కాబట్టి దాని జోలికి వెళ్ళను….మిగతా విషయాలు మాట్లాడుకుందాము…

టైం మెషీన్లో కాలంలో వెనక్కి వెళ్ళడం,భవిష్యత్తులోకి ప్రయాణించడం ఇలాంటివి సాధారణ ప్రజానీకం అంటే
నా లాంటి వారికి కూడా అర్ధమయ్యే రీతిలో బహు బాగుగా చెప్పగలిగారు ఈ సినిమాలో.అదే అనుకుంటా 
ఈ సినిమా గొప్పతనం.

టైం మెషీన్లో వెనక్కి ముందుకు వెళ్ళే ఎపిసోడ్స్ లో కృష్ణ దేవరాయల ఎపిసోడే అదుర్స్.ఫ్యూచర్ది కూడా 
బానే ఉంటుంది.అంతర్లీనంగా ప్రపంచం మొత్తం డేమేజ్ ఐతే భావి తరాలు వాళ్ళు ఇలా ఉంటారు అని 
చెప్పినట్లు అనిపించింది.హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారు...

సినిమా మొత్తం మీద నచ్చిన కొన్ని సన్నివేశాలు…

తరుణ్,మిగతా పిల్లల గాంగ్ మ్యూజియం దొంగలను పట్టుకోవటానికి టినూ ఆనంద్ లేబొరేటరికి వెళ్ళి టైం మెషీన్ 
స్టార్ట్ చేస్తే వాళ్ళని కాపాడబోయి అందులో హీరో హీరోయిన్లు ఇరుక్కు పోవడం…వాళ్ళు కాలంలో
ప్రయాణించేటప్పుడు…చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలు ఒక ప్రెసెంటేషన్ లా స్క్రోల్ అవ్వడం… 

విజయనగరం చేరుకున్నాక ఆ వైభావాన్ని బాగా చూపించారు….రత్నాలను వీధులో పోసి అమ్మేవారు అన్న
దానికి ఓ సన్నివేశం పెట్టారు కదా…అష్ట దిగ్గజాలను చూపించడం..తెనాలి రామకృష్ణుడు రాజు గారు ఇచ్చిన 
సమస్యలను పూరించడం…అందులో మన హీరో గారు అతను చెప్పాలనుకున్నది ఇతను చెప్పడం…మీకెలా 
తెలుసంటే మేము సినిమా చూసాము…అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వర రావు గారు వేసారు..ఆయన్ని
చూసి తెనాలి రామకృష్ణుడు ఇంత అందం గా ఉంటారు..మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు…ఈ మధ్య 
ఒళ్ళు చేసి పొట్ట పెంచి కాస్త పొట్టయినట్లున్నారు” అని అంటే దానికి రామకృష్ణుడు నీ భాషలో పొట్టి,పొట్ట తప్ప 
మిగతా ఏమి అర్ధం కాలేదు బాలకా అని అనడం..

మేక తోక ఎపిసోడ్…:):)

ఇహ అక్కడ నుంచి  ఫ్యూచర్ లోకి వెళ్తే అక్కడ మెషీన్లు ఏది చెప్తే అదే మనుష్యులు వినడం….మనసులో 
కూడా తిట్టుకోలేకపోవడం..బ్రహ్మానందం గారి భార్య కనిపించి అమ్మాయి పెళ్ళి కుదిరింది..అందరికీ చెప్పెయండి..
అందరూ వాళ్ళింత్లో కూర్చుని టి.వి లో చూసేస్తారు..వచ్చేటప్పుడు కూరగాయలు చీప్ ఉన్నాయంట..1500కి 
టొమాటోలు అవీ తీసుకు రమ్మంటుంది…:):) భూమి మీద ట్రాఫిక్ ఎక్కువయ్యి స్కై లో కూడా ట్రాఫిక్ జాం 
అవ్వటం..బాగా తీసారు ఈ ఎపిసోడ్స్ అన్నీ…


ఇదంతా చెప్పి మన నటీనటుల గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీలవుతారు,చదువుతున్న మీరు ఫీలవుతారు,
నేనూ ఫీలవుతాను.కాబట్టి ప్రధాన పాత్రధారుల గురించి ఓ నాలుగు ముక్కలు కాకపోతే ఓ ఎనిమిది ముక్కలు…

బాలయ్య బాబు:మన బాలయ్య బాబు సినిమాలు ఈ మధ్యన వచ్చినవి చూట్టం కుదరడం లేదు గానీ
చిన్నప్పుడు తెగ చూసేదాన్ని....ఈ సినిమాలో ఐతే బాగా హేండ్ సం గా కనిపించారు…శ్రీ కృష్ణ దేవరాయల 
వారి పాత్ర లో ఐతేనా సూపర్…ఆ పాత్ర బాగా నప్పింది…మొత్తానికి కృష్ణకుమార్ గానూ,దేవరాయలుగానూ
జీవించేసారు….

అమ్రీష్ పురి: బహు బాగుగా నచ్చే విలన్లలో ఈయన ఒకరు…ఒక్కోసారి తనని చూసి భయమేసేది.ముచ్చటైన 
విషయమేమిటంటే తన సంభాషణలను తానే తెలుగులో  పలకడం.ఆ యాస తమషాగా ఉంటుంది…:)

చంద్ర మోహన్: తెనాలి రామకృష్ణుని పాత్రలో బాగా చేసారు...సినిమా లో బాలయ్య బాబు మరియు 
చంద్ర మోహన్ గారి ఎపిసోడ్స్ నాకు నచ్చింది.


టినూ ఆనంద్: సైంటిస్ట్ పాత్రలో జీవించేసారు…బాలు గారి గాత్రం అతికినట్లు సరిపోయింది. 

ఇక హీరోయిన్ విషయానికి వస్తే మోహిని…అది తన మొదటి సినిమా అంట తెలుగులో ఉన్నంతలో
బానే చేసింది.సహాయ పాత్రల విషయానికి వస్తే స్మిత, చలపతి రావు,జె.వి.సోమయాజులు గారు కృష్ణదేవరాయల 
ఎపిసోడ్లో కథ నడవడంలో బాగా తోడ్పడారు…  

ఫ్యూచర్ ట్రాక్ లో శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం గారి పాత్రలు కూడా అంతే…  

వీళ్ళవన్నీ చెప్పిన తరువాత మన హీరో తరుణ్ బాబు గురించి చెప్పాల్సిందే…నాకు తెలిసి అప్పుడే అనుకుంటా
అంజలి సినిమా వచ్చింది..ఆ హేంగ్ ఓవర్ లో ఉన్నప్పుడే తరుణ్ ఈ సినిమా లో నటించినట్లు ఉన్నాడు...
1990స్ లో బాల నటులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలు బాగా వచ్చాయి కదా….తరుణ్,షామిలి,షాలిని 
వీళ్ళందరికి నేను పిచ్చ పంకా అప్పట్లో.. వీళ్ళందరూ అప్పట్లో బాల సెలిబ్రిటీలు కదా..:) 


తన పాటలతో, బాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసారు మేస్ట్రో..అన్నీ పాటలు బాగుంటాయి..ఏ పాటని చెప్పను…
నాకు కుంచెం ఎక్కువగా నచ్చినవి అంటే “రాసలీల వేళ,జాణవులే” పాటలు.

1991 లో విడుదల  అయ్యిన ఈ సినిమా 1992 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందుకొంది…అప్పుడే 
ఈ సినిమా వచ్చి ఇరవయేళ్ళయ్యి పోయిందన్న మాట..

ఇందులో ఒక సమస్యని ఇస్తారు కదా “బలరాముడు సీతని చూచి ఫక్కున నగియె” అని..దాన్ని
తెనాలి రామకృష్ణుల వారు పూరిస్తారు…ఆ పద్యానికి అర్ధం చెప్పగలరా ప్లీజ్…నిన్నే యూట్యూబ్ లో చూసా..
కానీ నాకు అర్ధం కాలేదు..:( 

ఈ టపా రాస్తున్నంతసేపు సినిమా దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతోంది…ఈ వీక్ ఎండ్ సినిమా చూసెయ్యాలి
అని డిసైడ్ అయ్యిపోయా… 

అంతవరకు అందరికీ టాటా బై బై… ఉంటానేం..

మీరంతా as usual keep rocking!!!


					

సినిమా ఆన్ వీక్ ఎండ్

సాధారణం

అదేదో  సినిమాలో వీక్ అంతా ఏం చేస్తుంటారు అంటే వీక్ ఎండ్ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పినట్లు..వీకంతా ఎదురు చూస్తే వీక్ ఎండ్ రానే వచ్చింది. ఈ వీక్ ఇది చేద్దాము అది చేద్దాము అని ఆలోచిస్తూ చిస్తూండగానే వీక్ ఎండ్ కాస్తా ఎండూ అయ్యింది. సరే పోని కాసింత కళా పోషణ అన్నా చేద్దాము అని టి.వి పై పడ్డా.

అక్కడా పొద్దున చూసిన తెలుగు సినిమా డబ్బింగ్ రూపం లో హిందీ ఛానెల్ లో తేలుతోంది.  హతవిధీ!! ఏమిటీ స్వామి ఈ పరీక్ష అని అడగ్గా వేరే కార్యక్రమాలను చూడమ్మా అని చెప్పాడు.సరే అని ఇంకో ఛానెల్ చూస్తే అక్కడేమో వేడి వేడి దోషలు, గ్రౌండ్ నట్స్ ,ఇంకేదో నట్స్ తో ఏవో మిక్సర్లు చేయడం ఎలాగా అని చూపిస్తున్నారు.

ఇవి ఇంకో వీక్ ఎండ్ చెయ్యొచ్చులే అని  ప్రస్తుతానికి ఈ దోషాలు,నట్లూ మనకొద్దని ఇంకో ఛానెల్ కి వెళ్ళా..అక్కడేమో సినిమా  యాడ్ కి  ముందు ఆ సినిమా గురించిన ఇంట్రొ చెప్తున్నాడు సన్ టి.వి వాడు. వారి ఇంట్రొ కూడ ఓ సినిమా ట్రెయిలర్ లా ఉంటుంది.

“భారతీయ ఛానెల్స్ లో మొదటి సారిగా, వెండి తెర కి వచ్చిన కొద్ది  నెలలకే మీ బుల్లి తెర పై ఈ సూపర్ హిట్ చిత్రం” (actual గా అక్కడ తమిళ్ లో చెప్తే ఇక్కడ అనువదించా,ఛానెల్ కి నాకు తెలుగు పదం తెలీలేదు,మీకేమైనా తెలిస్తే చెప్పగలరు…)

ఇది అయ్యాక అసలు సినిమా యాడ్ వస్తోంది.సరే కాసింత ఇంటెరెస్టింగా అనిపించడంతో ఈ సినిమా సూద్దామని డిసైడ్ అయ్యిపోయా.సాయంత్రం త్వర త్వరగా పనులు అవీ ముగించుకుని సినిమా చూడ్డానికి సెటిల్ అయ్యాను.

టైటిల్స్ స్క్రోల్ అవుతూంటే ఇది డైరెక్టర్ శంకర్ నిర్మించిన చిత్రమని తెలిసింది. శంకర్ నిర్మాణ సంస్థ నుంచి అంటే కూసింత డిఫరెంట్ గా ఉంటుందేమో సినిమా అని ఒక చిన్న ఆష.

ఇప్పుడు కథ చెపుతా వినండి.

బాలా అనబడే బాల సుబ్రమణ్యం, రే అనబడే రేవతి, వాళ్ళ అబ్బాయి ఆనంద్.తన పేరెంట్స్ చనిపోయిన 15 ఏళ్ళ తరువాత బాలా హాలిడే ట్రిప్ అని చెప్పి రేవతి ,ఆనంద్ ని  తమ స్వస్థలానికి తీసుకు వస్తాడు.బాలా తన తల్లితండ్రులతో కలిసి చిన్నప్పుడు  ఉన్న ఇంట్లోనే దిగుతారు.ఆ ఇంటికి రావడంతోనే ఆనంద్ కి వాళ్ళు కాక ఇంకెవరో ఉన్నట్లు,అక్కడేదో జరుగుతున్నట్లు  అనిపిస్తుంది.సరిగ్గా మాటలు రాకపోవడం వల్ల పలానా జరుగుతోంది అని వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పలేకపోతాడు.పైగా ఈ జరుగుతున్నవి తనకి బాగా నచ్చుతాయి.త్వరలోనే రేవతి కి ఇంట్లో జరుగుతున్నవి తెలిసిపొతాయి.ఇంట్లో ఏవో దయ్యాలు ఉన్నాయని తాము ఆ ఇంట్లో ఉండదొద్దని తిరిగి  చెన్నై వెళ్ళిపోదామని భర్తతో చెప్తుంది.దానికి బాలా రేవతివి అర్ధం లేని భయాలు అని చెప్పి కొట్టి పారేస్తాడు. ఇంతలో బాలా ఫ్రెండ్ జీవా చెన్నై నుంచి వస్తాడు. వీళ్ళిద్దరు తన దగ్గర ఏదో దాస్తున్నారని రేవతి గ్రహిస్తుంది.వీళ్ళిద్దరినీ వెతుక్కుంటూ సేఠ్ ఒకడు చెన్నై నుంచి వస్తాడు.

అప్పుడు అసలు విషయం తెలుస్తుంది…సేఠ్ వీళ్ళకి అప్పిచాడని..అది తీర్చలేక బాలా ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి  హాలిడే ట్రిప్ అని చెప్పి ఇక్కడకి వచ్చాడని రేవతికి తెలుస్తుంది.సేఠ్ వీళ్ళనేమో పాపం హౌస్ అరెస్ట్ చేసెస్తాడు.జీవా ఇల్లమ్మమని సలహా ఇస్తాడు. దానికి సరే అన్న బాలా ఇల్లు అమ్మకానికి పెట్టగా వచ్చిన వాళ్ళు ఇల్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని సంఘటనలు ఎదురవ్వడంతో  భయపడి ఎవరూ కొనడానికి ముందుకు రారు.

ఈ  సమస్య నుంచి బాలా ఎలా బయట పడ్డాడు? ఇంట్లో వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు?  హౌస్ అరెస్ట్ నుంచి బయటకి వచ్చారా లేదా అన్నది మిగతా కథ.

ఈ సినిమాలో స్టార్స్ లేరు..పట్టుమని సినిమా మొత్తం మీద ఓ పదిహేను పాత్రలు కూడా లేవు..కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు…మనం చెప్పుకునే ఎంటర్ టెయిన్ మెంట్ ఫాక్టర్ లేదు.కంపల్సరి గా ఉండే ఓ కుత్తు  సాంగ్ లేదు….

కానీ  ఉన్నదల్లా excellent ఫొటోగ్రఫి, మంచి బాక్ గ్రౌండ్ స్కోర్.నటీ నటుల నటన ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది.ఇంతకీ సినిమా పేరు చెప్పడం మర్చిపోయా…’ఆనందపురత్తు వీడు’..అలాగే అచ్చ తెలుగులో కి అనువదిస్తే ‘ఆనందపురం ఇల్లు’.మన నేటివిటి కి దగ్గరగా ఉంటుందని ‘ ఆనంద విలాస్’ అని నేను తెలుగులో కి మార్చా…

ఈ సినిమాలో ఇల్లు కూడా అంతే ముఖ్య పాత్ర పోషించింది.  ఇల్లైతే ఎంత బాగుందో…పాత కాలం పేద్ద బంగళా..ఇంటి ముందు వెనక బోలేడంత స్థలం..ఇంట్లోనే ఓ నాచురల్ స్విమ్మింగ్ పూల్…నాకైతే భలే నచ్చేసింది…

సినిమా చూసాక అనిపించింది ఏంటంటే మల్టి ప్లెక్స్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి తీసినట్లు అనిపించింది.కాని అటెంప్ట్ బాగుంది.

ఇంత చెప్పాక ఈ సినిమా డైరెట్రు గురించి చెప్పాలి…మీకు ఓ పదీ ,పన్నెండేళ్ళ ముందు రహస్యం అని  ఓ సీరియల్ ఈ టి.వి లో వచ్చేది గుర్తుందా? ఆ తరువాత వీడని వీరభద్రుడని జెమిని టి.వి లో..అప్పట్లో  ఈ సీరియల్స్ బాగా పాపులరయ్యింది…మేమైతే క్లాస్‌లో   టైం దొరికితే ఆ వారం మొత్తం నెక్స్ట్ ఏమి జరుగుతుందా అని మాట్లాడుకునే వాళ్ళము.ఆ సీరియళ్ళ  డైరెట్రే ఈ సినిమా డైరెట్రు..పేరు నాగ….రహస్యం సీరియల్ అంత థ్రిల్లింగా దీన్ని కూడా తీసాడు.

ఇదంతా బానే వుంది..అసలు అర్ధం కాని విషయమేమిటంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావని…అరె కనీసం అటెంప్ట్ కూడా చెయ్యరెందుకని? ఓ రెండేళ్ళ ముందు రీలీజ్ అయ్యిన “ఈరం” సినిమాని వైశాలి అనే పేరుతో డబ్ మాత్రం చేస్తారు…

నాకు తెలిసి ఈ సినిమా అక్కడ బాగా ఆడలేదనుకుంటా…అందుకే మనకి ఇక్కడ రాలేదు..లేకపోతే ఎప్పుడో ఈ సినిమాని దిగుమతి చేసేసి ఉందురు…

నేను చూడమని స్ట్రాంగ్ గా రికమెండ్ చేయను ఎందుకంటె నాకూడా అక్కడక్కడా బోర్ కొట్టింది…కాని చివరకి ఏమవుతుందా అని మొత్తం చూసేసా….  ఏది  ఏమైనా ఈ వీకెండ్  ఓ డిఫెరెంట్  సినిమా చూసిన అనుభూతిని కలిగించింది ఈ ఆనందపురత్తు వీడు.….