Category Archives: పండుగలు

దీపావళి ముచ్చట్లు

సాధారణం

పండక్కి శుభాకాంక్షలు చెప్దామని మొన్నననగా టపా మొదలుపెట్టా.కానీ ఆఫిస్లో పనుల వల్ల వెంటనే పోస్ట్ చేయలేకపోయా…

దానికేమిటయ్యా కారణం అంటే..ఇదీ…

మా ఆఫిస్కేమో మంగళ వారం సెలవిచ్చారు.పండగేమో బుధవారమాయే…మా లీడ్ అందరినీ పిలిచి ఎప్పుడు తీసుకుందాము లీవు మంగళవారమా బుధవారమా అని అడిగారు…అందరూ వీకెండు,సోమవారం లీవు పెడితే ఓ లాంగ్ హాలిడే వస్తుందని మంగళవారం సెలవుకి వోటేసారు…పోనీ బుధవారం సెలవు పెడదామంటే ఆల్రెడి నేను లీవు తీసేసుకున్నాను.సరే త్వరగా వెళ్ళి సాయంకాలం త్వరగా వచ్చేద్దామని ఆఫిస్ కి వెళ్ళాను.చూస్తే జనాలెవ్వరూ (అంటే మా టీంలో) రాలేదు.వాళ్ళొచ్చేలోపు టపా రాసేద్దామని ప్రారంభించా…ఇంతలో పోలోమని అందరూ రావడం,మీటింగ్స్  గట్రాతో , ప్రాజెక్ట్ పనులతో ఆ రోజూ టపా పోస్ట్ చేయలేకపోయా….

సో చాలా చాలా ఆలశ్యంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.కాస్త ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు(రేపు నాగుల చవితని అత్తమ్మ చెప్పారు),చాలా చాలా ముందుగా కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు…(ఆంధ్ర రాష్ట్ర అవతరణోస్త్వం,కన్నడ రాజ్యోత్సవ  శుభాకాంక్షలూ చెప్దామని అనుకున్నాను…దీపావళి గురించి చెప్పేటప్పుడు దాని గురించి ఎందుకులే…అవతరణ దినోత్సవానికి  ఇంకో టపా వేద్దాంలే అని ఇప్పుడు చెప్పడం లేదు…):p

ఈ సెలవుల పుణ్యమా అని రెండు మూడు రోజులుగా ఆఫిస్ కి ,ఇంటికినూ అరగంటలో రీచ్ అవుతున్నాను.ఎప్పుడూ రద్దిగా ఉండే మా కాబ్ వెళ్ళే రూట్లోని రోడ్లు ఖాళీగా,విశాలంగా కనిపించింది.ఎక్కడెక్కడ ఏ ఏ షాపులున్నాయో అన్నీ కనిపించాయి.రోజూ ఆ రూట్లోనే వెళ్ళినా ఇన్ని రోజులు అసలు గమనించలేదు.

ఈ సెలవులయ్యాక ఇహ మళ్ళీ మాములే బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు…ఎప్పటికీ తీరుతాయో…హ్మ్మ్మ్మ్….

పోయిన సంవత్సరం కూడా టపాసులు కొనలేదు ఈ సారన్నా కొందామని వెళ్ళి మా వారినడిగా…

దానికి నో నో మనం టపాసులు కాల్చకూడదు..ఆల్రెడి కాలుష్యం ఎక్కువయ్యింది..మనం ఆ డబ్బుతో ఏ అనాధ శరణాయలం లో డొనేట్ చేద్దాము అని ఓ చిన్న క్లాస్ ఇచ్చారు…నో నో కనీసం రెండు కాకరొత్తుల పెట్టెలు,రెండు బురుసుల పాకెట్లైనా కొనాల్సిందే అని నేనూ ఓ క్లాస్ పీకి ఆఫిస్ కి వెళ్ళిపోయా.

కాబ్లో వెళ్తోంటే నేనూ,చిన్ని దీపావళి చేసుకునేది గుర్తొచ్చింది.మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు టపాసులు వాళ్ళే చేసుకునేవాళ్ళట.పోనీ మా అన్నయ్యలెమైనా నేర్పుతారనుకుంటే వాళ్ళూ టపాసులు కొనేవారు…టపాసులు మేమే తయారు చేసుకుని కాల్చే చాన్స్ మాకు రాలేదు…

పండగ మూడు రోజుల ముందు నుంచి టపాసులు కొనడానికి ఓ పేద్ద లిస్ట్ తయారు చేసి ముందు రొజు నాన్నకి ఇచ్చే వాళ్ళము.ఆ తెచ్చుకున్న దాన్ని నేనూ,చిన్ని సగం సగం పంచుకునేవాళ్ళము. ఒక సారి టపాసులు కాలుస్తుంటే చెయ్యి కాలింది.అప్పటి నుంచి ఢాం టపాసులు కాల్చాలంటే కొంచెం భయం…మొత్తానికి టపాసులన్నీ అయ్యాక…ఆఖరికి వాటికి ఇచ్చిన అట్ట పెట్టెలతో సహా కాల్చేసి దీపావళి ముగించేవాళ్ళము.

తర్వాతర్వాత కాల్చడం తగ్గింది.చెన్నై వెళ్ళాక ఏదో కాల్చాలని కొన్నే కొనేవాళ్ళము…చిన్ని ఇప్పుడు కాల్చడం తగ్గించేసింది…టపాసులు ఎండపెట్టుకోవడం,వాటిని పంచుకోవడం,ఎవరు ముందు వాళ్ళ కోటాను ముగిస్తారో అని చూడ్డం…అన్నీ ఎంత సరదాగా ఉండేదో…ఇలా ఆలోచిస్తుండగానే ఆఫిస్ వచ్చేసింది…

ఆ రోజే మా ఆఫిస్ లో అందరికీ మెయిల్ వచ్చింది..మాములుగా దీపవళికి ముందు టపాసులని డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాము తీసుకొండి అని పంపుతారు…

అదేనేమో అనుకుని మెయిల్ ఒపెన్ చేస్తే…అది స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు మొక్కల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మెయిల్.అరె ఇదేదో బాగుందే అని అనుకున్నాను.

పక్కరోజు చూస్తే మా కొలీగ్స్ అందరూ వెళ్ళి స్వీట్ల డబ్బాతో పాటు,మొక్కలు తెచ్చుకుని పెట్టుకుని ఉన్నారు వాళ్ళ సీట్ల దగ్గర ..అందులో క్రొటన్లూ,రోజా మొక్కలూ ఉన్నాయి..మనమూ చూద్దామని మా టీం మేటు లాకెళ్ళింది.

అక్కడ చూస్తే ఓ పేద్ద క్యూ ఉంది.మేమిద్దరమే లాస్టు ఆ క్యూలో..చివరాఖరికి స్వీట్ డబ్బా తీసేసుకున్నాము…మొక్కలేమిస్తారో అని చూస్తోంటే మా ఇద్దరికీ రోజా మొక్కలొచ్చాయి.:) మొక్కని తీసుకెళ్ళేందుకు వీలుగా దాన్ని ఓ జూట్ బాగులో పెట్టి ఇచ్చారు…

మొక్కలొద్దనుకున్న వాళ్ళని మాకిచ్చెయ్యండి అని వెళ్ళి రిక్వెస్ట్ చేసొచ్చాము..అలా నాకు రెండు మొక్కలొచ్చాయి…కానీ మొక్కలు తెచ్చుకున్నాక అనిపించింది ఈ సారి టపాసులకి పెట్టే డబ్బుతో ఇంకో నాలుగు మొక్కలు కొందామని….వచ్చే వారాంతం వెళ్ళి కొత్త మొక్కలు,వాటికి మట్టి,కుండీలు కొనాలని తీర్మానించా….

సో అలా ఈ సారి టపాసులు కొనలేదు….ఇల్లు మొత్తం చక్కగా దీపాలతో అలకరించాం లేండి…

మీరు టపాసులు కొనకపోతే ఏం మీ బదులు మేము కాలుస్తాము అని ఆ బాధ్యతని మా పక్కన ,వెనకింటి అపార్ట్మెంట్ల వాళ్ళు తీసుకున్నారు…

ఏడింటికి మొదలెట్టిన వాళ్ళు పదింటి వరకు కానిచ్చారు…టపాసుల శబ్దాలతో వీధి మోగిపోయింది.

అడగడం మర్చిపోయా అందరూ దీపావళి బాగా చేసుకున్నారా?

ఇవి ఈ సంవత్సరం దీపావళి పండగ ముచ్చట్లు….