Category Archives: నేను చదివిన పుస్తకం

పఠనంలోని ఆసక్తే ఈ కొత్త పుటని ప్రారంభించడానికి ప్రేరణ.నేను చదివిన పుస్తకాల గురించి ఇందులో పరిచయం చేస్తాను.

అప్పుడెప్పుడో చదివా…ఇప్పుడు రాస్తున్నా..

సాధారణం
అప్పుడెప్పుడో “Dark Goddess” టపా రాసినప్పుడు…ఈ నవల పూర్తి చేశా…అప్పుడే దీని గురించి రాద్దామని 
అనుకున్నాను…మళ్ళీ ఒక డౌట్ వచ్చింది…ఈ అమ్మాయికి ఏమి పన్లేదు ఎప్పుడూ పుస్తకాల గురించే రాస్తూ
ఉంటుంది అని అనుకుంటారని కొన్ని రోజులు ఆగా…:P..ఆ కొద్ది రోజులు ఇన్ని రోజులు అయ్యాయి…
మీరేమి అలా అనుకోరని నాకు తెలుసు…అందులోనూ ఇది నాకు బాగా నచ్చిన నవల.లేటయ్యితే అయ్యింది 
కానీ మంచి నవలని పరిచయం చేయటం మిస్సవ్వకూడదని ఇప్పుడు ఈ టపా స్టార్ట్ చేసా.

అనగనగా ఓ స్కూల్…ఎంతో మంది విద్యార్థులను మంచి విద్యావేత్తలు గా,మంచి పౌరులుగా తీర్చిదిద్దిన స్కూల్…
ఉత్తమ క్రీడాకారులను దేశానికి అందించిన ఘనత కలిగిన పాఠశాల.ఏ స్కూల్ కి లేని పే.....ద్ద క్రీడా 
మైదానం దీని సొంతం.మిగతా పాఠశాల్లలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న ఆ విద్యాధామం ప్రస్తుతం
గత వైభవాన్ని కోల్పోయి తన మనుగడ కోసం పోరాడుతోంది.అలాంటి పరిస్థితుల్లో ఆ స్కూల్లోనే ఇది వరకు
పనిచేసి రిటైరైన విశ్వనాథ శర్మని తిరిగి ప్రిన్సిపాల్ గా నియమించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానిస్తుంది.
శర్మగారు క్రీడా విభాగాన్ని అందులోనూ క్రికెట్ జట్టుని మరింత ప్రోత్సహించాలని కొన్ని తీర్మానాలను 
తయారు చేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ప్రవేశపెట్టగా డైరెక్టర్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
ఆ తీర్మానాన్ని ఇద్దరు బలంగా వ్యతిరేకిస్తారు.వారు ఆ స్కూల్లోనే పనిచేసే టీచర్,ఇంకొకరు ఆ స్కూల్
పూర్వ విద్యార్థి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి.ఆ క్రీడా మైదానంపై కన్నేసిన అతను ఎలాగైనా దాన్ని
సొంతం చేసుకోవాలని ఆశిస్తాడు.టీచరేమో తనని తాను ఆ స్కూల్‌కి ప్రిన్సిపల్ గా ఊహించుకుని మరిన్ని 
కోచింగ్ సెంటర్లు పెట్టాలని కోరుకుంటుంటాడు.

శర్మ గారు చెప్పినది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని,ఆట స్థలం వల్ల ఏ ఉపయోగం లేదని దానికి బదులు
ఆ స్థలంలో ఏదైనా బిల్డింగ్ కట్టి కోచింగ్ సెంటర్ లాంటిది ప్రారంభిద్దామని సలహా ఇస్తారు.అందుకు ఒప్పుకోని
శర్మగారు తన వంతు వాదనని వినిపిస్తారు.పిల్లలకి చదువుతో పాటు “Extra Curricular activities”
కూడా ముఖ్యమని అందులోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్స్ టీంలో ఉన్నారని వారిని ప్రొత్సహిస్తే 
భవిష్యత్తులో మరింత రాణిస్తారని చెప్తారు. దానికి కన్విన్స్ అయ్యిన డైరెక్టర్స్ శర్మ గారి తీర్మానాలను
ఆమోదించబోగా దాన్ని వ్యతిరేకించి గత కొన్నేళ్ళుగా ఏ టోర్ని గెలవని స్కూల్ జట్టు పై టైం వృధా
చేయొద్దని చెప్తారు. శర్మ గారు కొద్దిగా టైమివ్వమని ఈ సారి జరిగే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శన
చూసి నిర్ణయించుకోమని చెప్పగా దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోద ముద్ర వేస్తారు.

శర్మ గారు ఆ స్కూల్ పూర్వ విద్యార్థి మరియు మంచి క్రికెటరైన సంపత్ ని క్రికెట్ కోచ్ గా నియమిస్తారు.
మొదట సంపత్ కోచ్ గా పనిచెయ్యడానికి ఒప్పుకోకపోయినా శర్మ గారి పట్టుదల,తనపై ఉన్ననమ్మకానికి
తలవంచి కోచ్ గా బాధ్యతలను స్వీకరిస్తాడు.మంచి ప్లేయర్సే అయినా మొక్కుబడిగా ఆడే జట్టు సభ్యుల్లో
సంపత్ ఎలాంటి మార్పుని తెచ్చాడు. శర్మ గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపాడా?
అండర్ డాగ్స్ గా ఉన్న స్కూల్ టీం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ ఐన ఎవర్ గ్లేడ్ స్కూల్ తో పోటి పడిందా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే బుక్ చదవాల్సిందే.

ఇదీ నేను అప్పుడెప్పుడో చదివిన "The Men with in-A cricketing Tale " కథాంశం.
ఈ కథంతా చదివిన తరువాత మీకేదో గుర్తుకు వస్తోంది కదా...ఆలోచించండి...

"మేము గెలవగలం" అనే నమ్మకాన్ని టీంలో కలింగించడమే సంపత్ ప్రధాన కర్తవ్యం.ఇందులో సంపత్ జట్టు
సభ్యులను మరియు కెప్టెన్ ని ఎంపిక చేయడానికి వాడే స్ట్రాటెజి,టీం బలాబలాలను అంచనా వేసే విధానం
ఇవన్నీఆసక్తికరంగా ఉంటుంది. అందుకు అతను ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు అన్నది బుక్ చదివి
తెలుసుకుంటే బాగుంటుంది.క్రీడా నేపథ్యంలో మనకి ఎన్నో సినిమాలు ,పుస్తకాలు వచ్చుంటాయి.కాని క్రికెట్
నేపథ్యంగా తీసుకుని వచ్చిన తొలి ఆంగ్ల నవల ఇదేనట.దీన్ని రాసినది మన తెలుగతనే.
పేరు హరిమోహన్ పరువు.ఇది హరిమోహన్ గారి తొలి నవల.


కానీ చదివితే తొలి నవల అని అనిపించదు.అంత చక్కగా,సరళమైన ఆంగ్ల పదాలతో రాశారు.
నవల చదువుతున్నంతసేపు స్కూల్లో నేనూ కూడా ఒక స్టూడెంటయ్యిపోయా..
టీం సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా రాసారు.వారి మధ్యన ఉన్న ఫ్రెండ్ షిప్,వారి అలకలు
ఇవ్వన్నీ చదువుతోంటే నేను కూడా నా స్కూల్ రోజుల్లోకి వెళ్ళొచ్చా. ఎక్కడా మనకి ఏదో పాఠం చెప్తున్నట్లు
అనిపించదు.ఆయా పాత్రల ద్వారా మనకి బోలెడు మేనెజ్ మెంట్ టిప్స్ అందించారు రచయిత. 

అలాంటి వాటిలో కొన్ని టిప్స్... ఇవి నాకు నచ్చినవి...ఇంకా బోలెడు ఉన్నాయి...గుర్తురావడం లేదు....
ప్లీజ్ అడ్జస్ట్ మాడి...

   Believe in yourself.
   Key to success is to Relaxation. Key to relaxation is breathing.
   The indication of excellence is when the small things are done well.
   Slow down but don't stop while doing any work.

నవల చదివితే ఫన్,యాక్షన్ తో పాటు బోలెడంత మోటివేషన్,ఇన్స్పిరేషన్ ఫ్రీ.
ఈ నవల అన్ని వయసుల వారికి,క్రికెట్ ప్రేమికులకి, క్రికెటర్స్ అవ్వాలనుకుంటున్నవారికి రికమెండెడ్..
ముఖ్యం గా కార్పొరెట్స్ కి హైలీ రికమెండెడ్.

ఇంతకీ స్కూల్ స్కూల్ అని చెప్పాను గాని స్కూల్ పేరు చెప్పలేదు కదా...ఈ నవల్లో అతి ముఖ్య పాత్ర 
పోషించిన స్కూల్ పేరు "గోల్కొండ పబ్లిక్ స్కూల్"...

రచయిత గురించిన మరిన్ని వివరాలు కావాలంటే ఈ వెబ్ సైట్ హరిమోహన్ చూడండి..
ఇందులో రచయిత నవల ప్రచురణానుభవాలు గురించి తెలుసుకోవచ్చు.బుక్ లాంచ్ గురించిన విశేషాలు..
ఈ నవల పై ప్రముఖుల అభిప్రాయాలు,రచయిత వ్యక్తిగత వివరాలు మరెన్నో ఉన్నాయి.
త్వరలోనే మరో మంచి పుస్తకం కబుర్లతో.....
ప్రకటనలు

కొత్త నవల చదివానోచ్ !!!

సాధారణం

ఈ  మధ్య లైబ్రరీ కి వెళ్ళినప్పుడు ఏ పుస్తకం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఫిక్షన్ బుక్స్ ఉండే సెక్షన్ కి వెళ్ళా..ఎప్పుడూ చూడూ ఈ అమ్మాయి  లైబ్రరీ,పుస్తకాలు అని  అంటుంది..వేరే పనేమి లేదా అని అనుకోకండే..మన ఉద్యాననగరిలో ప్రయాణం చేసేప్పుడు బహు బాగు టైంపాస్ పుస్తకాలే మరి…. సరే సరే…ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేద్దాము…అలా ఫిక్షన్ బుక్స్ సెక్షన్ దగ్గర కలెక్షన్ ఏముందా అని చూస్తున్నాను..బుక్స్ తీస్తూ రచయితల పరిచయం చదువుతూ తెగ తిరిగేస్తున్నాను…ఏది తీసుకోవాలో అర్ధం కావటంలేదు…ఇంతలో ఒక నవల కనిపించింది..పరిచయం చదివితే ఆసక్తికరం గా ఉంది…రచయితా ఎవరా అని చూస్తే ఎవరో కొత్త అతను…సర్లే చదివి చూద్దాము…నచ్చకపోతే ఇచ్చేద్దాము అని తీసుకొచ్చా..

ఒక పది పేజీలు చదివేప్పటికి బోర్ గా అనిపించింది…ఎందుకు తీసుకొచ్చామా అని అనిపించింది..రిటర్న్ చేసేద్దాం అని అనుకున్నా..పక్క రోజు ఆఫిస్ కి వెళ్తున్నా..బాగా బోర్ గా ఉంది…చదవడానికేమి లేదే అని అనుకుంటూ బాగ్ తీసి చూస్తే నేను నిన్న నవల చదివేసి బాగ్ లోనే మర్చిపోయినట్లున్నా…సర్లే  చదివి చూద్దాము అనుకుంటూ మొదలుపెట్టా…ఆఫిస్ దగ్గరకి వచేంత వరకు నాకు టైం తెలీలా..బాగుందనిపించింది… నిన్నే  నవలని పూర్తి చేశా..మీకు పరిచయం చెయ్యాలని అనిపించింది….దాని పర్యవసానమే ఈ టపా…

నవల నవల అంటోంది ఏం నవలో చెప్పడం లేదేంటి అని అనుకుంటున్నారా ..చెప్తున్నా చెప్తున్నా..చెప్పడం ఏంటి…నవల ఫ్రంట్ పేజీనే చూపిస్తా….

ఫొటోని కొంచెం జూం చేసారంటే ఈ నవల ఫ్రంట్ పేజీ పైన ఒక కాప్షన్ ఉంటుంది..

“There is nothing to be feared but fear itself and Billi Sangreal”

ఈ కాప్షన్ భలే నచ్చింది నాకు…హీరోయిన్ కి పవర్ ఫుల్ కాప్షన్ పెట్టారు కదా….ఈ పాటికి మీకర్ధమయ్యిపోవాలే…ఈ నవల హీరోయిన్ ఒరియంటడ్ అన్నమాట… 🙂
కథ కొంచెం  సింపుల్ గా చెప్తానే…

హీరోయిన్ పేరు కాప్షన్ లోనే ఉంది……బిల్లి సాంగ్రియల్. బిల్లి “The knights Templar” అనే పురాతన క్రిస్టియన్ మిలిటరి  ఆర్గనైజేషన్ లో సభ్యురాలు. దీని గురించి చెప్పాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి.దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది.

Poor Fellow-Soldiers of Christ and of the Temple of Solomonకి కామన్ పేరే “The knights Templar”. Order of the Temple అని కూడా  పిలిచేవారు.రెండు శతాబ్దాల పాటు వీరి కార్యకలాపాలు చురుగ్గా కొనసాగాయి.ఈ సంఘం ఆవిర్భవించడానికి ముఖ్య కారణం అప్పట్లో జరిగిన పవిత్ర యుద్దాలు . జెరూసలేం మరియు చుట్టుపక్కల ప్రదేశాలని పవిత్ర స్థలాలుగా భావించేవారు.మొదటి పవిత్ర యుద్దం తరువాత జెరూసలేం  క్రైస్తవ సేనల ఆధీనంలోకి వచ్చినా దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో  మాత్రం  ఇంకా శాంతి నెలకొనలేదు.బందిపోట్ల తాకిడి ఎక్కువగా ఉండేది.యాత్రికులకి సరైన రక్షణ లభించేది కాదు. కొంత మంది ఊచకోత కోయబడ్డారు. దీని వల్ల యాత్రికులుతమ రక్షణార్థం వందల సంఖ్యలో ప్రయాణించేవారు.

1119లో మొదటి పవిత్ర యుద్దంలో పాల్గొన్న ఫ్రెంచ్ యోధులు “Hugues de Payens”,”Godfrey de Saint-Omer” యాత్రికుల రక్షణార్థం సైన్యాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనని అప్పటి జెరుసలేం రాజైన King Baldwin II ముందుంచగా,రాజు వారి అభ్యర్ధనని మన్నించి  వారి స్వాధీనంలో ఉన్న Al Aqsa Mosque లో నుంచి కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతినిచ్చారు.Al Aqsa Mosque “Temple of  Solomon” శిథిలాలపై నిర్మితమైందని భావిస్తోన్న”Temple Mount” లో ఉంది.దాన్నే వారు తమ ప్రధాన కార్యాలయం గా చేసుకున్నారు.మొదటగా తొమ్మింది మంది యోధులతో మొదలైన వీరి శ్రేణి విరాళాల పై అధారపడేది. అందుకే వీరు తమని తాము Poor Fellow-Soldiers of Christ and of the Temple of Solomon అని పిలుచుకున్నారు. వారి చిహ్నం “ఇద్దరు యోధులు ఒకే గుర్రాన్ని అధిరోహించడం” వారి పేదరికాన్ని సూచిస్తుంది.వారి పేదరికం ఎంతో కాలం నిలవలేదు.తర్వాతి క్రమంలో వారు చర్చ్ వారిచే అధికారకంగా ఆమోదించబడిఆర్ధికంగానూ మరియు సంఖ్యాపరంగానూ వృధి చెందింది.

Templar knights అపార పోరాట నైపుణ్యం కలిగిన వారు. పవిత్ర యుద్దాలలో వీరిది ప్రత్యేక పాత్ర.ఈ సంఘంలో కొంతమందే యుద్దాలలో పాల్గొనే వారు. మిగిలిన వారు సంఘాన్ని ఆర్ధికంగా వృధి చెందేందుకు తమ వంతు సాయాన్ని అందించేవారు.పవిత్ర యుద్దంలో పాల్గొనదలచిన వారు, యాత్రికులు వారి ఆస్తులను,విలువైన వస్తువులను వీరి దగ్గర భద్రపరచి వెళ్ళేవారు. ఒక రకంగా ఇప్పుడుండే లాకర్ కాన్సెప్ట్ ని టెంప్లార్స్ అప్పుడే ప్రవేశ పెట్టారు.”letters of Credit” ని యాత్రికులకి ఇచ్చేవారు. ఒక రకంగా బాంకింగ్ కి పునాదులు వేసింది ఈ సంఘమే.తరువాతి కాలంలో తమ ప్రాభవాన్ని కోల్పొయారు. అంతిమంగా ఫ్రెంచి రాజైన Philip IV ఒత్తిడికి తలవొగ్గి చర్చ్ సంఘాన్ని అధికారకంగా రద్దు చేసింది. వీరి కనుమరుగు అనేక ఊహలకు చోటిచ్చి ఇప్పటికీ  Templar ని పాపులర్ గా  నిలిపింది.

దీన్ని గురించి రాయాలంటే ఈ టపా సరిపోదు. అందుకే కొన్ని విషయాలనే రాస్తున్నాను.

ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దామే…

బిల్లి తండ్రి ఆర్థర్ కూడా ఈ “Knights Templar” లో సభ్యుడే.పైగా “Master of the Templars”.ఆర్థర్  బిల్లి కి చిన్నతనం నుంచే  శిక్షణని ఇప్పిస్తాడు. తండ్రి,మిగతా సంఘ సభ్యుల పర్యవేక్షణలో యోధురాలిలా రాటుదేలుతుంది.

నవల ప్రారంభంలో బిల్లి Werewolves లో ఒక తెగ అయిన Polenitsy తో పోరాటంలో విజయం సాధిస్తుంది. werewolves గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. సగం తోడేలు సగం మనిషన్నమాట. మనుష్యులను వేటాడి తింటుందన్నమాట. ఎవరినా వీటి  దాడిలో గాయపడితే వాళ్ళు కూడా  Werewolf గా మారిపోతారట. Polenitsy లో అయితే స్త్రీలే పవర్ ఫుల్ అట ఈ నవల ప్రకారం.

వీటితో పోరాడేప్పుడు గాయాలయితే టెంప్లార్స్ దగ్గర ఔషధాలు రెడీ గా ఉంటాయన్నమాట. లేదంటే వాళ్ళు కూడా తోడేలుగా మారిపోతారు కదా.బిల్లి వీటిని చంపడంలో నిష్ణాతురాలు.అలా ఒక దాన్ని చంపిన తర్వాత తనతో వచ్చిన తోటి టెంప్లార్ని వెతుకుతుండగా ఈ గుంపు ఒక ఫార్మ్ హవుస్ లోకి వెళ్ళడాన్ని చూస్తుంది. వాటిని అనుసరించిన బిల్లి కి అక్కడ ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీటి దాడిలో చనిపోతారు.ఇంతలో ఆర్థర్ ఇతర టెంప్లార్ సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ఆ అమ్మాయి తన పేరు వసిలిసా అని ,తాము రష్యా నుండి ఇక్కడికి వచ్చామని చెప్తుంది.తన తల్లిదండ్రులు తనకి అక్కడ రక్షణ లేదని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారని చెప్తుంది.ఆర్థర్,మిగతా సభ్యులు వసిలిసా ఒక  “Psychic child” అయ్యిఉండొచ్చని భావిస్తారు. Polenitsy వారు ఇలాంటి  psychic childని తాము పూజించే దేవత అయిన బాబా యాగ కి బలివ్వడానికి తీసుకెళ్ళడానికి వచ్చిఉంటారని అనుమానిస్తారు.వసిలిసాని తమతో పాటు  తీసుకెళ్తారు.

వారి ఇంట్లో కొన్ని సంఘటనల వల్ల వసిలిసా మాములు Psychic child కాదని ఒక avtaar,oracle అని తెలుసుకుంటారు.వెంటనే తనని జెరూసలేం పంపించాలని నిర్ణయించుకుంటారు.వారి ఇంటిని కూడా Polenitsy  అటాక్ చేస్తారు. అక్కడ నుంచి తప్పించుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే టైంలో వసిలిసా కనిపించదు.తనని  తీసుకెళ్ళిపోయారని తెలుసుకున్న టెంప్లార్స్ తనని రక్షించడానికి  ఆర్థర్ నేతృత్వంలో ఒక బృందం,బిల్లి నేతృత్వంలో మరొక బృందం రష్యాకు వెళ్తారు.ఆర్థర్ వసిలిసా కుటుంబ సభ్యులను కలసుకుని బాబా యాగ గురించిన వివరాలు సేకరించి బిల్లిని కలిసేలా ప్లాన్ చేసుకుంటారు.

రష్యాలో టెంప్లార్స్ లా శక్తివంతమైన మరొక శ్రేణి “Bogatyrs “నాయకుడైన Alexiovich Romanovని కలిసి సహాయం కోరమని ఆర్థర్ బిల్లి బృందాన్ని ఆదేశిస్తాడు.ఆ పని మీద వెళ్ళిన బిల్లి అనుకోకుండా ఒక వ్యక్తిని werewolf అటాక్ నుండి రక్షిస్తుంది.అతను ఎవరో కాదు “Bogatyrs”  నాయకుడి కొడుకు Ivan Alexiovich Romanov అని తెలుస్తుంది. కాని అతను తనకి ఇష్టం లేకపోయినా Koshchey అనే గార్డియన్ పర్యవేక్షణలో ఉంటాడు.ఇవాన్ని కాపాడినందుకు థాంక్స్ చెప్పడానికి వచ్చిన కొష్ చెయ్ వీరు పని వచ్చిన పని తెలుసుకుని వీరికి సాయం చేస్తానని మాటిస్తాడు.ఇవాన్ తండ్రి కూడా Polenitsy వారి చేతిలోనే హతమయ్యాడని చెప్తాడు.ఇవాన్ కూడా వీరి బిల్లి కి సాయం చేయడానికి  సిద్దపడతాడు తన తండ్రిని చంపిన వారిపై  పగ తీర్చుకోవడానికి.తరువాత జరిగిన కొన్ని అనూహ్య సంఘఠనలతో ఇవాన్, బిల్లి మిగిలిన బృందం నుంచి విడిపోయి వారికి దొరికిపోతారు.బిల్లి వారి అటాక్ లో తీవ్రంగా గాయపడుతుంది.

ఇంతకీ వసిలిసా ఏమయ్యింది? బిల్లి వసిలిసా ని బాబా యాగ నుంచి రక్షించిందా? ఇవాన్ తన తండ్రి ని చంపిన వారి పై పగ తీర్చుకున్నాడా? Werewolf దాడిలో గాయపడ్డ బిల్లి మరొక Werewolf గా మారిందా అనేది మిగతా కథ.

చదువుతున్నంత సేపు నాకు ఏదో ఫెయిరీ టేల్ చదువుతున్నట్లు అనిపించింది…సాహసాలు బాగుంది. చదివినంత సేపు మన జానపద కథలకి కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చినట్లు అనిపించింది. ఎంతైనా విఠలాచార్య సినిమాలు చూశాము కదా 🙂 .అంతర్లీనంగా మనిషి ప్రకృతి కి చేస్తున్న అన్యాయాన్ని రచయిత టచ్ చేసినట్లు అనిపించింది.

రచయిత ఎవరో చెప్పలేదు కదూ…సార్వత్ చద్దా….ప్రస్తుత నివాసం లండన్. అతని తొలి నవల “Devil’s Kiss”.ఇది Dark Goddess  నవల కి ప్రిక్వెల్.రచయిత గురించిన వివరాలకు ఇక్కడ చూడండి.

ఈ టపా పూర్తి చేసే సమయానికి ఇంకో నవల సగం పూర్తి చేసాను. దీని ప్రీక్వెల్ కాదు. నా తదుపరి టపా ఆ నవల పైనే…త్వరలో దీని ప్రీక్వెల్ చదివి దాని గురించి ఇంకో టపా రాస్తాను.

P.S : Knights of Templar గురించిన వివరాలు సేకరించింది వికీపీడియా నుంచి.వారి చిహ్నం కూడా.

జస్ట్ బుక్స్-రీడ్. రెంట్. రిటర్న్

సాధారణం


పైన పేరు చూసి ఏంటా అనుకోకండీ..ఇది నేను సభ్యత్వం తీసుకున్న లైబ్రరీ పేరు.బెంగళూరు కొచ్చాక ఫిట్నెస్  స్పృహ పెరిగింది నాకు. అందుకే   వీలునప్పుడల్లా వాకింగ్ గట్రా చేస్తున్నాను. అహ నువ్వు వాకింగ్‌కి  వెళ్తే ఏంటి  వెళ్ళకపొతే ఏంటి అని మీరనుకోవడం నాకు తెలుస్తోంది.అంచేత ఆ టాపిక్   ఇక్కడితో ఆపేస్తున్నాను.నేను చెప్పొచ్చిన విషయం ఏంటంటే..అలా ఒక శుభదినం వాకింగ్ కి వెళ్ళి తిరిగి వస్తోంటే ఇంటి దగ్గర ఏదో షాప్ పెట్టడానికి   సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదోలే అనుకుని వెళ్ళిపోయాము.తరువాత చూస్తే  అక్కడో ఓ లైబ్రరీ వెలిసింది. పేరు “Just Books”. వావ్..మన కాలనీ లో లైబ్రరీ అనుకుంటూ వెళ్ళి చూశాము.పుస్తకాల కలెక్షన్ ఏముందా అని చూడ్డానికి   వెళ్ళిన మేము వారి స్కీంస్ కి ముచ్చటపడి సభ్యులమైపోయాము. వారి  దగ్గర  ఆ యా ప్రాంతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా    ఉండడం అందులో సభ్యత్వం తీసుకోవడానికి ముఖ్య కారణం. నా ఖాతాని ఏ పుస్తకం తో ప్రారంభించలా అని ఆలోచిస్తుండగా యద్దనపూడి  వారి  నవల  ఒకటి కనిపించింది. యద్దనపూడి వారి గురించి వినడమే తప్ప వారి నవలలు ఇంతవరకు చదవకపోవడం తో వారి నవలైన “కీర్తి కిరీటాలు” తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చానే కాని వెంటనే చదవడం కుదరలేదు.

ఒక సెలవు రోజున ఒక శుభ ముహూర్తాన నవలని చదవడం మొదలు పెట్టా.  మొదటి రెండు పేజీలు చదివిన వెంటనే కొంచెం బోర్  గా ఫీల్ అయ్యాను. తర్వాతర్వాత నవలలో లీనం  ఎంతగా అయ్యానంటే ఆ రోజే  పూర్తి చేసేంత. ఒక్క సారి 1960,1970లలో  చూసిన తెలుగు సినిమాలు ఙ్ఞప్తికి రాసాగింది.  Perfect Screenplay!! అంత బాగా రాసారు. ఈ నవల ఇదివరకు చదివిన వారికి ఇలా అనిపించి ఉండొచ్చేమో.

మొత్తానికి యద్దనపూడి వారి నవలతో నా ఖాతాకి శుభారంభాన్ని ఇచ్చిన తర్వాత కొన్ని కథల సంకలనాలు చదివాను.తరువాత కొన్ని ఆంగ్ల నవలలు. ప్రతిసారి నా లైబ్రరీ ముచ్చట్లు చెబుదామని అనుకోవడం  ఏవో కారణాల  వల్ల  కుదరకపోవడం జరుగుతోంది.

చివరకి కారణాలతో మిగిలిపోకూడదని  టపా మొదలుపెట్టేసా. “Just Books” వారిది మా కాలనీ లోనే కాక మెయిన్ రోడ్‌లోనూ ఒకటి ఉంది. చాలా రోజులుగా అనుకుంటున్నాను  ఆ శాఖలో తెలుగుపుస్తకాల  కలెక్షన్ ఏముందా అని. మా ఇంటి  దగ్గర ఉండే దానిలోని తెలుగు పుస్తకాలన్నీ చదివేసాను.లిమిటెడ్ కలెక్షన్ :(. మొన్నే ఓ రెండు బుక్స్ రిటర్న్ చేద్దామని మెయిన్ రోడ్‌లోని బ్రాంచ్ కి వెళ్ళాము.

అక్కడ తెలుగు కలెక్షన్ చూస్తే శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథా సంకలనాలు,యద్దనపూడి వారి నవలలు మరి కొన్ని కనిపించాయి. ఆహా…నాకు ఈ వారం అంతా పుస్తకాల పండగే అని అనుకుంటూ యద్దనపూడి వారి “సెక్రెటరి”  నవలని తెచ్చుకున్నాను.

ఈ సారి వెళ్ళినప్పుడు ఇంకా తెలుగు కలెక్షన్ వాళ్ళ దగ్గర ఏముందో చూడాలి…

P.S:వారి వెబ్ సైట్ ద్వారా తెలిసిందేమిటనగా వారి లోగో మారిందని…ఆ లోగోనే ఇక్కడ పెడుతున్నాను….

Gently falls the Bakula

సాధారణం

కొన్ని రోజుల క్రితం మా కొలీగ్ దగ్గర “Gently Falls the Bakula “అన్న పుస్తకం చూశాను. ఎవరిదా అని అడిగితే సుధామూర్తి గారిది అని చెప్పారు. నవలా పరిచయం చదివితే ఆసక్తికరం గా అనిపించింది.ఇది సుధగారి తొలి కన్నడ నవలానువాదమట.కాని చదివితే ఇది తన తొలి నవల అని అనిపించదు. అంత చక్కగా ,సూటిగా,సరళం గా రాశారు.సుధ గారి గురించి నేను ప్రత్యేకం గా పరిచయం చెయ్యక్కర్లేదు.ప్రస్తుతం “Infosys Foundation ” కి చైర్ పర్సన్ గా సేవలు అందిస్తున్నారు.ఆర్.కె.నారాయణ్ పేరిట ఇచ్చే సాహిత్య పురస్కారాన్ని పొందారు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత.

బకుల అన్నది ఒక పువ్వు పేరు.సంస్కృత పదం.తెలుగులో పొగడ పువ్వని అంటారు.ఈ మొక్క బెరడు,గింజలని ఆయుర్వేదంలో దంతచికిత్సలో భాగం గా వాడేవారట.హిందువులు పవిత్రం గా భావించే ఈ పుష్పాలు సౌందార్యానికి ప్రతీకగా చెప్పబడింది. ప్రేమ చిహ్నం గా భావించబడింది. కాళిదాసు తన రచనలైన రఘువంశం,అభిజ్ఞాన శాకుంతలం లో బకుల పుష్పాల గురించి చాలా రమ్యం గా వర్ణించాడు.ఇక కౌటిల్యుడు తన అర్థశాస్త్రం లో బకుల నారతో  వస్త్రాలని నేసేవారని పేర్కొన్నాడు.

సుధ గారు తన నవలని ఇలా పరిచయం చేస్తారు.”నేను ఈ నవల రాసే సమయానికి కార్పొరేట్ ప్రపంచాన్ని చూడలేదు.కాని తరువాత ఆ ప్రపంచపు తీరుతెన్నులు తెలిశాయి.పారిశ్రామీకరణ,సాంకేతిక మరియు శాస్త్రీయ రంగాలలో పురోగమనం మన దేశం సమృద్ది చెందడానికి దోహదపడే అంశాలు.ఈ అభివృద్ది చెందే క్రమంలో సామాజికంగాను మరియు వ్యక్తిగతం గాను సమస్యలు సృష్టించబడ్డాయి.

నవలని 1980లలో ఉత్తర కర్ణాటక నేపథ్యంగా రాశాను.దానివల్ల కొంచెం పాత గా అనిపించొచ్చు. కాని ఈ కథ ఎప్పుడైనా,ఎక్కడైనా జరగొచ్చు,ఈ రోజుటికి జరుగుతూ ఉండొచ్చు.చిన్న ఊరు లేదా పెద్ద నగరాలు కావొచ్చు ఈ రోజుటికీ ఎన్నో జంటలు ఈ సందిగ్ధావస్థలో ఉండిఉండొచ్చు.”  ఈ వాక్యాలు చదివిన వెంటనే కథని చదవాలన్న ఆసక్తి కలుగుతుంది.

మొదటి పేజీ నుంచే కథలో మనల్ని లీనం చేస్తారు సుధగారు.ఈ నవల నాయికానాయకులైన శ్రీమతి,శ్రీకాంత్ హుబ్లిలో పక్క పక్క ఇళ్ళలో ఉండేవారు.వారి పాఠశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులుగా పేరు తెచుకున్నవారు. తుది పరీక్షలలో రాష్ట్రంలో శ్రీమతి మొదటి స్థానం,శ్రీకాంత్ రెండవ స్థానం పొందడం వారి ఉపాధ్యాయులని ఆశ్చర్యపరచదు.

ఇద్దరి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. దీని వల్ల పాఠశాలలో అంతగా  మాట్లాడుకోని వీరిరువురు తుది పరీక్షలయ్యాక ఒక రైలు ప్రయాణంలో  మాట్లాడుకోవడం జరుగుతుంది.ఇద్దరూ మిత్రులవుతారు.పై చదువులలో భాగంగా శ్రీకాంత్ సైన్స్ కాలేజ్‌లో చేరగా ,శ్రీమతి ఆర్ట్స్ కాలేజ్‌లో  చేరుతుంది.శ్రీకాంత్ ఇంజినీరింగ్ చదవడానికి ఐ.ఐ.టీ బాంబేకి వెళ్లగా శ్రీమతి యం.ఎ చేరుతుంది.కాలక్రమేణా ఇద్దరూ ఇష్టపడుతారు.ఇరు కుటుంబాలని ఒప్పించి  ఒక్కటవుతారు.శ్రీకాంత్ బాంబేలో  అప్పుడప్పుడే వెళ్లూనుకుంటున్న  ఐ.టి రంగానికి సంబంధించిన కంపనీ  లో చేరుతాడు.వడి వడిగా కార్పొరేట్  ప్రపంచపు నిచ్చెనలను ఎక్కడం మొదలుపెడ్తాడు.శ్రీమతి తన ఆశలను,ఆశయాలని మరచిపొయి శ్రీకాంత్ నీడగా,నిశ్శబ్దంగా తన బాధ్యతలని నిర్వహించే భార్యగా,కార్పొరేట్లో ఉన్నత శిఖారాలని అధిరోహించిన నాయకుని భార్యగా  మారుతుంది. కానీ ఒక రోజు తన పాత ప్రొఫెసర్ తో మాట్లాడుతుండగా ,తన జీవితాన్ని తరచి చూసుకుంటుంది.తను ఏం  చేశాను అని ప్రశ్నించుకోగా,తన జీవితం ఖాళీగా అనిపిస్తుంది. శ్రీమతి తీసుకునే కీలక నిర్ణయంతో నవలని ముగించారు సుధ గారు.

ఉత్తర కర్ణాటకలోని ప్రదేశాలైన హుబ్లి మరియు ధార్వాడ్ అందాలతో పాటు అప్పటి బాంబే నగర జీవితాన్ని చక్కగా వివరించారు.

ఈ కథ 1980లలో రాసి ఉన్నప్పటికీ,ఈ రోజుకీ ఈ సమస్యని ఎదుర్కోనే ఎంతో మంది జంటలని చూస్తూనే ఉన్నాము.సుధగారు ఊహించి రాసినప్పటికీ ఇది ఇప్పటికి,ఎప్పటికీ పరిష్కారం కాని సందిగ్ధావస్థ.

Two States: Story Of My Marriage

సాధారణం

ఈ మధ్య కాలం లో చదివిన మరో నవల “Two States:Story Of My Marriage “గురించి పరిచయం చెయ్యాలనిపించింది.ఈ నవలని రాసిన వారు “చేతన్ భగత్”.రచయిత గురించి నేను కొత్తగా పరిచయం చెయ్యక్కరలేదు.”చేతన్ భగత్”,ఈ మధ్య కాలం లో ప్రాచుర్యం పొంది యువ మరియు ఔత్సాహిక రచయితలకు రోల్  మోడల్‌గా నిలిచారు అనడంలో అతిశయోక్తి లేదు.

భగత్ ఐ.ఐ.టి,డిల్లి లో ఎంజినీరింగ్ మరియు ఐ.ఐ.ఎం,అహ్మదాబాద్ లో యం.బి.ఎ చేసారు.బ్యాంకింగ్ రంగం లో కొంత కాలం సేవలు అందిచాక రచనారంగం లోకి మళ్ళారు.మొదటి  నవల “Five Point Someone- What not to do at IIT” తోటి ప్రాచుర్యం లోకి వచ్చారు.ఈ మధ్యకాలం లో విడుదలయ్యి జనరంజక చిత్రం గా అందరి మెప్పు పొందిన “3 Idiots  “కి  ఈ నవల ప్రేరణ.

మలి నవలలైన “One night at call center”,”Three mistakes of my life” కూడా జనాదరణ పొందాయి.”One night at call center” నవల “hello” అనే చిత్రంగా మన ముందుకి వచ్చింది.”Three mistakes of my life” నవల హక్కులని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ “Excel Entertainments ” కొనుగోలు చేసింది.భగత్ రాసిన ఇటీవలి నవల ” Two States: Story Of My Marriage”.రచయిత ప్రస్తుతం “Dainik Bhaskar”,”Times of India  ” పత్రికలకు “columnist ” గా పనిచేస్తున్నారు.

ఇప్పుడు  మన టపా అసలు విషయంలో కి వస్తాను.
ఈ నవల కూడా తన మొదటి నవలలా తన నిజజీవితమే ప్రేరణ అని రచయిత  చెప్పారు.కొంత కాల్పనికం జోడించారు.

భగత్ నుంచి మరో నవల రాబోతోంది అంటే చాలా  కుతూహలం గా అనిపించింది.దానికి తోడు నవల పేరు కూడా అలాగే అనిపించింది మన వరుడు సినిమాలా .రెండూ వివాహం అన్న విషయం పైనే  రాసారు మరియు తీసారు.ఇక నవల కథ స్థూలం గా చెప్పలంటే  ఇది క్రిష్ మరియు అనన్యల ప్రేమకథ. క్రిష్ డిల్లీ లో స్థిరపడిన పంజాబీ అబ్బాయి.అనన్య సాంప్రదాయ తమిళ కుటుంబం నుంచి వచ్చిన  అమ్మాయి.ఐ.ఐ.ఎం లో క్లాస్ మేట్స్. అక్కడ ఉన్నప్పుడే ప్రేమలో పడి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.ఇద్దరూ భిన్ననేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి రావడం వల్ల షరా మాములుగా వారి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించరు.వారి తల్లిదండ్రులను ఒప్పించి ఎలా వివాహం చేసుకున్నారనేది మిగతా కథ.కొంచెం హాస్యం మిళితం చేసారు. ఇక్కడ హాస్యం అంటే  దక్షిణాది వారు ఉత్తరాది వారిని మరియు ఉత్తరాది వారు దక్షిణాది వారిని ఎలా  అర్థం చేసుకుంటారో చేప్పారు.

మన వరుడు సినిమా విడుదలకు ముందు ఎలా ఉత్సుకత రేపిందో ఈ నవల కూడా  అంతే.విడుదలయ్యాక వరుడు లో విషయం ఏమి లేదనిపించిందో  ఇది చదివాక నాకు  కూడా అలాగే అనిపించింది.కథ మొత్తం చదివాక రొటీన్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది.ఇలా ఎంత కాలం దక్షిణాది,ఉత్తరాది వారి అలవాట్లని,సంస్కృతులని వ్యంగ్యం గా చిత్రీకరిస్తారో తెలియడం లేదు.

కూసింత టైం పాస్ కావలనిపిస్తే  ఒక సారి నవలని తిరగేయ్యండి!!!

The Kite Runner

సాధారణం

బ్లాగ్ మొదలుపెట్టి చాలా రోజులయ్యింది.ఇన్ని రోజులు ఏమి రాయాలో తెలియలేదు. ఎట్టకేలకు  నా బ్లాగ్ కి మంచి రోజులు వచ్చాయనుకుంటాను.ఒక మంచి టపా రాసే అదృష్టం కలిగింది.

ఈ టపా లో ఇటీవలి కాలం లో నేను  చదివిన ఆంగ్ల నవల పరిచయం చెయ్యాలనిపించింది.

నేను చదివిన నవల పేరు “The Kite Runner”.రాసినది “ఖలీద్ హొస్సెని”.ఇది రచయిత తొలి నవల.2003 లో ప్రచురింపబడినది.ఈ నవల ఆధారంగా ఆంగ్ల మరియు పర్షియన్ భాషలలో చిత్రాన్ని  నిర్మించారు.ఈ చిత్రం “గోల్దెన్ గ్లోబ్” మరియు “అస్కార్” అవార్డ్స్ కి నామినేట్  అయ్యింది.

రచయిత గురించి చెప్పాలంటే..ఇతను అఫ్ఘాన్ దేశస్థుడు.1980ల ప్రాంతంలో అఫ్ఘాన్ పై రష్యా జరిపిన దాడులలో  అమెరికా రాజకీయ శరణు పొందిన వాడు.ప్రస్తుత నివాసం అమెరికాలో.అక్కడే వైద్యుడి  గా సేవలు అందిస్తున్నాడు. 

ఈ నవల అమీర్ అనే అబ్బాయి కథ.అతనే మనకీ కథని వివరిస్తున్నట్లు ఉంటుంది.అమీర్ కాబుల్ లోని ఒక ధనిక నేపథ్యం ఉన్న అబ్బాయి.అమీర్ తన బాల్యస్మృతులతో  పాటు  బాల్యమిత్రుడైన హస్సన్ ని పరిచయం చేస్తాడు. హస్సన్ అతని ఇంట్లో  పనిచేసే అలీ అబ్బాయి. ఇద్దరూ తల్లి ప్రేమకి నోచుకోని వారే.అమీర్ తండ్రి అమీర్‌ని అభిమానించిన విధంగానే హస్సన్ ని అభిమానిస్తాడు. అమీర్ 1975లలో ని అఫ్ఘాన్ అందాలను,  అక్కడి ప్రజల జీవన గమనాన్ని,వారు జరుపుకునే  పండుగలను ,వినోదాలను   వివరిస్తాడు.  వాళ్ళ  ప్రాంతం లో   ముఖ్యం గా  పేరోందిన  గాలిపటం పందాలను గురించి వివరిస్తాడు. ఈ కథాక్రమం లోనే అఫ్ఘాన్ తెగలైన  పష్తూన్లు మరియు  హజారాల గురించి చెప్తాడు. అమీర్,అమీర్  తండ్రి,అలీ,హస్సన్ మరియు అమీర్ తండ్రి స్నేహితుడు రహిం ఖాన్ మధ్య అనుబంధాన్ని  చెప్తాడు.కథలు రాయడం  లో అమీర్ అభిరుచిని గమనించిన రహీం ఖాన్ అతన్ని ప్రోత్సహిస్తాడు.  మధ్యలో కొన్ని సంఘటనల   వలన అలీ మరియు హస్సన్ ఇల్లు వొదిలి వెళ్ళిపొతారు.ఇంతలో రష్యా దాడుల వల్ల అమీర్,అతని తండ్రి పాకిస్తాన్ మీదుగా అమెరికాలో శరణార్థులుగా అడుగుపెడ్తారు. వారి లాగే శరణార్థులుగా ఉన్న మరికొంతమందిని కలుస్తారు.అఫ్ఘాన్ లో విలాస జీవితాన్ని గడిపిన  వారు మళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెడ్తారు. ఈ క్రమంలో అమీర్ తన చదువుని పూర్తి చేసి తనలాగే అఫ్ఘన్ నుంచి  శరణార్థి కుటుంబం గా వచ్చిన  సురయ్యని పెళ్ళి చేసుకుంతాడు.ఇంతలో అమీర్ తండ్రి మరణిస్తాడు. అమీర్,సురయ్య సంతోషం గా ఉన్నా,పిల్లలు కలగరనే చేదు నిజం వారిని బాధిస్తుంది.

పదిహేను సంవత్సరాల తరువాత తన తండ్రి మిత్రుడైన  రహిం ఖాన్ నుంచి కబురు వస్తుంది కలవమని.రహిం ద్వారా  అమీర్ కి ఒక చేదు నిజం తెలుస్తుంది.తన ఆఖరి కోరిక ప్రకారం అమీర్ మళ్ళీ తాలిబన్ల పాలన లో ఉన్న అఫ్ఘన్ లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది.

నిజం చెప్పాలంటే ఇది  రచయిత తొలి నవల అని అనిపించదు. చాలా అనుభవశాలి గా రాసారు. కథని పట్టుగా నడిపారు.నవల పూర్తి చేశాక చాలా  ఎమోషనల్ గా అనిపించింది. అఫ్ఘానిస్తాన్ గురించి,అక్కడి  ప్రజల గురించి తెలిసింది.వారు ఉన్న పరిస్థితి కి కొంచం  బాధ వేసింది.  

ఏది  ఏమైనా  ఒక మంచి నవల చదివామన్న తృప్తిని  మిగిల్చింది.
చదివి చూడండి!!!!!