పైన టపా టైటిల్ చూసి సదరు యాంకరమ్మ గురించి ఈ టపా అనుకుంటే మీరంతా హార్లిక్స్ లో కాలేసినట్టే (సదరు యాంకరమ్మ యాంకరింగ్ చేసిన ఒకానొక కార్యక్రమానికి హార్లిక్స్ వాళ్ళు స్పాన్సర్స్ కాబట్టి వాడేసా…):p
ఆర్భాటం గా ప్రారంభోత్సవాలు చేయించుకుని మధ్యలో ఆగిపోయే ప్రాజెక్టుల్లా అప్పుడెప్పుడో సమరభారతి గురించి రాసి…వెంటనే తాతగారి వివరాలు,చిత్రాల గురించి రాద్దామని భీకర స్టేట్మెంట్లు ఇచ్చి కాం అయ్యిపోయా…
మొన్న దుమ్ము పట్టిపోయిందని పుస్తకాలవీ సర్దుతూంటే నేను ప్రెపేర్ చేసుకున్న నోట్స్ ,బొమ్మలబుక్కూ మళ్ళీ కనిపించాయి.. ఈ సారి ఎలాగైనా రాసెయ్యాలి అని డిసైడ్ అయ్యి వెంటనే వెళ్ళి ఒక బొమ్మని స్కానింగ్ చేసుకుని తెచ్చుకున్నా..
స్కానింగ్ కూడా అయ్యిపోయింది….ఇక బ్లాగడం ఒక్కటే బాకీ అని వెంటనే బ్లాగేద్దామని ఆవేశం గా లాపీ ముందేసుకుని కీ బోర్డ్ దడ దడలాడించా…
కీ బోర్డ్ దడ దడ అని సౌండ్ వచ్చిన మాట నిజమే కానీ టపా లో ఒక్క పేరా కూడా ముందుకు సాగలేదు…as usual బాగా రాసాను అని అనిపించలేదు…టైప్ చేసి అలసి పోయాము కొంచెం రెస్టు తీసుకుంటే అవిడియాలు ఫ్రెష్ గా వస్తాయని అలా కళ్ళు మూసుకున్నాను… వెంటనే నిద్రాదేవి కరుణించడం తో కునుకు పట్టేసింది…
ఇంతలో ఎవరో లేపుతున్నారు…ఇప్పుడెవరబ్బా అని ఆలోచిస్తూ కళ్ళు తెరుద్దామా వద్దా అని ఆలోచిస్తూ సగం కళ్ళు తెరిచి చూసా…అక్కడ తాతగారొకరు నిలబడి ఉన్నారు…
నేను: మీరూ….
తాతగారు: నేనమ్మా మర్చిపోయావా……
నేను (మొహం లో వెయ్యి వోల్టుల బలుబు కాంతితో) :తాతగారూ మీరా ……ఇలా వచ్చారు…నాతో ఏదన్నా పనుందా?
తాతగారు: అంతా కుశలమేనా..
నేను:అందరూ బాగున్నారు తాతగారూ,చెప్పండి..
తాతగారు: నువ్వేదో బ్లాగు రాస్తున్నావని విన్నాను..
నేను (ఆనంద భాష్పాలతో) : నేను బ్లాగు నడిపే సంగతి మీ వరకు వచ్చిందా..అవును తాతగారు రాస్తున్నాను…
తాతగారు: నా మీద ఏదో మొదలెట్టావట..
నేను: అవును తాతగారు…మీరు వేసిన పెయింటింగ్స్ గురించి ఒక శీర్షిక మొదలు పెట్టాను…
తాతగారు: ఇంతవరకు ఏమి రాసావు…ఎన్ని పెయింటింగ్స్ నీ బ్లాగులో పెట్టావు?
నేను : మీ సమరభారతి పెయింటింగ్ పెట్టాను..మిగతా వాటి గురించి కూడా త్వరలో రాసేస్తాను..
తాతగారు: ఆరు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు..ఇంకెప్పుడు రాస్తావమ్మా..
నేను(స్వగతం:ఆ విషయం కూడా మీకు తెలిసి పోయిందా) :అదేమి లేదు తాతగారు..ఇప్పుడే ఒక టపా స్టార్ట్ చేసాను…రేపటి లోపల పూర్తి చేసి ప్రచురించేస్తాను….
తాతగారు : నా మానాన నేను హాయిగా ఉంటే..బ్లాగని..టపా అని ఏదేదో రాసి..సమరభారతి గురించి రాసావు..మిగతాది రాస్తావు అనుకుంటే అది కాస్తా అటకెక్కించావ్….ఇప్పుడు రాయకపోయావో…చెప్తా నీ పని …అని నాలుగు మొట్టి కాయలు మొట్టారు…
నేనేమో తాతగారు..అలా ఏమి లేదండి..వెంటనే రాసేస్తాను..మీరు అలా మొట్టకండి అని అరుస్తా ఉన్నాను…
ఇంతలో మా వారొచ్చి గట్టిగా కుదుపుతూ అడుగుతున్నారూ బానే ఉన్నావా అని …
నేనేమో అదీ మీ తాతగారూ ,నేనూ ఇంత సేపు మాట్లడుతూ ఉన్నాము….ఆయన పెయింటింగ్స్ గురిచి,పెయింటింగ్స్ బొమ్మల గురించి త్వరగా బ్లాగులో రాయమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అని లొడా లొడా చెప్తూ ఉన్నాను…
ఎంత సేపు వాగుతావో వాగు…అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తా ఉన్నారు తను…ఇంకా నా సోది కంటిన్యూ అయ్యేసరికి ఇంకొక్క మొట్టి కాయ మొట్టేప్పటికీ ఈ లోకంలోకి వచ్చి పడ్డా…
అప్పుడు గానీ అర్ధం కాలేదు…అదంతా కల అని…
కలని కాస్త రివైండ్ చేసుకుంటే అర్ధమయ్యింది…తాతగారి చిత్రాలు అని శీర్షిక ఆర్భాటం గా ప్రారంభించి దాని పైన కొనసాగింపు టపాలు రాయలేకపోయాననీ…చివరాఖరికి తాతగారే స్వయానా కల్లోకి వచ్చి సుతి మెత్తగా మొట్టి కాయలు మొట్టారని…
ఈ రోజు ఏమయితే అయ్యింది కానీ టపా పూర్తి చేసెయ్యలని మొదలెట్టా…షరా మాములుగా ఎక్కడ్నుంచి ,ఎలా మొదలెట్టాలన్నదీ అర్ధం కాలేదు…
అయినా వదులుతానా..పట్టు వదలని విక్రమార్కురాలిలా ప్రయత్నించా…
ముందుగా కింది బొమ్మని చూడండి…
ఈ బొమ్మ చూసి మీకీ ఈ పాటికి టపా కి ఈ టైటిల్ ఎందుకు పెట్టానో మీకర్ధమయ్యిందని నాకర్ధమయ్యింది…
ఈ చిత్రం పేరే ఉదయభాను…
ఉదయభాను కలర్ పెయింటింగ్ అయినా నాకు దొరికింది బ్లాక్ అండ్ వైట్ చిత్రమే..అదే పెడుతున్నాను..
1934 లో కాకినాడ లో జరిగిన “All India Swadesi Art Exhibition” లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ఈ చిత్రానికే బంగారు పతకం వచ్చిందంట…. 🙂
ఇవే కాదూ ఇంకా బోలేడు బొమ్మలకి బోలేడు అవార్డులూ,రివార్డులూ వచ్చాయంట..
ఇప్పుడా బొమ్మని కొంచెం జూం చేస్తే తాతగారి సైన్ “SNC” అని కనిపిస్తుంది…
తాతగారు కొన్ని చిత్రాల్లో “SNC” గానూ,Ch.సత్యనారాయణ అని తన పూర్తి పేరును రాసుకున్నారు…
తరుతరువాత తన పేరు ని స్టైలిష్ గా “SN.CHAMAKUR” అని మార్చుకుని అదే పేరు తో చిత్రాలు వేసారు… కలం పేర్లూ,బ్లాగు పేర్లూ గట్రా ఉండేట్లు అప్పట్లో ఆయన ఈ పేరుతో చిత్రాలు వేసేవారంట..
“చామకూరు సత్యనారాయణ రావు” ..ఇదీ తాతగారి అసలు పేరు…కానీ “S.N.Chamakur” గానే ఆర్టిస్ట్ వర్గాల్లో ప్రసిద్దం…
తాతగారు “Live Portraits” వేయడం లో చాలా ప్రసిద్ది చెందారు…
ఆయన వేసిన ప్రముఖుల నిలువెత్తు తైల వర్ణ చిత్రాలు మన రాజ్య సభలోనూ ,అసెంబ్లీ లోను ఉన్నాయట.
ఇంకా మద్రాస్ హై కోర్టూ,ఇతరత్రా ముఖ్య కార్యాలయాలోనూ ఉన్నాయట..
తాతగారు వేసిన “టంగుటూరి ప్రకాశం పంతులు “ తైల వర్ణ చిత్రం మన రాజ్య సభలో ఉంది.అది మన ఆంధ్ర ప్రభుత్వం వారిచే బహుకరించబడిందంట. …
వికిపీడియాలో టంగుటూరి ప్రకాశం పంతులు అని కొడితే ఈ లింకొచ్చింది…
http://en.wikipedia.org/wiki/Tanguturi_Prakasam
అందులో పంతులు గారి ఫుటో ఉండి..ఫుటో కింద “Portrait of Tanguturi Prakasam, by S.N. Chamkur, located in Rajya Sabha” అని ఉంటేనూ.అక్కడనుంచి తీసుకున్నా…కాపి రైట్ కింద…ఈ క్రెడిట్ వికీ వారికే…:)
మన రాష్ట్ర అసెంబ్లీ లో ఉన్న ప్రకాశం గారి చిత్రాన్ని కూడా తాతగారు వేసిందే అట. పంతులు గారి చిత్ర పటాన్ని అప్పటి రాష్ట్రపతి అయిన “రాజేంద్ర ప్రసాద్” గారిచే ఆవిష్కరింపబడిందంట..
దామెర్ల రామరావు గారి వద్ద శిష్యరికం చేసిన తాతగారు..తరువాత రాజమండ్రి లోని “Daamerla Ramarao Memorial Art Gallery and School ” ని నెలకొల్పిన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరట.
తాతగారు గురించిన మరి కొన్ని వివరాలు,వారి కుంచె లోనుంచి జాలువారిన మరి కొన్ని అద్భుతాలను తరువాతి టపాలో పెడతానే…
P.S: తాతగారిని నేను ప్రత్యక్షం గా చూళ్ళేదు… 😦 కానీ తనతో ఉండి ,చనువు పెరిగి ఉంటే అలా మందలించి ఉంటారని రాసా…వేరేలా కాదు!!!…