ఈ టాపిక్ ఇచ్చి దీని పైన వ్యాసం రాసుకుని రమ్మని చెప్పారు మా టీచర్.అప్పుడే మాకు ఎస్సే రైటింగ్ ఎలా రాయాలో చెప్పిస్తున్నారు…హోం వర్కులో భాగంగా ఈ టాపిక్ ఇచ్చారు…ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది క్రిస్మస్ పైన,ఇంకొకరు రంజాన్ పైన వ్యాసం రాసుకొస్తామన్నారు…
చిక్కు వచ్చి పడింది నాకే..నాకేమో బొలేడు ఆప్షన్స్ ఉన్నాయి..దేని మీద రాసుకు రావాలో అర్ధం కావడం లేదు..
నాకు బాగా ఇష్టమైనవి ఏవా అని ఆలోచిస్తే అంటే మిగతావి ఇష్టం లేవని కాదు ఇవి కుంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట…వాటిలో రెండు పండుగలు తేలాయి..ఒకటి దీపావళి ఇంకొకటి వినాయక చవితి…
ఇప్పుడు ఈ రెండిటిలో దేని మీద రాసుకెళ్దామా అని నాకు ఒకటే కంఫ్యూషన్…
ఒకటేమో వెలుగు జిలుగుల దీపావళి..ఇంకొకటేమో బుజ్జి గణపయ్యని ఇంటికి తీసుకు వచ్చి ,మంటపం ఏర్పరచి ప్రతిష్ఠించి,నైవేద్యాలు అవీ పెట్టి ,బాగా చదవాలని పుస్తకాలు(చూసారా ఇక్కడా చదువు వదలడం లేదు) పూజలో పెట్టి,వాటికి పసుపు బొట్లు పెట్టి పూజ చేసుకోవడం.ఆరంభించిన కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగమని దేవుని మొక్కుకోవడం.
చివరకి నా మనసు బుజ్జి గణపయ్య పండగ వైపే మొగ్గింది…
ఇంకేం ఆ పండగ ఎలా చేసుకుంటామో సవివరం గా వర్ణిస్తూ ఎస్సే రాసి పట్టుకెళ్ళి పోయా…
మా టీచర్ దాన్ని చదివి గుడ్ అని రిమార్క్స్ ఇచ్చారు…ఆ టైంలో అలా రిమార్క్స్ తెచ్చుకోవడం అదొక ఆనందం…తుత్తి..
పండగ దగ్గరకొస్తోంటే రావడమేమిటి రేపే కదా..ఇవన్ని గుర్తొచ్చింది..మా వీధిలో మేము చేసే హడావిడి,ఇంట్లో పూజకు తయారయ్యేది అన్నీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…:)
పది రోజుల ముందే మా వీధిలో ఈ సంబరాలకి అంకురార్పణ జరిగేది…ఇంటి చుట్టు పక్కల అంతా చుట్టాలే..అందరూ చందాలేసుకుని గణనాథుని విగ్రహాని ప్రతిష్ఠించి పదకొండు రోజులపాటు పూజలు,నైవేద్యాలతో అర్చించాక నిమజ్జనానికి తీసుకెళ్ళేవారు…
చందాలు వచ్చి తీసుకెళ్ళడం…పండగ ముందు రోజు రాత్రి పందిరి వేసి రంగు రంగుల కాగితాలతో అలకరించడం…విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పీఠం ఏర్పాటు చేయడం…
మా అన్నయ్య వాళ్ళంతా ఈ పనులలో తలమునకలయ్యి ఉంటే మేము మధ్యలో వెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయా అని చూసొచ్చే వాళ్ళము…
పండగ రోజు తెలవారిన వెంటనే ముందు వెళ్ళి పందిరి ఎంత బాగా అలకరించారని చూసుకొచ్చిన తరువాతే మిగతా కార్యక్రమాలు…
తలంటు పోసుకుని,కొత్త బట్టలు వేసుకుని నాన్నగారితో విగ్రహం తేవడానికి వెళ్ళేవాళ్ళము..ఈ లోపల అమ్మ,నానమ్మ వాళ్ళు నైవేద్యాలు తయారు చేసే హడావిడిలో ఉండేవాళ్ళు …ఉండ్రాళ్ళు,కుడుములు చేయడంలో సాయం చేసే వాళ్ళం…అవైతే వీజీ కాబట్టి…మధ్యలో టెంప్ట్ అయ్యి నోట్లో పెట్టుకోబోతే తప్పు దేవుడికి పెట్టేంతవరకు తినకూడదని నాన్నమ్మ చెప్పేది…
రాహుకాలం వచ్చే లోపు పూజ చేసెయ్యాలి కానివ్వండి కానివ్వండి అంటూ తాతగారు హడావిడి పెట్టే వాళ్ళు…విగ్రహాన్ని ప్రతిష్ఠించి ,గణపయ్య కు అలంకారం చేసి ,ప్లేట్లలో పండ్లు,నైవెద్యాలు అన్ని పెట్టేసి…పుస్తకాలు ఏం పెట్టాలా అని ఆలోచించే వాళ్ళము నేను,చిన్నీ…
మాథ్స్ బాగా టఫ్ కాబట్టి లెక్కలు బాగా రావాలని ఆ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి పెట్టేదాన్ని…ఇక తాతగారు పూజ ఆరంభించి వ్రత కథ మొత్తం చదివి అక్షింతలు చల్లేవారు…
మా వీధిలో ప్రతిష్టించిన వినాయకుడి దగ్గరకు వెళ్ళి దణ్ణం పెట్టుకు వచ్చేవాళ్ళము…
మా వీధిలో వినాయకుడి దగ్గర పూజ ప్రారంభం అవ్వటానికి ముందు భక్తి పాటలు పెట్టేవారు…స్త్రోత్రాలు అవీ అయ్యాక మన తెలుగు సినిమలోని పాటలు వేసే వాళ్ళు..అవేమిటనగా కూలీ నంబర్ వన్నేనా…అందులో ఓ వినాయకుడి పాటుంది చూసారు అది ప్రతి వినాయక చవితికీ మోగేది…తరువాత దేవుళ్ళు అని ఓ సినిమా లోని వినాయకుడి పాట…నేను చెన్నై వెళ్ళే ముందు జై చిరంజీవలో వచ్చిన వినాయకుడి పాట…ఇవి కంపల్సరీ ప్రతి చవితి కి ప్లే చేసేవాళ్ళు(అప్పుడే గుర్తొస్తాయనుకుంటా) మరి ఈ సారి లిస్ట్ లో కొత్త పాటలేమైనా యాడ్ అయ్యిందేమో కనుక్కోవాలి…
10th వరకు మాథ్స్ అంటే హడలు అందువల్ల ఆ టెక్స్ట్ బుక్కే పెట్టేదాన్ని ..ఇంటర్లో ఎంసెట్ పుస్తకాలు,ఇంజినీరింగ్లో టఫ్ సబ్జెక్ట్లు ఏవో అవి…
ఇక ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఓ సారి పండక్కి వచ్చా..ప్రతి సంవత్సరం పూజలో పుస్తకాలు పెట్టడం అలవాటయ్యింది..ఆ టైంకి చూస్తే నా దగ్గరేమో పెట్టేందుకు బుక్స్ లేవు…ఉన్నవి కొన్ని హాస్టల్లో వదిలి వచ్చా..ఏం పెట్టాలో అర్ధం కావడంలేదు…సరే ఇంజినీరింగ్ బుక్స్ పెడదామని చూస్తే C,C++,జావా తెక్స్ట్ బుక్స్ఉన్నాయి…ప్రస్తుతం ఫుడ్ పెట్టేవి ఇదే కనక అందులోనూ పనియే ప్రత్యక్ష దైవం కావున ఈ పుస్తకాలనే పూజలో పెట్టా..దాని తో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బుక్కొకటి…
మా ఊరిలో చవితి విశేషం ఏమిటంటే సాయంకాలం వినయకుడు పెట్టిన పందిరి దగ్గర అందరూ చేరి ఉట్టి కొట్టడం, హోలి ఆడ్డం..జన్మాష్టమిని,హోలిని కలిపి మా వాళ్ళు ఫ్యూషన్ చేసారు..వినడానికి వెరైటీ గా ఉంది కదూ..నేను ఎందుకని అడిగితే సరదా కోసం అని చెప్పేసారు… ఉట్టి కొట్టేంత వరకు అక్కడే ఉండేదాన్ని …రంగుల పోయడం మొదలు పెడితే నేను జంప్…
ఇవన్నీ అయ్యాక ఇంట్లోని వినాయకుడి కి ఉద్యాపన పలికాక మా ఇంటికి దగ్గర ఉండే నాలుగు వీధుల్లో వినాయకుళ్ళను చూసేందుకు వెళ్ళేవాళ్ళం మా పిల్లల గాంగ్..తరువాతర్వాత ప్రతి వీధిలో థీం బేస్డ్ వినాయకుళ్ళను పెట్టడం ఫాషన్ అయ్యిపోయింది…ఓ సారి సునామి వినాయకుడిని పెట్టారు…
పండక్కి మా ఊరు వెళ్తున్నంత వరకు ఈ హడావిడి ఏది మిస్సవ్వలేదు..
బెంగళూరు కి వచ్చాక ఊరెళ్ళడం కుదరడం లేదు…మా అపార్ట్మెంట్స్ లో నన్నా ఇలాంటివి ఏమన్నా పెడతారనుకుంటే అట్టాంటివి ఏమి జరగడం లేదు..ఇక్కడ పక్కన ఎవరు ఉన్నారు ,ముందు ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియనట్లు ఉంటున్నారు…హ్మ్..
ఈ సారేమైనా చేస్తారో చూడాలి…
మా ఆడపడచు వాళ్ళు బెంగళూరు లోనే ఉంటారు …పండక్కి రమ్మని పిలిచాము..తను లేదురా మా వాడికి పరీక్షలు ఉన్నాయి…దగ్గరుండి చదివించాలి…లేకపోతే ర్యాంక్ డవున్ అయ్యిపోతుంది..ఈ సారి వస్తాములే అని చెప్పారు..ఇంతకీ వాడు చదివే క్లాసు ఏదో తెలుసా…UKG…ఏమిటో ఈ చదువులు…ఇక్కడా కథ మళ్ళీ మొదలు…:)
సో హౌ ఈస్ మై ఫేవరిట్ ఫెస్టివల్ విశేషాలు??
ఈ వినాయక చవితి మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ..అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు….
బెంగళూరులో చేసుకున్న గౌరి గణేష హబ్బ గురించిన విశేషాలు తరువాత రాస్తానే…