Category Archives: కబుర్లు

దీపావళి ముచ్చట్లు

సాధారణం

పండక్కి శుభాకాంక్షలు చెప్దామని మొన్నననగా టపా మొదలుపెట్టా.కానీ ఆఫిస్లో పనుల వల్ల వెంటనే పోస్ట్ చేయలేకపోయా…

దానికేమిటయ్యా కారణం అంటే..ఇదీ…

మా ఆఫిస్కేమో మంగళ వారం సెలవిచ్చారు.పండగేమో బుధవారమాయే…మా లీడ్ అందరినీ పిలిచి ఎప్పుడు తీసుకుందాము లీవు మంగళవారమా బుధవారమా అని అడిగారు…అందరూ వీకెండు,సోమవారం లీవు పెడితే ఓ లాంగ్ హాలిడే వస్తుందని మంగళవారం సెలవుకి వోటేసారు…పోనీ బుధవారం సెలవు పెడదామంటే ఆల్రెడి నేను లీవు తీసేసుకున్నాను.సరే త్వరగా వెళ్ళి సాయంకాలం త్వరగా వచ్చేద్దామని ఆఫిస్ కి వెళ్ళాను.చూస్తే జనాలెవ్వరూ (అంటే మా టీంలో) రాలేదు.వాళ్ళొచ్చేలోపు టపా రాసేద్దామని ప్రారంభించా…ఇంతలో పోలోమని అందరూ రావడం,మీటింగ్స్  గట్రాతో , ప్రాజెక్ట్ పనులతో ఆ రోజూ టపా పోస్ట్ చేయలేకపోయా….

సో చాలా చాలా ఆలశ్యంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.కాస్త ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు(రేపు నాగుల చవితని అత్తమ్మ చెప్పారు),చాలా చాలా ముందుగా కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు…(ఆంధ్ర రాష్ట్ర అవతరణోస్త్వం,కన్నడ రాజ్యోత్సవ  శుభాకాంక్షలూ చెప్దామని అనుకున్నాను…దీపావళి గురించి చెప్పేటప్పుడు దాని గురించి ఎందుకులే…అవతరణ దినోత్సవానికి  ఇంకో టపా వేద్దాంలే అని ఇప్పుడు చెప్పడం లేదు…):p

ఈ సెలవుల పుణ్యమా అని రెండు మూడు రోజులుగా ఆఫిస్ కి ,ఇంటికినూ అరగంటలో రీచ్ అవుతున్నాను.ఎప్పుడూ రద్దిగా ఉండే మా కాబ్ వెళ్ళే రూట్లోని రోడ్లు ఖాళీగా,విశాలంగా కనిపించింది.ఎక్కడెక్కడ ఏ ఏ షాపులున్నాయో అన్నీ కనిపించాయి.రోజూ ఆ రూట్లోనే వెళ్ళినా ఇన్ని రోజులు అసలు గమనించలేదు.

ఈ సెలవులయ్యాక ఇహ మళ్ళీ మాములే బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు…ఎప్పటికీ తీరుతాయో…హ్మ్మ్మ్మ్….

పోయిన సంవత్సరం కూడా టపాసులు కొనలేదు ఈ సారన్నా కొందామని వెళ్ళి మా వారినడిగా…

దానికి నో నో మనం టపాసులు కాల్చకూడదు..ఆల్రెడి కాలుష్యం ఎక్కువయ్యింది..మనం ఆ డబ్బుతో ఏ అనాధ శరణాయలం లో డొనేట్ చేద్దాము అని ఓ చిన్న క్లాస్ ఇచ్చారు…నో నో కనీసం రెండు కాకరొత్తుల పెట్టెలు,రెండు బురుసుల పాకెట్లైనా కొనాల్సిందే అని నేనూ ఓ క్లాస్ పీకి ఆఫిస్ కి వెళ్ళిపోయా.

కాబ్లో వెళ్తోంటే నేనూ,చిన్ని దీపావళి చేసుకునేది గుర్తొచ్చింది.మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు టపాసులు వాళ్ళే చేసుకునేవాళ్ళట.పోనీ మా అన్నయ్యలెమైనా నేర్పుతారనుకుంటే వాళ్ళూ టపాసులు కొనేవారు…టపాసులు మేమే తయారు చేసుకుని కాల్చే చాన్స్ మాకు రాలేదు…

పండగ మూడు రోజుల ముందు నుంచి టపాసులు కొనడానికి ఓ పేద్ద లిస్ట్ తయారు చేసి ముందు రొజు నాన్నకి ఇచ్చే వాళ్ళము.ఆ తెచ్చుకున్న దాన్ని నేనూ,చిన్ని సగం సగం పంచుకునేవాళ్ళము. ఒక సారి టపాసులు కాలుస్తుంటే చెయ్యి కాలింది.అప్పటి నుంచి ఢాం టపాసులు కాల్చాలంటే కొంచెం భయం…మొత్తానికి టపాసులన్నీ అయ్యాక…ఆఖరికి వాటికి ఇచ్చిన అట్ట పెట్టెలతో సహా కాల్చేసి దీపావళి ముగించేవాళ్ళము.

తర్వాతర్వాత కాల్చడం తగ్గింది.చెన్నై వెళ్ళాక ఏదో కాల్చాలని కొన్నే కొనేవాళ్ళము…చిన్ని ఇప్పుడు కాల్చడం తగ్గించేసింది…టపాసులు ఎండపెట్టుకోవడం,వాటిని పంచుకోవడం,ఎవరు ముందు వాళ్ళ కోటాను ముగిస్తారో అని చూడ్డం…అన్నీ ఎంత సరదాగా ఉండేదో…ఇలా ఆలోచిస్తుండగానే ఆఫిస్ వచ్చేసింది…

ఆ రోజే మా ఆఫిస్ లో అందరికీ మెయిల్ వచ్చింది..మాములుగా దీపవళికి ముందు టపాసులని డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాము తీసుకొండి అని పంపుతారు…

అదేనేమో అనుకుని మెయిల్ ఒపెన్ చేస్తే…అది స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు మొక్కల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మెయిల్.అరె ఇదేదో బాగుందే అని అనుకున్నాను.

పక్కరోజు చూస్తే మా కొలీగ్స్ అందరూ వెళ్ళి స్వీట్ల డబ్బాతో పాటు,మొక్కలు తెచ్చుకుని పెట్టుకుని ఉన్నారు వాళ్ళ సీట్ల దగ్గర ..అందులో క్రొటన్లూ,రోజా మొక్కలూ ఉన్నాయి..మనమూ చూద్దామని మా టీం మేటు లాకెళ్ళింది.

అక్కడ చూస్తే ఓ పేద్ద క్యూ ఉంది.మేమిద్దరమే లాస్టు ఆ క్యూలో..చివరాఖరికి స్వీట్ డబ్బా తీసేసుకున్నాము…మొక్కలేమిస్తారో అని చూస్తోంటే మా ఇద్దరికీ రోజా మొక్కలొచ్చాయి.:) మొక్కని తీసుకెళ్ళేందుకు వీలుగా దాన్ని ఓ జూట్ బాగులో పెట్టి ఇచ్చారు…

మొక్కలొద్దనుకున్న వాళ్ళని మాకిచ్చెయ్యండి అని వెళ్ళి రిక్వెస్ట్ చేసొచ్చాము..అలా నాకు రెండు మొక్కలొచ్చాయి…కానీ మొక్కలు తెచ్చుకున్నాక అనిపించింది ఈ సారి టపాసులకి పెట్టే డబ్బుతో ఇంకో నాలుగు మొక్కలు కొందామని….వచ్చే వారాంతం వెళ్ళి కొత్త మొక్కలు,వాటికి మట్టి,కుండీలు కొనాలని తీర్మానించా….

సో అలా ఈ సారి టపాసులు కొనలేదు….ఇల్లు మొత్తం చక్కగా దీపాలతో అలకరించాం లేండి…

మీరు టపాసులు కొనకపోతే ఏం మీ బదులు మేము కాలుస్తాము అని ఆ బాధ్యతని మా పక్కన ,వెనకింటి అపార్ట్మెంట్ల వాళ్ళు తీసుకున్నారు…

ఏడింటికి మొదలెట్టిన వాళ్ళు పదింటి వరకు కానిచ్చారు…టపాసుల శబ్దాలతో వీధి మోగిపోయింది.

అడగడం మర్చిపోయా అందరూ దీపావళి బాగా చేసుకున్నారా?

ఇవి ఈ సంవత్సరం దీపావళి పండగ ముచ్చట్లు….

ప్రకటనలు

మై ఫేవరిట్ ఫెస్టివల్ -:)

సాధారణం

ఈ టాపిక్ ఇచ్చి దీని పైన వ్యాసం రాసుకుని రమ్మని చెప్పారు మా టీచర్.అప్పుడే మాకు ఎస్సే రైటింగ్ ఎలా రాయాలో చెప్పిస్తున్నారు…హోం వర్కులో భాగంగా ఈ టాపిక్ ఇచ్చారు…ఉన్న ఫ్రెండ్స్  కొంతమంది క్రిస్మస్ పైన,ఇంకొకరు రంజాన్ పైన వ్యాసం రాసుకొస్తామన్నారు…

చిక్కు వచ్చి పడింది నాకే..నాకేమో బొలేడు ఆప్షన్స్ ఉన్నాయి..దేని మీద రాసుకు రావాలో అర్ధం కావడం లేదు..

నాకు బాగా ఇష్టమైనవి ఏవా అని ఆలోచిస్తే అంటే మిగతావి ఇష్టం లేవని కాదు  ఇవి కుంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట…వాటిలో రెండు పండుగలు తేలాయి..ఒకటి దీపావళి ఇంకొకటి వినాయక చవితి…

ఇప్పుడు ఈ రెండిటిలో దేని మీద రాసుకెళ్దామా అని నాకు ఒకటే కంఫ్యూషన్…

ఒకటేమో  వెలుగు జిలుగుల దీపావళి..ఇంకొకటేమో బుజ్జి గణపయ్యని ఇంటికి తీసుకు వచ్చి ,మంటపం ఏర్పరచి ప్రతిష్ఠించి,నైవేద్యాలు అవీ పెట్టి ,బాగా చదవాలని పుస్తకాలు(చూసారా  ఇక్కడా చదువు వదలడం లేదు) పూజలో పెట్టి,వాటికి పసుపు బొట్లు పెట్టి పూజ చేసుకోవడం.ఆరంభించిన కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగమని దేవుని మొక్కుకోవడం.

చివరకి నా మనసు బుజ్జి గణపయ్య పండగ వైపే మొగ్గింది…

ఇంకేం ఆ పండగ ఎలా చేసుకుంటామో సవివరం గా వర్ణిస్తూ ఎస్సే రాసి పట్టుకెళ్ళి పోయా…

మా టీచర్ దాన్ని చదివి గుడ్ అని రిమార్క్స్ ఇచ్చారు…ఆ టైంలో అలా రిమార్క్స్ తెచ్చుకోవడం అదొక ఆనందం…తుత్తి..

పండగ దగ్గరకొస్తోంటే రావడమేమిటి రేపే కదా..ఇవన్ని గుర్తొచ్చింది..మా వీధిలో మేము చేసే హడావిడి,ఇంట్లో పూజకు తయారయ్యేది అన్నీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…:)

పది రోజుల ముందే మా వీధిలో ఈ సంబరాలకి అంకురార్పణ జరిగేది…ఇంటి చుట్టు పక్కల అంతా చుట్టాలే..అందరూ చందాలేసుకుని గణనాథుని విగ్రహాని ప్రతిష్ఠించి పదకొండు రోజులపాటు పూజలు,నైవేద్యాలతో అర్చించాక నిమజ్జనానికి తీసుకెళ్ళేవారు…

చందాలు వచ్చి తీసుకెళ్ళడం…పండగ ముందు రోజు రాత్రి పందిరి వేసి రంగు రంగుల కాగితాలతో అలకరించడం…విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పీఠం ఏర్పాటు చేయడం…

మా అన్నయ్య వాళ్ళంతా ఈ పనులలో తలమునకలయ్యి ఉంటే మేము మధ్యలో వెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయా  అని చూసొచ్చే వాళ్ళము…

పండగ రోజు తెలవారిన వెంటనే ముందు వెళ్ళి పందిరి ఎంత బాగా అలకరించారని చూసుకొచ్చిన తరువాతే మిగతా కార్యక్రమాలు…

తలంటు పోసుకుని,కొత్త బట్టలు వేసుకుని నాన్నగారితో విగ్రహం తేవడానికి వెళ్ళేవాళ్ళము..ఈ లోపల అమ్మ,నానమ్మ వాళ్ళు నైవేద్యాలు తయారు చేసే  హడావిడిలో ఉండేవాళ్ళు …ఉండ్రాళ్ళు,కుడుములు చేయడంలో సాయం చేసే వాళ్ళం…అవైతే వీజీ కాబట్టి…మధ్యలో టెంప్ట్ అయ్యి నోట్లో పెట్టుకోబోతే  తప్పు దేవుడికి పెట్టేంతవరకు తినకూడదని నాన్నమ్మ చెప్పేది…

రాహుకాలం వచ్చే లోపు పూజ చేసెయ్యాలి కానివ్వండి కానివ్వండి అంటూ తాతగారు హడావిడి పెట్టే వాళ్ళు…విగ్రహాన్ని ప్రతిష్ఠించి ,గణపయ్య కు అలంకారం చేసి ,ప్లేట్లలో పండ్లు,నైవెద్యాలు అన్ని  పెట్టేసి…పుస్తకాలు ఏం పెట్టాలా అని ఆలోచించే వాళ్ళము నేను,చిన్నీ…

మాథ్స్ బాగా టఫ్ కాబట్టి లెక్కలు బాగా రావాలని ఆ టెక్స్ట్  బుక్ తీసుకొచ్చి పెట్టేదాన్ని…ఇక తాతగారు పూజ ఆరంభించి వ్రత కథ మొత్తం చదివి అక్షింతలు చల్లేవారు…

మా వీధిలో ప్రతిష్టించిన వినాయకుడి దగ్గరకు వెళ్ళి దణ్ణం పెట్టుకు వచ్చేవాళ్ళము…

మా వీధిలో వినాయకుడి దగ్గర పూజ ప్రారంభం అవ్వటానికి ముందు భక్తి పాటలు పెట్టేవారు…స్త్రోత్రాలు అవీ అయ్యాక మన తెలుగు సినిమలోని పాటలు వేసే వాళ్ళు..అవేమిటనగా కూలీ నంబర్ వన్నేనా…అందులో ఓ వినాయకుడి పాటుంది చూసారు అది ప్రతి వినాయక చవితికీ మోగేది…తరువాత దేవుళ్ళు అని ఓ సినిమా లోని వినాయకుడి పాట…నేను చెన్నై వెళ్ళే ముందు జై చిరంజీవలో వచ్చిన వినాయకుడి పాట…ఇవి కంపల్సరీ ప్రతి చవితి కి ప్లే చేసేవాళ్ళు(అప్పుడే గుర్తొస్తాయనుకుంటా) మరి ఈ సారి లిస్ట్ లో కొత్త పాటలేమైనా యాడ్ అయ్యిందేమో కనుక్కోవాలి…

10th వరకు మాథ్స్ అంటే హడలు అందువల్ల ఆ టెక్స్ట్ బుక్కే పెట్టేదాన్ని ..ఇంటర్లో ఎంసెట్ పుస్తకాలు,ఇంజినీరింగ్లో టఫ్ సబ్జెక్ట్లు ఏవో అవి…

ఇక ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఓ సారి పండక్కి వచ్చా..ప్రతి సంవత్సరం పూజలో పుస్తకాలు పెట్టడం అలవాటయ్యింది..ఆ టైంకి చూస్తే నా దగ్గరేమో పెట్టేందుకు బుక్స్ లేవు…ఉన్నవి కొన్ని హాస్టల్లో వదిలి వచ్చా..ఏం పెట్టాలో అర్ధం కావడంలేదు…సరే ఇంజినీరింగ్ బుక్స్ పెడదామని చూస్తే  C,C++,జావా తెక్స్ట్ బుక్స్ఉన్నాయి…ప్రస్తుతం ఫుడ్ పెట్టేవి ఇదే కనక అందులోనూ పనియే ప్రత్యక్ష దైవం కావున ఈ పుస్తకాలనే పూజలో పెట్టా..దాని తో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బుక్కొకటి…

మా ఊరిలో చవితి విశేషం ఏమిటంటే సాయంకాలం వినయకుడు పెట్టిన పందిరి దగ్గర అందరూ చేరి ఉట్టి కొట్టడం, హోలి ఆడ్డం..జన్మాష్టమిని,హోలిని కలిపి మా వాళ్ళు ఫ్యూషన్ చేసారు..వినడానికి వెరైటీ గా ఉంది కదూ..నేను ఎందుకని  అడిగితే సరదా కోసం అని చెప్పేసారు… ఉట్టి కొట్టేంత వరకు అక్కడే ఉండేదాన్ని …రంగుల పోయడం మొదలు పెడితే నేను జంప్…

ఇవన్నీ అయ్యాక ఇంట్లోని వినాయకుడి కి ఉద్యాపన పలికాక మా ఇంటికి దగ్గర ఉండే నాలుగు వీధుల్లో వినాయకుళ్ళను చూసేందుకు వెళ్ళేవాళ్ళం మా పిల్లల గాంగ్..తరువాతర్వాత ప్రతి వీధిలో థీం బేస్డ్ వినాయకుళ్ళను పెట్టడం ఫాషన్ అయ్యిపోయింది…ఓ సారి సునామి వినాయకుడిని పెట్టారు…

పండక్కి మా ఊరు వెళ్తున్నంత వరకు ఈ హడావిడి ఏది మిస్సవ్వలేదు..

బెంగళూరు కి వచ్చాక ఊరెళ్ళడం కుదరడం లేదు…మా అపార్ట్మెంట్స్ లో నన్నా ఇలాంటివి ఏమన్నా పెడతారనుకుంటే అట్టాంటివి ఏమి జరగడం లేదు..ఇక్కడ పక్కన ఎవరు ఉన్నారు ,ముందు ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియనట్లు ఉంటున్నారు…హ్మ్..

ఈ సారేమైనా చేస్తారో చూడాలి…

మా ఆడపడచు వాళ్ళు బెంగళూరు లోనే ఉంటారు …పండక్కి రమ్మని పిలిచాము..తను లేదురా మా వాడికి పరీక్షలు ఉన్నాయి…దగ్గరుండి చదివించాలి…లేకపోతే ర్యాంక్  డవున్ అయ్యిపోతుంది..ఈ సారి వస్తాములే అని చెప్పారు..ఇంతకీ వాడు చదివే క్లాసు ఏదో తెలుసా…UKG…ఏమిటో ఈ చదువులు…ఇక్కడా కథ మళ్ళీ మొదలు…:)

సో హౌ ఈస్ మై ఫేవరిట్ ఫెస్టివల్ విశేషాలు??

ఈ వినాయక చవితి మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ..అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు….

బెంగళూరులో చేసుకున్న గౌరి గణేష హబ్బ గురించిన విశేషాలు తరువాత రాస్తానే…

ఓ భాష నేర్చుకున్న విధానంబెట్టిదనిన…

సాధారణం

ఈ మధ్య పుస్తకాలు చదివి చాలా రోజులయ్యింది…దీని పైన రాయడం కూడా తగ్గింది…అసలు ఇన్ని రోజులు నేను దేని పైన రాసానా అని అనుకుంటూ నా బ్లాగ్ ఓపెన్ చేసా… పుస్తకాలతో పాటు పనిలో పని ఉన్న అన్ని టపాలు (నేను రాసిందే) ఒక సారి చదివేసా…

చదివాక బోధపడింది ఏమిటనగా ఎక్కువగా పుస్తకాలు ,నేను పరీక్షలు ఎలా రాసానా,హోం వర్క్ ఎలా చేసానా  అన్న దాని పై  ఎక్కువగా  రాసాను అని. బేసిగ్గా చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిన విషయం చదువు,చదవడం,చదువూతూనే ఉండడం…

మీకు డౌట్ రావచ్చు వెళ్ళిన ట్రిప్పులు గట్రా దేనికిందకి వస్తుంది..అవి ఎక్సెప్షనల్  కేటగరీ అన్నమాట..

ఎంత సేపూ చదువులూ,చదవడం గోలేనా మనం కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏమైనా ఘనకార్యాలేమైనా చేసామా అని ఆలోచించా..అంటే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళడాలు, పరీక్షల్లో ఏమైనా కాపి గట్రా కొట్టడాలు,ఆన్సర్ పేపర్లు మర్చిపోయి ఇంటికి తీసుకెళ్ళి పోవడం…ఇట్టాంటివి… (అంటే మరీ సీరియస్ వి కాదనుకోండి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మన పెదవుల పై  చిరునవ్వు తెచ్చేవి)

వెంటనే ఏమీ గుర్తు రాలేదు…

ఇలా కాదనుకుని చంద్రముఖి సినిమాలో రజనీ కాంత్ రాజు కారెక్టర్ ని ఆవాహన చేసుకున్నట్లు  నేను కూడా కళ్ళు మూసుకుని నా కారెక్టర్ని ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించా…

అలా చేస్తే ఏమైనా దృశ్యములు అగుపిస్తాయేమో అని..దృశ్యములు అగుపించలేదు కదా శిరోభారం మాత్రం కలిగినది.

హతవిధీ ఏమి చేయవలె అని ఆలోచిస్తూ శిరోభారం తగ్గించుటకు మంచి స్త్రాంగ్ కాఫి పెట్టుకుని దాన్ని ఆస్వాదిస్తుండగా మనోఫలకం పై కాల యంత్రం  అనే పదములు గోచరించింది.

నేను నా స్టూడెంట్ లైఫ్ లో ఏమైనా చేసామా అని కనుక్కోవడానికి ఈ కాల యంత్రం ద్వారా ప్రయాణించి తెలుసుకుంటే పోలే అని అనిపించింది.

కానీ ఇప్పటికిప్పుడు ఈ కాల యంత్రం ఎక్కడ దొరుకుతుందబ్బా అని ఆలోచించగా మన ఆదిత్య 369 మరియు “యాక్షన్  రీప్లే “ సినిమా లో వాడిన టైం మెషీన్లు  గుర్తొచ్చింది. అడిగితే వాడుకోవడానికి ఇస్తామన్నారు.

ఇప్పుడసలు సమస్య ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని .. అసలే  ఆదిత్య 369 లో వెళ్ళడం వల్ల మన వీరో వీరోయిన్లు వేరే వేరే కాలాల్లో చిక్కుకునిపోయి అష్ట కష్టాలు పడి తిరిగి వర్తమానంలోకి వస్తారు.అలాంటి సమస్యలేమైనా ఉంటాయా అని అడిగితే లేదు మేడం బానే పని చెస్తోంది కాని కొంచెం పాతపడింది అని ఆ కాలయంత్రం నిర్వహకులు చెప్పారు…అయినా మీకు నో వర్రీస్ వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ మేమిస్తాముగా  అని  చెప్పారు.…

యాక్షన్ రీప్లే వారిది కనుక్కుంటే బోలెడు చార్జ్ చేస్తున్నారు..పైగా ముంబై నుండి ఇక్కడకి తెప్పించుకోవాలంట..ఆ మోడల్ నాకు నచ్చలేదు….పైగా ఆదిత్య 369 మన వారిది,పైగా మనం మనం లోకలూ..

సరే ఈ సెంటిమెంట్ తో నేను ఆదిత్య 369 లోనే ప్రయాణిద్దామని డిసైడ్ అయ్యా…ఇలా అనుకున్న వెంటనే ఎక్సైటింగ్ గా ఫీలై  వెంటనే వెళితే బాగుంటుంది అని అనిపించింది. కానీ ఆ రోజు బాగోక పోవడం వల్ల ఆ ప్రయత్నం కాస్తా విరమించాల్సి వచ్చింది. ఎందుకొచ్చిన రిసుకులే వెళితే ఎక్కడ ఇరుక్కుపోతామేమో అన్న భయం కూడాను…

మంచి రోజు చూసుకుని దేవుడికి పూలు పెట్టి, కొబ్బరి కాయ కొట్టి,హారతి ఇచ్చాక నేను ప్రయాణించేదానికి కూడా ఈ ఉపచారాలన్నీ చేసి  బండెక్కేసాను.సీట్లో కూర్చుని “దేవాధి దేవా,నేను సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా లేండ్ అయ్యేలా చూడు స్వామి” అని ప్రార్థించుకుని మెషీన్ మీట నొక్కేసా…

సినిమాలో చూపించినట్టే గిర్రున తిరిగి ఒక ఫ్లాష్ మెరిసినట్లు అనిపించింది.అమ్మయ్య సేం టు సేం అలానే జరుగుతోంది కాకపోతే మనసులో ఓ మూలన భయం భయంగానే ఉంది ఎక్కడ వేరే కాలం లోకి వెళ్ళిపోతామేమో అని…

కొన్ని సెకన్ల తరువాత బానే ఉందనిపించింది…ఇంక ఏ సంవత్సరంలోకి వెళ్ళాలో డాటా ఇమ్మని బీప్ బీప్ అని అడుగుతోంది…

సరే ముందుగా మనం ఇంజినీరింగ్ రోజుల నుండి ప్రారంభిద్దాము  అని అనుకుంటూ ఆ యియర్ ఇచ్చా..

కరెక్ట్గా నేను  ఇంజినీరింగ్ ఫినల్ యియర్  చదువుతున్న సంవత్సరంలో కి వెళ్ళిపోయాము..నేనూ నా మెషీనూ…

  • బుద్దిగా పుస్తకాల సంచి తగిలించుకుని బండి  స్టార్ట్ చేస్తున్న నేను(అప్పుడు  మనకో టూ వీలర్ ఉండేది లేండి…)
  • అతి జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కాలేజీలో  కరెక్ట్ పార్కింగ్ ప్లేస్ లో బండి పార్క్ చేస్తున్న నేను
  • పుస్తకాల సంచితో క్లాస్ లోకి వెళ్తున్న నేను
  • బుద్దిగా మేస్టార్లు చెప్పింది నోట్సు లోకి ఎక్కిస్తున్న నేను…ఆ రాసుకున్న నోట్స్ మొత్తం క్లాసులో సర్కులేట్ అవుతోంది
  • పక్క క్లాస్ మేట్స్ క్లాసులు బంక్ కొడుతున్నా..మనం క్లాసులో కూర్చుని నోట్సు రాసుకుంటున్నాము.
  • బుద్దిగా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న నేను…

ఫైనల్ ఇయర్ కదా అలానే ఉంటుందిలే అనుకునేరు…మొదట నాక్కూడా అలానే అనిపించింది…తరువాత వరుసగా తృతీయ,ద్వితీయ,మొదటి సంవత్సరములలో కూడా సేం టు సేం ఇవే దృశ్యాలు రీపీట్ అయ్యాయి..

ఇదేమిటి నా ఇంజినీరింగ్ కాలంలో నేనింత సిన్సియర్ గా ఉన్నానా అని నేను హాశ్చర్య పోయాను…మరీ బొత్తిగా కళా పోసణ కూడా లేకుండా పోయింది అని అనుకుంటూ పొనిలే ఇంటర్ లో అన్న చూద్దాము ఎలా గడిపేమామో అనుకుంటూ ఇంటర్ చదువుతున్న సంవత్సరం లోకి వెళ్ళా…

అబ్బో అక్కడింకా దారుణంగా ఉంది నా సినిమా…

వారంలో ఏడు రోజులు చిత్తక్కొటేస్తున్నారు జనాలు… ఎంసెట్,ఐ.ఐ.టి ల  క్రేజ్ లో నేనూ కొట్టుక్కు పోతున్నాను.

ఇక్కడా ఇంతేనా అని నీరసం ఆవహించింది …పోనీ స్కూలు జీవితం లోకి వెళ్దాము అని నన్ను నేను సముదాయించుకుంటుండగా  ..అక్కడా ఏముంటుంది నా మొహం అవే సీన్లు రిపీట్ అవుతాయి వద్దు లే పోదాము పదా నా ఆత్మ సీత చెప్తోంది…ఇంత దూరం వచ్చాము కదా అది కూడా చూసుకొని పోతే నాకు బాగుంటుంది అని ఆత్మ సీత కి నచ్చచెప్పి తిరిగి మొదలెట్టా…

ఇక్కడా ఇంతే ….పైగా మేడం కూతురనే టాగ్….(మా అమ్మ మా స్కూల్లో హై స్కూల్ సెక్షన్స్ కి వెళ్ళే వారు) .మాక్కూడా కొన్ని క్లాసులు తీసుకున్నారు…కరెక్ట్ గా లంచ్ తరువాత ఫస్ట్ పీరియడ్ ఉండేది…నిద్ర ఆపుకోలేక,క్లాసు వింటున్నట్లు కవర్ చేయలేక తెగ కష్టపడి పోయా….ఇది చూసి కొంచెం తుత్తి కలిగినది..(అల్ప సంతోషి)

ఇహ అప్పటికి అర్ధం అయ్యిపోయింది ఈ కాల ప్రయాణం ఇక వృథా…నాకు ఇంతే రాసుంది అని…వెన్నక్కెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యేంటలో నా ఆత్మ సీత ఓ ఉచిత సలహా ఇచ్చింది ఓ సారి నీ L.K.G,U.K.G,ఫస్ట్  క్లాసుల టైంలోకి వెళ్ళు..ఆ టైం లో ఖచ్చితం గా ఏదో ఒకటి చేసుంటావు అని…

సరే అని ఈ సారి క్లాసు వైస్ గా వెళ్తున్న నేను డైరెక్టుగా  ఫస్ట్ ,సెకండ్ క్లాసు టైంలోకి వెళ్ళిపోయా…

అక్కడ క్లాసులో మా సిస్టర్ (నేను సిస్టర్స్ కాన్వెంట్ లో  చదివాలెండి) బోర్ద్ పైన ఏదో రాస్తున్నారు..

ఇంతలో వేరే సిస్టర్ రావడం తో ఆవిడతో ఏదో భాషలో మాట్లడుతున్నారు…రాసుకుంటున్న నేను ఓ చెవు అటు వైపు పడేసి ఏం మాట్లాడుతున్నారా అని వింటున్నాను…

తరువాత సాయం కాలం అమ్మ దగ్గరికి వెళ్ళి  వాళ్ళిలా అంటున్నారు అని వాళ్ళు చెప్పింది అంతా చెప్పా…ఈ సారి హాస్చర్య పోవడం మా అమ్మ వంతయ్యింది…

ఈ దృశ్యాన్ని చూస్తున్న నేనూ హాశ్చర్య పోయా…

“స్కూల్లో నేర్చుకున్న భాషలు మూడైతే నేర్చుకోని నేను అర్ధం చేసుకున్న నాలుగో భాషా ఏమిటా అని?” 

P.S:ఇప్పటికే టపా లెంత్ ఎక్కువయ్యింది అందుకే మిగతాది నెక్స్ట్ టపాలో కంటిన్యూ చేస్తా… తలైవర్ బొమ్మ కోసం ప్రయత్నిస్తే నేను అనుకుంది దొరకలేదు..ఏదో నచ్చింది పెట్టా(స్వల్ప అడ్జస్ట్ మాడి)

నా పాకశాస్త్ర ప్రావీణ్యం!!!

సాధారణం

మొన్నటి నుండి అనుకుంటున్నా ఏ విషయం పై టపా రాద్దామా అని…

దేని గురించైనా అనుకుని మొదలు పెట్టడం విషయం సరిగ్గా కుదరకో, రాసింది నాకే నచ్చకో ఏమిటో ఏది సరిగ్గా కుదరడం లేదు అని అనుకుంటూ ఉన్నాను…

ఇంతలో మా అత్తయ్యగారు ఊరు వెళ్ళారు…అత్తగారు ఊరెళ్ళిపోతే కిచెన్ బాధ్యత అంతా  నాదే… అంటే మామూలప్పుడు కాదా అని మీకో డౌట్ రావచ్చు…తనున్నప్పుడు చక్కగా తనే వంట చేసి నాకు డబ్బా కట్టిస్తారన్నమాట ఆఫిస్ కి తీసుకెళ్ళను……మరి నువ్వేమి చేస్తావంటారా?మనం కూరగాయల కటింగ్..ఇంకేమైనా పనులు ఉంటే అవన్నమాట….

తను ఊరెళ్ళినప్పుడు కిచెన్ కి మకుటం లేని మహా రాణినన్నమాట.నా కిచెన్ ఒక ప్రయోగశాల … ఆహా ఇది  వినడానికి ఎంత బాగుంది…కానీ తను లేకపోతే ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ లో కూర్చుని క్లాసులు విన్నట్లు  ఉంటుంది  నా పరిస్థితి..పొద్దుననుంచి సాయంత్రం వరకు ఏకబిగిన క్లాసులు చెప్పినట్లు  హడావిడిగా లేసి కూరలు తరుక్కుని,వంట చేసుకుని,డబ్బా కట్టుకుని,ఉరుకుల పరుగులతో వచ్చి ఆఫిస్ బసెక్కడం,ఇంటికొచ్చాక పక్క రోజుకి కూరలు కట్ చేసుకోవడం ,అంతా క్లీన్ చేసుకోవడం..అబ్బబ్బా ఎంత పనో…

తను ఉంటే ఎంచక్కా రెగులర్ ట్రైనింగ్ లో చేరినట్లు ఉంటుంది…ఆడుతూ పాడుతూ పని చేస్తున్నట్లు ఉంటుంది నాకు…:)

ప్రస్తుతానికి నేను ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ లో ఉన్నాను అన్నమాట…నిన్న లేచి నిద్ర మొహం వేసుకుని టైం అయ్యిపోతుందని తిట్టుకుంటూ ఒక సైడ్ కూర చేస్తూ ఇంకో సైడ్ గరిటె పట్టుకుని సాంబార్ తిప్పుతున్నాను…దానితో రింగుల రింగులగా తిరుగుతున్న సాంబార్ తో పాటు నేనూ చిన్న ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళొచ్చా…

చిన్నపటినుంచి వంట అన్నా వంటిల్లు అన్నా ఆమడ దూరం పరిగెత్తే దాన్ని…తినడానికి మాత్రమే వంటిల్లు గడప తొక్కేదాన్ని…అమ్మేమో అప్పుడప్పుడు వంట నేర్చుకోవే పనికివస్తుంది…రా దోశెలు వేయడం నేర్పుతానని పోరగా పోరగా వన్ ఫైన్ డే సరే చెప్పుకో అని చెప్పా…

తనేసిన దోసేలేమో చక్కగా గుండ్రంగా,మెత్తగా వస్తున్నాయి..నేనెసిందేమో ఒకటి ఆఫ్రికా షేప్లో,ఇంకొకటి ఆంటార్టికా షేప్ లో..ఇలా మాప్ లో ఏ షేపులు ఉంటాయో అయా షేపుల్లో వచ్చాయి…అవీ కాక అట్ట ముక్కల్లా తయారయ్యాయి..తల్లీ నీ దోశెలకో  దండం ,నీకో దండం నన్ను వదిలెయ్యి..అని చెప్పి ఇంకో సారి వంటిల్లు గడప తొక్కలేదు…

ఇంకో రెండు సార్లు ప్రయత్నించినా అదే తంతు..దాంతో వంట చాలా కష్టమైన సబ్జెక్ట్ అనీ  మాథ్స్ కన్నా కష్టమైనదని  డిసైడ్ అయ్యా…

ఈ సారి నానమ్మేమో అలా కాదురా వంట నేర్చుకోవడం చాలా ఈజీ…నీకు బాగా పనికివస్తుంది అని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది.ఎలా?? హౌ?  అని అడిగా ..వంట వచ్చిందంటే నీకేమి కావాలంటే నువ్వు అది చేసుకుని తినొచ్చు…ఇది నేను చేసానని గర్వంగా చెప్పొచ్చు అని అన్నది..నాకేం కావాలో మీరున్నారు కదా చేయడానికి…నేను నేర్చుకోను పో..అని చెప్పేసా…నీ కర్మ పోవే అని నాన్నమ్మ కూడా కసిరింది…

సరే వన్ డే ఈ వంటా వంటా  అంటున్నారు…దోశెలు అవీ కాక వీజీ గా ఇంకెవైనా  పనులుంటే దాంతో  మనం వంట  నేరుచుకునే కార్యక్రమాన్ని మొదలు పెడదాము అని అనుకున్నాను…ఓ రెండు రోజులు పరీశీలించగా కటింగ్ అన్నింటి కంటె వీజీ అని అర్ధమయ్యింది..కాకపొతే కత్తితో జాగ్రత్తగా డీల్ చేయాలని అర్ధమయ్యింది…

సరే అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను కూరగాయలు కట్ చేస్తా …నాకివ్వవా అని అడిగా…అలాగేనంటూ కొన్ని కూరగాయలు,కత్తి అన్నీ ఇచ్చింది..అవీ కట్ చేయడానికేమో ఓ అరగంట పట్టింది…ఇలా లేట్ చేస్తే కుదరదు..అవతల నాకు స్కూల్ కి టైమవుతోంది…ఇంకేప్పుడైనా కట్ చేస్తూలే అని అంది…

అమ్మో ఈ కటింగ్ కూడా కష్టమైన పని గా ఉంది….కొన్ని రోజులు ఈ వంట కి, వంటిల్లు కి దూరం గా ఉండడం బెటర్ అని ఘాఠిగా తీర్మానించుకుని మా రాక్షసి కి చెప్పా..(మా చెల్లెలికి)..నాకు తెలియకుండా వంట నేర్చుకోవడానికి వెళ్ళావో వీపు విమానం మోత మోగిస్తా అని…

అలాగే  అలాగే అంటూ బుద్దిగా తలూపి నాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకుందో చక్కగా దోశెలు వెయ్యడం,అన్నం వండడం,కూరలు చేయడం అన్నీ నేర్చేసుకుంది…తనని చూసి అమ్మ,నానమ్మ చూడవే నీకంటే చిన్నది,ఎంత బాగా చేస్తోందో చూడు…అని పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసారు…దానితో నాకు పౌరుషం వచ్చి నేను నేర్చుకుంటాను చూడండి అని కష్టపడి నేర్చేసుకున్నా…ముందుకన్నా ఇప్పుడు నయమన్నమాట…

అలా అలా అరకొర ఙ్ఞానం తో (అదే వంటలో)  ఇంటర్ కి వచ్చా…అక్కడ కొంత మంది ఉత్తమ పుత్రికలు పరిచయం అయ్యారు..అంటే వీళ్ళు చదువుతో పాటు ,ఇంట్లో పనులన్నీ చేసి,వంట కూడా నేర్చుకుంటారన్నమాట…వాళ్ళెప్పుడు ఖాళీ టైం దొరికినా వాళ్ళకొచ్చిన వంటల గురించి చెప్పేవారు…మనకేమో ఏది తెలియకపాయే…అక్కడేమో బిక్క మొహం వేసుకుని కూర్చునే దాన్ని…ఇంకో సారి ఇలాగే సెషన్ మొదలెడితే అక్కడ నుంచి నేను జంప్…

తరువాత ఇంజీనీరింగ్ లో నా లాగే ఉండే  బాచ్ ఒకటి తగిలింది..హమ్మయ్య అని అనుకున్నాను.సెమిస్టర్ల పరీక్షలు,అసైన్మెంట్లు ఈ గోలలో పడి  వంట మరియు వంటిల్లు జోలికి వెళ్ళడం మానేసా..ఇంక ఉద్యోగం వచ్చాకా పొద్దున్న ,రాత్రీ భోజనాలు పెట్టే హాస్టల్లో జాయిన్ అయ్యా…అక్కడా నేర్చుకునే ఛాన్స్ రాలేదు…అమ్మ ఇప్పటికైనా సెలవుల్లో వచ్చి నేర్చుకోవే  అని పోరుపెడుతోంది..మా రాక్షసేమో వంటల్లో నిష్ణాతురాలయ్యిపోయింది…

ఓ రోజు వచ్చి సీరియస్ గా ఇప్పటికైనా నేర్చుకోవే రెపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళితే నిన్ను అనరు నన్నంటారు ఏమి సరిగ్గా నేర్పలేదని…అని  అంది..నేనెమో “Don’t Worry Mom,కాలం మారింది..నేను వంటొచ్చిన అబ్బాయ్యినే చేసుకుంటా “ అని చెప్పా…దీనితో అమ్మ ఈ జన్మలో నిన్నెవడూ బాగు చేయలేడు అని తిట్టుకుంటూ వెళ్ళింది…

పెళ్ళి కుదిరాక ఓ రెండు రోజులు కష్టపడి బేసిక్స్ నేర్చుకున్నా…తరువాత అత్తయ్యగారు చేయడం వల్ల నేను చేయలేకపోయా…కాని తను చేసేటప్పుడు పక్కనే ఉండి అన్నీ నోట్ చేసుకుంటూ వచ్చా..

ఓ రోజు తను ఊర్లో లేరు.. వంట చేసే మహత్తర బాధ్యత నా మీద పడింది .మా వారినేమో బయట నుంచి భోజనం తెచ్చెయ్యమంటే నో వే.ఈరోజు నువ్వు వంట చెయ్యాల్సిందే అని చెప్పి ఆఫిస్ కి వెళ్ళిపోయారు. …నాకేమో థియరిటికల్ గా తెలుసు ,ప్రాక్టికల్ గా చేయలేదు…ఎలారా దేవుడా అనుకుని అమ్మకో ఫొన్ కొట్టి ఇలా ఇలా అని చెప్పా..అందుకే చెప్పింది ముందు నుంచీ నేర్చుకోవే అని నసిగి మళ్ళీ చెప్పింది.

ఆ తరువాత వంట మొదలుపెట్టా…తొమ్మిదింటికి మొదలెట్టింది పన్నెండింటి వరకు కొనసాగింది.మధ్యలో డౌట్లొస్తే ఇంకో రెండు సార్లు అమ్మకి ఫోన్ చేసి అడిగి మొత్తానికి పూర్తి చేసా…

తనొచ్చే టైంకి  పనంతా పూర్తి చేసి టేబుల్ పైన అన్ని సర్ది పెట్టా..తనొచ్చి భోంచేద్దామా అనడిగారు…నేనెమో సరే అని చెప్పి వడ్డించగా తిని  బానే ఉందిరా బాగా చేసావు అని అన్నారు…నాకొక్క నిమిషం అర్ధం కాలా..తిడుతున్నారా పొగడుతున్నారా అని..ఎందుకైనా మంచింది మనమూ ఓ ముద్ద తిని తరువాత చెప్దాము  అననుకుంటూ నోట్లో పెట్టుకోగానే ఆశ్చర్యం,అద్భుతం,ఏమిటీ ఈ విచిత్రం అన్న రీతిలో    ఫీలింగ్స్ కలిగాయి…నా వంట బానే ఉంది…హమ్మయ్య ఎట్టకేలకు వంట అంత కష్టం కాదు అని అనిపించింది..ఇంకో రెండు రోజులు చేసేప్పటికి బానే చేయడం వచ్చేసింది.

కాకపొతే నా ప్రాబ్లెం ఇడ్లీ,దోశెల పిండి రుబ్బుకోవడలో.వాటికి కొలతలు అవీ  ఎంతెయ్యాలో సరిగ్గా తెలియదు…అది కూడా నేర్చేసుకున్నాను…ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆపద్భాంధవి ఉప్మా చేయడం కూడా వచ్చేసిందోచ్…

తరువాత మా చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు నా వంట తిని తెగ మెచ్చుకుంది…బాగా చేస్తున్నవక్కా అని మా అమ్మ దగ్గర కూడా నన్ను తెగ పొగిడేసింది…మా అత్తయ్యగారు కూడా బాగా చేస్తున్నావమ్మా అని అన్నారు…ఇంత మంది పొగిడేసరికి ఓ రోజంతా తొమ్మిదో నంబర్ మేఘంలో ఉన్నాను…:P

అలా మొత్తమ్మీద వంట నాకు రాదు,నేను చేయలేను అనే ఫోబియా నుంచి బయట  పడ్డానన్నమాట…

ఇది సాంబార్ అయ్యే సైకిల్ గాప్ లో గుర్తొచ్చిన ఫ్లాష్ బాక్…

త్వరలో మన కృష్ణ గారి “టల్లోస్” మరియు మంచు గారి “చుంబరస్కా” వంటకం లా నేనూ  పేటెంట్లు తెచ్చుకునే వంటకాలు నేర్చుకుని మీకు పరిచయం చేయాలని  ఆశీర్వదించండి…

టపా రాయడం లో పడి స్టవ్ మీద పెట్టిన పప్పు సంగతి (అదే అండి రేపటికి) మర్చిపోయా…నేను వెళ్ళి చూసొస్తా..అంతవరకు ఉంటానేం…..

P.S: కృష్ణ గారి మరియు మంచు గారి పేర్లను నా బ్లాగ్లో పెట్టాను…వారు ఏమి అనుకోరనే అనుకుంటున్నాను…

మీరు వింటున్నారు…..

సాధారణం

“హలో బెంగళూరు నీవు కేళ్తాయిదిర ఫీవర్ 104,బెంగళూరిన బొంబాట్ మ్యూజిక్ స్టేషన్”

“Stay tuned to radio mirchi 98.3, ఎఫ్.ఎం, సక్కత్ హాట్ మగా..”

“హాయ్ మైన్ హూన్ శంకర్,హాయ్ మైన్ హూన్ ఎహ్ సాన్,మైన్ హూన్ లాయ్….హం రేడియో వన్ కే నయీ పెహ్ చాన్,Maximum choice,Maximum Music”

ఇవీ నేను బెంగళూరు లో వోల్వో బస్సు ప్రయాణాలు మొదలు పెట్టినపట్నుంచి వింటున్న ఛానెల్స్…ఇంకా ఇట్టాంటివి  బోలేడు…

కాస్త ఆగమ్మాయి…నువ్వు బెంగళూరులో ఉన్నావు కాబట్టి అవి వింటున్నావు..మాకేంటి ఇవి చెప్తే అన్న క్వశ్చెన్ మార్క్ మొహం పెట్టకండే..అక్కడికే వస్తున్నా… బస్లో వెళ్ళేప్పుడు మా వాహన చోదకుడు రోజూ మా కోసం ఆఫిస్ కి వెళ్ళేప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మంచి హుషారుగా,గల గలా మాట్లాడే ఆర్.జెలు  ఉండే ప్రోగ్రాములు పెట్టేవాడు.అతను పెట్టేది మనకి నచ్చకపోతే మనం వెళ్ళి మనకిష్టమైన స్టేషన్ పెట్టమని అడగొచ్చన్నమాట.అట్టా ఓ రోజు సాయంత్రం పాపం ఆయనకే  ఛానెల్స్ నచ్చక ఉన్న అన్ని  ఛానెల్స్ ని ట్యూన్ చేస్తూ చివరగా ఓ ఛానెల్ దగ్గర ఆగాడు…

ఎవరో ఆంటీ  మాట్లడుతున్నారు…

“ఆప్ సున్ రహే హైన్ వివిధ్ భారతి దేశ్ కీ సురిలీ దడ్కన్,అబ్ ఆప్ సునేంగె మన్ చాహె గీత్” ఇది వినగానే ఎక్కడో విన్నట్లుందే ఎక్కడా  అని ఆలోచిస్తుండగా ఓ ఫ్లాష్ బాక్ రీలు కళ్ళ ముందు కదలాడింది.

ముఖ్య గమనిక: ఫ్లాష్ బాక్ అంటే మరీ ఫాక్షన్  గట్రా ఎమీ లేదు..ఓ పేద్ద ఇంట్రడక్టరి సీన్లు ఊహించుకోకండే…

చిన్నప్పుడు అంటే ఓ నాలుగైదేళ్ళు ఉన్నఫ్ఫుడు  మా ఇంట్లో ఓ పేద్ద రేడియో పెట్టె ఉండేది…..అది పనిచెయ్యకపోయినా దాన్ని ఓ షో పీసులా భద్రంగా బీరువాలో దాచి ఉంచారు..అప్పుడే నేను మొదటి సారి రేడియోని చూడ్డం…అమ్మ అన్నం తినిపించేప్పుడు  మ్యూజియంలో ఒక వస్తువుని చూపించేటట్లు దాని చూపిస్తూ తినిపించేది. 🙂

 ఆ తరువాత నాన్నగారు ఓ మోస్తరు సైజ్లో ఉండే ట్రాన్సిస్టర్ ని తెచ్చారు.తను ఏవో కార్యక్రమాలు వినేవారు.ఓ రోజు పొద్దునే మెలకువ వచ్చి,నిద్ర నుండి లేవని ఓ లాంటి సుషుప్తావస్థలో ఉన్నప్పుడు మాటలేవో వినిపిస్తున్నాయి..పొద్దునే ఏంటబ్బా  ఈ గోల అనుకుంటూ లేస్తే రేడియోలో  ఏదొ ప్రోగ్రాం వస్తోంది..ఓ రెండు రోజులు ఇదే తంతు…ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు అనుకుంటూ ఇహ ఇట్లా కాదు గానీ మనమే త్వరగా లేవడం బెటర్ అనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాను.

ఆ పక్క రోజు అనుకున్నట్లుగానే పొద్దునే లేచి చూస్తే షరా మాములుగా రేడియో పెట్టుకుని వింటున్నారు.ఇంతకీ ఏంటబ్బా ఆ ప్రోగ్రాం అని వినగా…

ఇప్పుడు మీరు వింటున్నారు సూక్తి ముక్తావళి” అని చెప్పి మంచి తెలుగు సూక్తులు చెప్తున్నారు.

అప్పుడనిపించింది…హన్నా హెంత పని జరిగిపోయింది..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వినకుండా ఇన్ని రోజులు మిస్సయ్యామే అని..కొన్ని సూక్తులు రాసుకుని స్కూల్లో అసెంబ్లీ లో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి.

తరువాత రేడియో లో యాంకరమ్మ వేరే కార్యక్రమం గురించి చెప్తోంది..

  “ఇప్పుడు కాసేపు ప్రకటనలు,తరువాత వార్తలు ప్రసారమవుతాయి”

 ప్రకటనలు అయ్యే లోపల నే వెళ్ళి అమ్మిచ్చిన ఓ లోటాడు కాఫిని తెచ్చుకుని పేపర్ తీసుకుని ఓ చెవ్వు రేడియో వైపు పడేసి  చదువుకుంటున్నాను.

ఇంతలో వార్తలు ప్రారంభమయ్యింది.

“ఇతి ఆకాషవాణి చూష్యంతాం వార్తా ప్రవాకచః బలదేవానంద సాగరః….”

ఆ తర్వాతేమి చెప్పాడని అడక్కండే…

విన్న కొద్దీ సేపు ఏం భాషబ్బా అని ఆలోచించా..కొంచెం తెలుగులా ఉంది..హిందీ లా ఉంది…హేంటిది వెళ్ళి నాన్నగారిని అడగ్గా…అది సంస్కృతమని చెప్పారు…పైగా అది దేవ భాష అంత.ఈ దేవ భాషని మళ్ళీ చదివే అవకాశం ఇంటర్లో వచ్చింది..అది వేరే విషయం అనుకోండి.

 ఈ  వార్తలు అయ్యాక….

“తిరుపతి ఆకాశవాణి కేంద్రం,ప్రాంతీయ వార్థలు ,చదువుతున్నది “ అంటూ వార్తలు వచ్చేవి.

ఇవన్నీ కాదు కానీ అన్నింటి కంటే హైలైట్ ఆంగ్ల వార్తలే..

“All India Radio presents morning news”  అని ఓ మ్యూజిక్ బిట్ స్టార్ట్ అయ్యేది…ఏది విన్నా వినకపోయినా ఇది మాత్రం బాగా వినమని చెప్పేవారు నాన్నగారు…ఆంగ్లోచ్చారణ బాగా వస్తుందని.

ఈ కార్యక్రమాల టైమింగ్స్ తో మేము కూడా బాగా ట్యూన్ అయ్యిపోయి మా పనులు చక చకా ముగించేసుకునే వాళ్ళము…

వార్తలన్నీ అయ్యాక చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమయ్యేది.ఇదీ వినేసి స్కూలుకి వెళ్ళిపోయే వాళ్ళము.

రాత్రి పూట అమ్మ సిలోన్ కేంద్రం నుంచి ప్రసారాలు వినేది..దానిలో ఒక్కోసారి హిందీ పాటలు కూడా వేసే వాళ్ళు.

ఇవీ నేను రెగులర్ గా వినే కార్యక్రమాలు.నాకు తెలియకుండా ఇంకా మంచి కార్యక్రమాలు వినడం  మేము మిస్సయ్యి  ఉండొచ్చు. 😦

ఇంతలో  టి.వి క్రేజ్ రావడంతో అందరూ టి.వి సెట్లపై పడ్డారు మాతో సహా. పొద్దున పొద్దునే టి.వి. పెట్టుకుని చూస్తే అమ్మ  తిట్ల వర్షం కురిపించేది.అదేంటో రేడియో పెట్టుకుంటే ఎవరూ ఏమి అనేవాళ్ళు కాదు…కలికాలం 😛

ఆ తర్వాతర్వాత టి.వి లో కార్యక్రమాల ప్రసారాలు పెరగడంతో నిదానంగా రేడియో వినడం తగ్గింది.కానీ నాన్న గారు మాత్రం తన పొద్దున పూట వినే కార్యక్రమాలు వినడం మాత్రం మానలేదు.అప్పుడు మాత్రమే ఇంట్లో  రేడియో మోగేది. మిగతాప్పుడు మాత్రం పాపం మూగగా ఉండేది.

ఓ రోజు మా బంధువులు కొంత మంది వచ్చి మీ దగ్గర రేడియో ఉంది కదా…కొంచెం తీసుకురండి..అర్జెంట్ అని చెప్పారు..ఇంతకీ విషయమేమిటంటే ఆ రోజు క్రికెట్ మేచ్ ఏదో ఉందంట…కరెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ టి.వి లో చూడ్డం కుదరక కనీసం రేడియోలోనైనా కామెంటరి విందామని వచ్చారట…అప్పుడుగ్గానీ మాకు రేడియో ఉన్న సంగతి గుర్తు రాలేదు…ఓ రోజు కరెంట్ పోయింది…చాలా బోర్ గా ఉంది…ఇంతలో అమ్మ రేడియో ని వెతికి,దుమ్ము పట్టిన దాన్ని శుభ్రం చేసి ప్రోగ్రాం పెట్టింది..అది వింటూ నేనూ,చిన్ని నిద్రపోయాము…ఇలా కాలక్షేపం ఏది లేదు అని అనుకోనే టైంలో రేడియో నేస్తం గుర్తొచ్చేది.

ఇహ శాటిలైట్ ఛానెల్స్ ప్రవేశంతో అది కాస్తా మరుగున పడింది…అప్పటికీ నాన్నగారు మాత్రం తన దినచర్యని వదల్లేదు… అదీ ఇంగ్లీష్ న్యూస్ కోసం..

అప్పటికి ఇంకా ఆకాశవాణి ప్రసారాలు మాత్రమే వచ్చేవి…ఓ రోజు అందరమూ ఇంట్ళోనే ఉన్నాము.పొద్దునే కరెంట్ పోయింది..అప్పటికి రోజు వారి పేపర్ చదవడం అయ్యిపోయింది..ఉన్న పనులు చేసేసుకున్నాము…ఇంకేమి చెయ్యాలో తోచలేదు..ఏం చేద్దామా  అని ఆలొచిస్తూ అలా  చూస్తే  రేడియో కనిపించింది…హమ్మయ్య ఇదన్నా ఉంది ఏమన్న ప్రోగ్రాములు వస్తాయేమో అని ట్యూన్ చేస్తూ ఉంటే సడెన్ గా అరవ పాటలు రావడం మొదలయ్యింది..తరువాత ఇంకో అమ్మాయి ఎవరో గల గల అని మాట్లాడుతోంది.విన్న ఆ కొద్దీ సేపు చాలా  బావుంది అని అనిపించింది..ఎందుకంటే అప్పటి వరకు విన్న ప్రోగ్రాంస్  గంభీరం గా ఉన్నట్లు అనిపించింది.శ్రోతలు కోరిన పాటలు అని అనుకుంటా అని ఒక ప్రోగ్రాం ఉండేది..అందులో యాంకరమ్మ కూడా అలాగే మాట్లాడేది చాలా గంభీరంగా..అలాంటిది ఈ అరవ ప్రోగ్రాం వినేప్పటికి జరా హట్కే అన్నట్లు అనిపించింది..దానికి తోడు..సెమ హాట్ మచ్చి అని ఓ టాగ్ లైన్…

ఆ తరువాత తెలిసింది ప్రభుత్వం వారు రేడియో కార్యక్రమ ప్రసార హక్కులను ప్రైవేట్ వారికి ఇచారని.వాళ్ళు కార్యక్రమ ప్రసారాలు మొదలు పెట్టారని.అప్పటికి టి.వి రంగంలో పాపులరైన  సన్ టి.వి వారు కూడా యఫ్.ఎం  రేడియో ఛానెల్ ప్రారంభించారు.అది కూడా బానే ఉండేది కాని మిర్చి అంత ఘాటుగా ఉండేది కాదు.

ఇక చెన్నై వెళ్ళాక యఫ్.ఎం రేడియో బాగా పాపులరయ్యిందని తెలిసింది. టి.వి యాంకర్స్ తో సమానంగా ఈ ఆర్.జెస్ కి పేరు వచ్చింది.వీరి పైన పత్రికలలో ప్రత్యేకంగా కవర్ స్టోరిలు కూడా వచ్చేవి.చాలా ఛానెల్స్ పోటాపోటిగా మొదలయ్యాయి.నేను అనుకునేదాన్ని మన దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని.మన దగ్గర కూడా స్టార్ట్ చేసారు అని తెలిసింది. ఓ సారి ఇంటికి వచ్చినప్పుడు యధాలాపం గా వింటోంటే ఇక్కడ స్టార్ట్ అయ్యిన ఛానెల్ లో ఏదో ప్రోగ్రాం వస్తోంది..కానీ ఎందుకో అంతగా నచ్చలేదు..ఎందుకో కృత్రిమంగా అనిపించింది…

ఆ తరువాత బెంగళూరు వచ్చి పడ్డాక అబ్బో ఇక్కడ బోలెడు  ఛానెల్స్ … వీరి పుణ్యమాని నాక్కూడా కన్నడం బాగా అర్ధమయ్యిపోతోంది …ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ వివిధ్ భారతి వినేప్పటికి ఈ ఫ్లాష్ బాక్ అంతా గుర్తొచ్చింది.

ఒక్కోసారి మా ఇంట్లో పొద్దునే  యం.యస్ గారి గాత్రం తో తెల్లవారేది..సుప్రభాతం వింటోంటే ఎంతో హాయిగా ఉండేది.అసలు సుప్రభాతం విని ఎన్నేళ్ళయిందో ..

ఆ ఆ ఫ్లాష్ బాక్ అయ్యిపోయింది…ఇంక ప్రెసెంట్  లోకి వచ్చేద్దాము….

అందరికీ టాటా బై బై!!

Stay tuned to Snigdha blog…vl be right back in some time…

అంత వరకు   Keep rocking!!!!

సమరభారతి

సాధారణం

నమస్కారం…హలో హాయ్ …వణక్కం….ఆదాబ్…సత్ శ్రీ  అకాల్..జై శ్రీకృష్ణ(ఈ మధ్య  కొన్ని హింది సీరియల్స్ లో గుజరాతి కమ్యూనిటి  వారి స్టైల్ ని కాపి కొట్టా :D) … హమ్మయ్య అందరికీ హాయ్ చెప్పేసా….  బ్లాగ్స్ చూడకుండా నెల రోజులు గడిపేసా ,వెరీ బాడ్. :(… మితృల బ్లాగ్స్ చూసి కూడా చాలా  రోజులయ్యిపోయింది.  అందరికీ నేను ఉన్నాను అన్న సంగతి చెప్దామని ఈ టపా మొదలు పెట్టా….

చాలా చాలా ఆలస్యంగా శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు.ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్ని జరగాలని ఆశిస్తున్నాను.అలాగే బిలేటెడ్ పుత్తాండు/విషు  వాళ్తుక్కళ్..

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను అందరూ బాగా ఎంజాయ్ చేసుంటారు. 28 ఏళ్ళ తరువాత కప్ సాధించిన మన ఇండియన్ క్రికెట్ జట్టుకు హార్థిక  శుభాభినందనలు. చక్ దే ఇండియా…కీప్ రాకింగ్!!ప్రపంచ కప్ సంబారాలు ముగిసి ఐ.పి.ఎల్ ఫీవర్ పట్టుకుంది కదా ఇప్పుడు. ఎంజాయ్ మాడి!!

అందరినీ పలకరించేసా,ఉగాది శుభాకాంక్షలు చెప్పేసా…కప్ సాధించిన మన టీమిండియా కి కంగ్రాట్స్ చెప్పేసా…ఇక నా టపా అసలు విషయం కి వచ్చేస్తా.

టైటిల్ ‘సమరభారతి’  అని పెట్టి అందరికీ హాయ్ లూ,హలోలు చెప్తోందేంటి అనుకుంటున్నారా? చాలా రోజులయ్యింది కదా …అందుకే…..

చాలా రోజులుగా అనుకుంటున్నాను దీని గురించి రాద్దామని..ఏంచేతనో టైం కలిసి రాక,లేక నేను రాసింది నాకు నచ్చకో  కుదరలేదు.చివరాఖరికి ఈ రోజు ధైర్యం చేసి మొదలు పెట్టేసా…చూద్దాము ఎలా సాగుతుందో…

మొన్నామధ్య ఇల్లు సర్దుతోంటే కొన్ని చిత్రాలు…చిత్ర సంకలనాలు…దాని గురించి కొన్ని వివరాలు దొరికాయి.ఎవరివా అని చూస్తే ఆ చిత్రాలు మా వారి తాతగారు వేసినవట.తను గొప్ప చిత్రకారులు అని తెలుసు. కాని వారి గురించి వినడమే తప్ప వారి  చిత్రాలను చూసే అవకాశం రాలేదు.ఇప్పుడు వారి చిత్రాలను,సంకలనాన్ని చూసిన తరువాత నాకు వచ్చిన మొదటి మాట…”వా…….వ్”.మనకు అసలే కళా పిపాస ఎక్కువ కావడంతో వెంటనే వివరాలను సేకరించే పనిలో పడ్డా… ఆయన గురించిన వివరాలు  ఇంత ఆలస్యం గా నాకు తెలిసినందుకు కొంచెం బాధ కలిగింది….కాని  ఇప్పటికైనా నాకు ఆ చిత్రాలను చూసే మహద్భాగ్యం కలిగింది… తాతగారి చిత్రాలను,వారి గురించిన వివరాలను కొన్ని నా బ్లాగ్లో రాసుకొందామని అనుకున్నాను…కాని అది వెంటనే కార్య రూపం దాల్చలేదు…:(

ప్రస్తుతం తాతగారి గురించిన సమగ్ర వివరాలు, వారి కళా కౌశలానికి అద్దం పట్టిన చిత్ర వివరాలను గురించిన విశేషాలను కనుక్కునే పనిలో ఉన్నాను……

వారి చిత్రాల్లో నాకు అమితంగా నచ్చిన ఈ సమరభారతి చిత్రాన్ని ఈ టపాలో పెడుతున్నాను..

“సత్యముని ఆయుధముగా చేబూని మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న భరతమాత కావిస్తున్న దుష్ట సంహారం”

ఆయన అప్పుడే ఈ చిత్రం గీసారంటే గ్రేట్ కదా…

ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితికి భరతమాత మళ్ళీ ఈ అవతారం ఎత్తి దుష్ట సంహారం కావించాలి......  

ఈ చిత్రం గురించిన వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను…
వివరాలు తెలిసిన వెంటనే తరువాతి టపాలో పెడదామని నా ఆలోచన...

మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తూ…తాతగారి గురించిన  మరిన్ని వివరములు తదుపరి టపాలో....

పండగ శుభాకాంక్షలు

సాధారణం

దీపావళి శుభాకాంక్షలు చెప్దామని టపా మొదలు పెట్టాను. కానీ ఏ  భాషలో చెప్పాలో తెలియక మకతిక పడుతున్నా.మకతిక ఎందుకు  మొదలయ్యిందంటే రెండు రోజుల ముందు తమిళ ఛానెలైన కలైఙ్ఞర్ లో దీపావళి ప్రత్యేక కార్యక్రమాల మాలిక ని చూపిస్తున్నారు.ఇదేంటి నేను  దీపావళి అనేసాను..వారి ప్రకారం అది దీప వొళి అయ్యితేనూ …దీప వొళి రోజున ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తారన్నమాట.వీరి ఛానెల్ వారికి మాత్రం దీప వొళి.మిగతా తమిళ ఛానెల్స్ వారు ఇంకా దీపావళినే  కొనసాగిస్తున్నారు వారి ప్రసారాల్లో.మకతిక వారి ప్రసారాల గురించి కాదు దీపావళి గురించి.

దీపావళి అనేది సంస్కృత పదమనీ కలైఙ్ఞర్  వారు దాన్ని అచ్చ తమిళం లోకి అనువదించారు.  ఏప్రిల్ 14న  జరుపుకునే తమిళ సంవత్సారాది ఆర్య సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్నదని దాన్ని కూడా వారు  పొంగల్ రోజున’ తై తిరుణాల్ గా’ చేసుకుంటున్నారు.

తెలుగు వారికి కూడా ఇట్లాంటి పట్టింపులేమైనా ఉన్నాయా…
దీపావళి కూడా సంస్కృత పదమేనా?? మనకి అచ్చ తెలుగు పదం లేదా??
ఈ మకతిక వదిలేసి అందరికీ  దీపావళి శుభాకాంక్షలు..