“ప్రయాణం లో అంతరాయానికి చింతిస్తున్నాము.బెంగళూరు నుండి శ్రావణ బెళగొళ బయల్దేరిన కె.టి.డి.సి. వారి బస్సు మరి కొద్ది క్షణములలో బయల్దేరబోవుచున్నది.”
అబ్బెబ్బే ఇది మా బస్సులో వచ్చిన గైడ్ గారు కానీ, మా బస్స్ డ్రైవర్ కానీ ఇచ్చిన అనౌన్స్మెంట్ కాదు..నేనే ఇచ్చా…శ్రావణ బెళగొళ పోస్ట్ కి ఈ పోస్ట్ కి కొంచెం(?) కాదు గానీ చాలా గాప్ వచ్చింది కదా….అంచేతన్నమాట…
కావున భక్త జనులారా సారీ బ్లాగు జనులారా ఆ విధం గా గోమ్మటేస్వరుడి దర్శనం చేసుకున్నాక తిరిగి కె.టి.డి.సి వారి బస్సులో మా ప్రయాణాన్ని కొనసాగించాము. మళ్ళీ ఎక్కడికి అని కొంత మంది భక్త జనులు అడగడం నా చెవిన పడుతోంది.మీ సందేహములన్నీ త్వరలోనే తీరగలవు.అంతవరకు నేను చెప్పేది శ్రద్దగా ఆలకించండి…మళ్ళీ సారీ నేను రాసినది శ్రద్దగా చదవండి. 😛
అలా బయల్దేరిన తరువాత మిస్టర్ వరుణ్ చిన్నగా తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు.రోడ్డుకి రెండు వైపులా పచ్చని పొలాలు..సన్నగా వర్షం తుంపర,మధ్యలో మా బస్…భలే అనిపించింది…ఆ అనిపించడం ఆ అనిపించడం నేను చిన్నగా ఒక లాంటి సుషుప్తావస్ఠలోకి వెళ్ళిపోయా…అంటే సమ్మగా నిద్రపోయానన్నమాట…బేలూర్ వచ్చే టైం కి మెలకువ వచ్చింది…
బేలూరు వచ్చేసరికి వర్షమూ ఆగింది..హమ్మయ్య చక్కగా ప్లేసంతా చూడచ్చనుకుని సంబరపడ్డా..మా బస్ డ్రైవర్కి పాపం ఆకలేసిందనుకుంటా తిన్నగా తీసుకెళ్ళి మన కె.టి.డి.సి వారి విడిది మరియు భోజన సత్రానికి తీసుకెళ్ళాడు.శ్రావణ బెళగొళ లో బయలుదేరేప్పుడు మా గైడ్ గారేమో త్వరగా వెళ్ళి చూసి రండి…తరువాత మనం బేలూర్ వెళ్ళాలి అక్కడ గుడి మధ్యాహ్నం 1 వరకే తెరచి ఉంటారు అని చెప్పాడు…అది గుర్తొచ్చి కొంచెం టెన్షన్ పడ్డా…
మేము బేలూరు చేరిందే 1 కి..మా వాడేమో ఆ టైం కి కరెక్టు గా భోజనానికి తీసుకెళ్ళాడు..దర్శనం అవుతుందో లేదో అని టెన్షన్…కానీ ఇంతలో ఆత్మా రాముడు గోల చేయడం మొదలు పెట్టాడు.పొద్దునే ఎప్పుడో తిన్నది అరిగి పోవడం చేత కొంచెం ఎంగిలి పడదామని సత్రం లోకి వెళ్ళాము…రేట్స్ అన్నీ రీసనబుల్ గా ఉంది…టేస్ట్ కూడా వా.కె…ఈ సారి మీరెవరైనా ఈ సత్రానికి వెళితే (అంటే కె.టి.డి.సి వారి ప్యాకెజీ తీసుకుని వెళితే వాళ్ళెలాగూ మిమ్మల్ని అక్కడకే తీసుకెళ్తారు) నా పేరు చెప్పి పండగ చేస్కోండి…ఇంతకీ సత్రం పేరు చెప్పడం మరచిపొయా..”మయురి వేలాపురి”… అక్కడ త్వర త్వరగా తినేసి బయటకి వస్తే మళ్ళీ వరుణ్ పలకరించాడు..
అందరం అలాగే వర్షం లో తడుస్తూ బసెక్కెసాము… తిన్నగా చెన్నకేశవ స్వామి గుడి కి వెళ్ళిపోయాము..బేలూరు లో ప్రధాన ఆకర్షణ ఈ గుడే.. వర్షం ఆగుతుందేమో అని చూసాం…హ్మ్మ్..ఇంకా ఎక్కువయ్యింది..ఈ వర్షాలు అవీ మా స్పిరిట్ ని ఆపలేవనుకుంటుండగా అందరూ గొడుగులు,టోపీలు తీసుకుని దిగుతున్నారు..బెంగళూరులో బయల్దేరినప్పుడే సన్నగా జల్లు పడుతోంది ఎందుకన్నా మంచిదని నేనూ గొడుగు,టోపిలూ తెచ్చుకున్నాను..అవి ఇక్కడ పనికొచ్చాయన్నమాట..
గైడ్ చెప్పిన ప్రకారం గుడి ఏమి మూయ లేదు…మా కోసమే అనుకుంటా… 🙂
అక్కడ వేరే గైడ్ వచ్చారు.ఇంక అక్కడ నుంచి ఆయన ఎటెళితే అటు వెళ్ళి గుడి మొత్తం చూసి ఆయన చెప్పే విశేషాలు ఫాలో అవుతూ వచ్చా…గుళ్ళో ఫొటోలు తీసే బాధ్యతని మా వారికి అప్పచెప్పా…
గుడి ఎంత బాగుందనుకున్నారు…చూట్టానికి రెండు కళ్ళూ చాలలేదు…వాళ్ళిచిన టైమూ సరిపోలేదు…కానీ ఏం చేస్తాము ఇచ్చిన టైం లోనే దర్శనం చేసుకుని ,చూసినవీ,గైడ్ చెప్పినవన్నీ విని గుర్తు పెట్టుకుని టపా రాస్తున్నాన్నమాట.
గుడి గోపురం మరియు ధ్వజస్థంభం
ఇప్పుడు కొంచెం మనం చరిత్రలోకి వెళదాము.ఈ గుడి ని కట్టించింది హొయసల రాజైన విష్ణువర్ధనుడు. జైనస్థుడైన విష్ణు వర్ధనుడు రామానుజాచార్యుల వారి ప్రభావంతో వైష్ణవుడి గా మారి పంచ నారాయణ ఆలయాలను కట్టించాడు..చోళుల పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.విష్ణువర్ధనుడిచే ప్రారంభించిన గుడి నిర్మాణం మూడు తరాల పాటు కొనసాగింది.గుడి పూర్తవడానికి సుమారు 103 సంవత్సారల పైనే పట్టిందట.గుడి కి ప్రధాన శిల్పాచార్యుడు జక్కనాచార్యులు.విష్ణు వర్ధనుడి సతీమణి శాంతలా దేవి గొప్ప నాట్యకారిణి. ఆవిడకి నాట్య రాణి అని ఇంకా ఏవో బిరుదులు ఉన్నాయట.గుడి బయట ఉన్న ప్రాకారాల పై విష్ణు వర్ధనుడు,ఆయన సతీమణి శాంతలా దేవి,రామానుజాచార్యుల వారి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
ఇవి చూసుకుని లోపలకి వెళితే గర్భ గుడి వస్తుంది.ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారు చెన్న కేశవ స్వామి. స్వామి వారి మోహిని అవతారానికి గుర్తు గా ముక్కు పుడకని అలకరించి ఉంచారు.గర్భ గుడి బయట ఉన్న ద్వారం పై అత్యతద్భుతంగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి…
గర్భ గుడి కి బయట ఒక స్థంభం పై మోహినీ విగ్రహం ఉంది.స్వామి వారే అవతారం ధరించారనడానికి గుర్తు గా యఙ్ఞోపవీతం ఉంది.ఈ గుడి పై జరిగిన దండయాత్రలలో విగ్రహం కొంత భాగం దెబ్బ తింది.
మోహినీ విగ్రహం
దానికి దగ్గరే మంటపం లా ఉంది . అది నాట్య మండపమట.నవరంగ అని అంటారనుకుంటా.. ఆ నృత్య మంటపంలో శాంతలా దేవి శిల్పం ఉంది.అదీ మంటపం పై కప్పు పైన.
గుడి లోపల బాగా చీకటి గా ఉండడం వల్ల లైటింగ్ అరేంజ్ మెంట్స్ అవీ చేసి ఉన్నారు.గైడ్ చెప్పదలచుకున్న దాని పైన లైట్ ఫోకస్ చేసి అక్కడి విశేషాలు అవీ చెప్పాడు.
అద్భుతం,అత్యతద్భుతం,wow,wonderful,amazing ఇలాంటి పదాలు,ఇంకేవైనా ఉపమానాలు ఉంటే అవన్నీ ఈ గుడి శిల్ప సౌందర్యం ముందు దిగదుడుపే.ఎక్కడా చోటు వదలకుండా అంత బాగా చెక్కారు.తక్కువ స్థలంలో ఎక్కువ శిల్పాలు చెక్కేలా గుడి ని స్టార్ ఆకారంలో నిర్మించారు.గుళ్ళోపల నరసిమ్హ స్థంభం అని ఒకటి ఉంది. ఆ స్థంభం పైన విష్ణువు ఇరవై నాలుగు రూపాలను చెక్కారు…ఓ అరచేయంత స్థలాన్ని వదిలేశారు…అది వేరే శిల్పులకు ఇచ్చిన సవాలంట ఇంకో రూపమేదైనా చెక్కమని…ఇంతవరకు ఎవరూ చెక్కినట్లు లేరు…
నరసింహ స్థంభం
మీకేదైనా నగల డిజైన్లు కావాలా,హేర్ స్టైల్స్ కావాలా,లేటెస్ట్ ఫాషన్లు కావాలా ..కావాలంటే ఇక్కడి స్థంభాలపై చెక్కిన డిజైన్లు చూడండి…మీకు బోలెడు మోడల్స్ దొరుకుతుంది..నేను చెప్పింది కాదండి..మా గైడ్ చెప్పింది…అలానే ఉంది ఆ ఆకృతులు.కావాలంటే మీరే చూడండి…
బయట ఉన్న గోడల పై వివిధ రూపాల్లో ఉన్న విష్ణువుని చెక్కారు...హొయసలుల రాజ ముద్ర..దీని వెనకల చిన్న పిట్ట కథ ఉందండోయ్..అదే వీరికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది..
హొయసల రాజ్యాన్ని స్థాపించింది సాలుడు.ఆశ్రమంలో ఉన్నప్పుడు సిం హమో పులో ఏదో సరిగ్గా తెలియదు.. ఫోటో చూసి మీరే తేల్చుకోండి దాడి చేస్తే అక్కడున్న గురువు గారు "హొయ్ సాలా" అని అరిచారంట.. అంటే 'వెళ్ళు సాలా' అని అర్ధమంట...సో అలా ధైర్యసాహసాలు చూపించిన సాలుడి పేరు పైనే ఈ డైనాస్టి ఏర్పడిందన్నమాట..అలా సింహం తో పోరాడుతున్న ఈ భంగిమనే వారు రాజ ముద్ర గా స్వీకరించారంట.. ఇన్ని చెప్పి "దర్పణ సుందరి" శిల్పం చూపించక పోతే టపా కి అన్యాయం చేసిన దాన్నవుతాను... ఆ శిల్ప ఇల్లి నోడి..ఇది తీసినప్పుడు వర్షం పడుతూ ఉంది...సో స్వల్ప అడ్జస్ట్ మాడి...
మరి కొన్ని అద్భుతాలు..
![]()
![]()
ఇది చూసాక హళేబీడు వెళ్ళాము..అక్కడ హొయసలేస్వరుడు మరియు శాంతలేస్వరుడి ఆలయాలు ఉన్నాయి. ఇంచుమించు బేలురు గుడి లాగే ఉంది.కాకపొతే కొన్ని శిల్పాలు శిధిలం అయ్యాయి.అక్కడ మాకు గైడ్ ఏర్పాటు చేయలేదు.ప్రైవేట్ గైడ్లు బోలెడు మంది ఉన్నారు.బేలూరు నుంచి హళేబేడు 16 కి.మీలే. హళేబేడులో తీసిన కొన్ని అద్భుతాలు...
![]()
శ్రావణ బెళగొళ,బేలూరు మరియు హళేబేడు లోని కట్టడాలను UNESCO వారు "World Heritage Sites" గా గుర్తించాయి.అలా ఇవన్నీ చూసుకుని ఆ ఙ్ఞాపకాలను భద్రపరచుకుని బెంగళూరు కి బయల్దేరాము.తిరిగి వచ్చేటప్పుడు అనిపించింది ఒక్క రోజు సరిపోదు ఇవి చూడాలంటే అని.ఓ రెండు రోజులు ఉండి ఉంటే తనివి తీరా అక్కడున్న శిల్పాలను మా కెమెరా లో ముద్రించుకుని వచ్చి ఉండచ్చు అని. కానీ ఇలా ఒక రోజు ట్రిప్ అన్నా కుదిరింది కదా అని అనుకుంటూ బెంగళూరు కి బయల్దేరాము. ఇవైతే చూసి తీరాల్సిన స్థలాలు...కుదిరితే వెళ్ళి చూసి రండి.... నా ట్రిప్ కబుర్లు ఇక్కడితో సమాప్తం.