నేనూ నా ప్రాజెక్ట్ గోల మొత్తానికి నా కం బాక్…

సాధారణం

అప్పుడెప్పుడో నవంబర్ లో పోస్ట్ రాసాననుకుంటా…తరువాతిప్పుడే మళ్ళీ టపా మొదలెట్టడం….

డిసెంబర్…జనవరి..ఫిబ్రవరి..మార్చ్…

“ఆ తరువాత నువ్వు రాయకుండా ఉంటే ఏప్రిల్ మే కూడా వచ్చేస్తుంది…సోది ఆపి విషయం చెప్పహే…”

నా మానాన నేను టైప్ చేసుకుంటూంటే ఈ డవిలాగులెవరివబ్బా కొంపదీసి ఆత్మసీత కాదు కదా అని అనుకునేంతలో…

“దిక్కులు చూసింది చాలు..నువ్వకున్నది కరెక్టే”….అని మళ్ళీ…..

ఎవరా అని చూస్తే ఇంకెవరు నా ఆత్మసీతే….ఇట్టాంటి సత్యాలు పలికేది ఆత్మ సీతే కదా….

కనిపించి కనిపించడంతోనే….

“మాములుగా నువ్వు రాసేది ఆడికో అమావాస్యకో …దానికి తోడు ఈ గాప్…బ్లాగు మొదలెట్టగానే సరిపోదు…టపాలు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉండాలి….బ్లాగు పట్ల బొత్తిగా రెస్పాన్సిబిలిటి లేదు…మీరంతా ఎందుకు మొదలెడతారో బ్లాగులు” అని ఎడాపెడా వాయించేస్తోంది…

“ఇంక చాలమ్మా…ఆపు…లేక లేక ఈ టపాని మొదలెట్టాను…దీన్ని ఫినిష్ చెయ్యనీ..ఏ విషయమైనా మనం శాంతియుతంగా  మాట్లాడుకుని పరిష్కరించుకుందాము” అనే లోపల…

“ఈ డవిలాగ్ చాలా సార్లు చెప్పావు…ప్రతి సారి మొదలెట్టడం దాన్ని అటకెక్కించడం…నీ విషయం నాకు తెలియదా… ”

“నో నో ఈ సారి పక్కా…మేటరేది లేకపొయినా…ఐ ఆం బాక్ అన్న మెసేజ్ అన్నా పెడతానుగా “…

“నువ్వేమైనా షారుఖ్ ఖాన్  అనుకుంటున్నావా…కింగ్ ఈస్ బాక్ అని స్టేట్మెంట్లు ఇవ్వడానికి లేక అజితా బిల్లా సినిమాలోలా డవిలాగ్ చెప్పటానికి…ఈ సోది నాకొద్దు గాని నువ్వు దీన్ని పూర్తి చేసేంత వరకు నేను వెళ్ళను…ఇక్కడే ఉంటాను…” అని అల్టిమేటం ఇచ్చింది …

లేదు లేదు ఈ సారలా చెయ్యను…దీన్ని పూర్తి చేస్తాను గా అని బతిమిలాడి…శాంతి సందేశాన్ని పంపించాక…కొంచెం శాంతించినట్లు అనిపించింది…ఈ సారి పూర్తి చేస్తానుగా…ప్రామిస్ అని చెప్పేసరికి కొంచెం మెత్తబడి…నీకో రెండు రోజులు టైమిస్తున్నాను…ఆ లోపల టపా పూర్తి చెయ్యి లేకపోతే…

“ఆ లేకపోతే”

“చెప్పను…చూపిస్తాను” అని ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది….

హమ్మయ్య ఆత్మసీత వెళ్ళిపోయింది…ఇంక టపా రాసేయ్యచ్చు అని అనుకుంటున్నాను..

ఈ గోలలో పడి…హా ..ఏదో రాయాలనుకున్నాను …ఏంటా అని ఆలోచిస్తోంటే ఏమి గుర్తురావడం లేదు…

కంఫ్యూషన్ లో ఏం రాస్తున్నానో అర్ధం కావడం లేదు….ఫస్ట్ టైం టపా రాస్తున్నట్లు అనిపిస్తోంది…

ఈ సారి ఎలాగైనా టపా పూర్తి చెయ్యాలి…ఏం రాయాలి…అసలెందుకింత గాప్ వచ్చింది అని నాలో నేనే ఆలోచిస్తున్నా…

అసలిదంతా కాదు కానివ్వండి…అసలు ఈ గాప్ ఎందుకు వచ్చిందంటే…

అవి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిన రోజులు…

మూడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లతో ఆరు డిజైన్ డాక్యుమెంట్లతో కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న రోజులు…

మేము రాసిందే వేదం అంటూ(ఎందుకంటే మాకూ రిక్వైర్మెంట్లు ఫుల్లుగా తెలియవు కాబట్టి) టీంలో కొత్త గా జాయిన్ అయ్యిన వారికి విచ్చలవిడిగా కె.టి దంచుతున్న రోజులు…

కె.టి తరువాత మేము రాసిన డిజైన్ డాక్యుమెంట్లు మిగతా వాళ్ళకిచ్చి ఏవైనా డౌట్లుంటే మీ టీం మేట్స్ ని అడగండి అని మమ్మల్ని చూపెట్టి వెళ్ళిపొయాడు మా లీడ్ మహానుభావుడు స్వీట్లు పంచేసాను పండగ చేసుకోండి అన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చి.

ఇణ్ణాళ్ళు సముపార్జించిన అత్తెసరు ప్రాజెక్ట్ ఙ్ఞాన సంపదనీ మిగిలిన వాళ్ళకి పంచి పెట్టి ఇంకెవైనా డౌట్లుంటే లీడ్నే అడగండి అని ఒక పేద్ద భారాన్ని దింపుకున్నాము నేనూ,మా టీం మేటూ.

అప్పటి వరకు ఆడతా పాడతా పని చేస్తున్న మాకు రేపట్నుంచే కోడింగ్ ఫేస్..కాబట్టి ఎవరికిచ్చిన డిజైన్ డాక్యుమెంట్లు బేస్ చేసుకుని కోడింగ్ స్టార్ట్ చెయ్యండి..మీ కోడ్ తో బాటు టెస్ట్ కేసులు, రిజల్ట్స్ డాక్యుమెంట్లు కూడా రివ్యూ చేస్తాను అని ఓ మెయిల్…

ఏంటి చేసేది …కోడింగ్ చెయ్యడానికి భయం కాదు…చిక్కంతా టెస్టింగ్ లోనే ..టెస్ట్ చేయడానికి డాటా లేదు..టెస్టింగ్ ఎక్కడ నుంచి మొదలెట్టాలో మాకు తెలియదు..పైగా మన అప్లికేషన్ కి వెరే అప్లికేషన్ డాటా పైన డిపెండెన్సి ఉంది… మధ్యలో క్యూ.ఏ వాళ్ళకి ప్రాజెక్ట్ ఙ్ఞాన సంపద డిస్ట్రిబ్యూషన్ సెకండ్ ఫేసంట…

మీరేనా మెయిల్ కొట్టడం అనీ మేమూ ఓ మెయిలిచ్చాము మా లీడ్ కి ఇవీ మా కన్సెర్న్స్ అంటూ…నో వర్రీస్..మీరూ ప్రొసీడయ్యి పోండి..నేను ఉన్నానుగా అంటూ అభయహస్తం చూపించాడు…

ముందు సింపుల్గా ఉన్నవి చేసేద్దాము అని డిసైడ్ చేసుకుని అలాగే పని మొదలెట్టేసాము….

ఇదంతా ఏ ప్రాజెక్ట్ లో ఐనా మాములే గా అని మీకు  అనిపించచొచ్చు..అంతా బాగా జరిగితే నేను ఈ టపా ఎందుకు రాస్తాను… 🙂

ఇట్టా చిన్న ప్రాసెస్ కంప్లీట్ చేసేయ్యడం ఆలశ్యం…డిజైన్ ఫేస్ నుండి నేనూ,మా టీం మేటూ ఉండడం చేత మా మీద ప్రేమ కొద్దీ మాకు రెండు కాంప్లెక్స్ ప్రాసెస్లు అంట కట్టాడు మా లీడు…అది ప్రారంభించే టైం కి నేనేమో అర్జెంట్ గా లీవులో వెళ్ళాల్సి వచ్చింది…వారం పది రోజులు అనుకున్నది కాస్తా ఇంకో పది రోజులు పొడిగించాల్సి వచ్చింది…

కాని లీవులో వెళ్ళే ముందు కె.టి. అంతా సక్రమంగా ఇచ్చేసి వచ్చా..(నాకు తెలిసింది)…

మనమొచ్చేసరికి అంతా బానే ఉంటుంది..నా ప్రాసెస్ కూడా అయిపోయి ఉంటుంది…పెద్దగా పని ఉండదులే అనుకుంటూ లీవయ్యక వెళ్ళి చూస్తే..

ఏముంటుంది… ఎడారిలో ఉండే వాళ్ళకి ఒయాసిస్ కనిపించినట్లు…నేను వచ్చేసరికి మా టీం మేట్ల మొహాలన్నీ దేదీప్యమానం గా వెలిగిపోతున్నాయి…నా కుడి కన్ను అదరడం మొదలయ్యింది…ఇదేంటి స్వామి ఈ శకునం అని అనుకుంటూ ఉన్నా .. ఈ శకునాలన్నీ దీనికి నాంది అని నాకు అప్పుడర్ధం కాలేదు…

మా లీడ్ కాన్ వీ మీట్ అని అడిగాడు…

మీటింగ్ లో సూటిగా సుత్తి లేకుండా మీరు చేస్తున్న ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ మారాయి…ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది…ఆన్సైట్ వాళ్ళు అది ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు…సిట్యుయేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది..మీరు టేక్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసాడు… మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు..వాళ్ళు ఇష్యూ ఫిక్సింగ్ లో బిజీ గా ఉన్నారు అని అప్డేట్స్ ఇస్తున్నాడు…

అహా ఇదా సంగతి..అందుకేనా ఇన్ని వచ్చి రావడంతోనే ఇన్ని శుభ శకునాలు కనిపించాయి అని అనుకున్నా…

ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అని మళ్ళీ మొదలెట్టా…అదెప్పుడు కంప్లీట్ అవుతుందా అని మా టెస్టింగ్ టీం వాళ్ళు వెయిటింగ్…ఆన్సైట్ వాళ్ళూ వెయిటింగ్…నీ ప్రాసెస్ కోసం ఎంత మంది వెయిటింగ్ చూడు..సుడుందమ్మాయి నీకు అని మా టీం మేట్స్ జోకారు… ఇప్పుడీ కుళ్ళు జోకులు అవసరమా అని తీక్షణంగా ఓ లుక్కు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు…

సరే మొత్తానికి కోడింగ్ ని ఓ కొలిక్కి తెచ్చాక టెస్ట్ చేస్తే ఆహా నా సామిరంగా exceptions మీద  exceptions …దానికి తోడు మా టెస్టింగ్ టీం వాళ్ళు అయ్యిపోయిందా మీ పని…ఇక మేము మొదలెట్టచ్చా అని ఒక గోల…ఆల్రెడి సగం మెంటలెక్కిన స్టేజ్లో ఉంటే వీళ్ళదొకటి…ఆపండెహె మీ గోల ముందు నన్ను స్థిమితంగా టెస్ట్ చేయనివ్వండి అంతవరకు నా దరిదాపుల్లోకి రావద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చా.. .పనయ్యాక నేనే పిలుస్తా…ఫార్మల్ గా మెయిల్ ఇస్తాను అప్పుడు చూసుకోండి అని చెప్పడం తో వెనక్కి తగ్గారు…

నా కోడ్ ని రిపేర్ చేసి అనుకున్న రిజల్ట్ తెప్పించేప్పటికి బాబోయ్…వచ్చిన రిజల్ట్స్ ని కాప్చర్ చేసి టెస్టింగ్ టీం కి మెయిల్ కొట్టా….మీరు స్టార్ట్ చేయండి అని…

ఆ తరువాత మొదలయ్యింది మా రెండు టీంస్ మధ్య టాం అండ్ జెర్రి ఫైట్లు…

ఈ సందులో ఆన్సైట్ వాడు టెస్టింగ్ మొదలెట్టేసాడు…వీటన్నింటితో టెన్షన్,ఫ్రస్ట్రేషన్…పడుకుంటే పలానా వాళ్ళతో పెట్టుకున్న గొడవ…డాటా..ఇవన్నీ కల్లోకి వచ్చేవి…

ఇట్టా కాదని మమ్మల్నే డైరెట్టుగా ఆన్సైట్ క్లైంట్ తో మాట్లాడమని చెప్పారు..క్లైంట్లేమో జాపనీస్..

ఇహ చూసుకోండి మాకు సీన్ సితార…వాళ్ళకేమో మన ఇంగ్లీష్ అర్ధం కాదు..వాళ్ళ ఇంగ్లీష్ మాకు అర్ధమయ్యేది కాదు…ఇంకా కొత్త రిక్వైర్మెంట్లు చెప్తూనే ఉన్నారు మా క్లైంట్ సాన్(గారు అంట జాపనీస్ లో)… వాళ్ళొకటి చెప్పడం మేమొకటి అర్ధం చేసుకోవడం…తీరా అది కాదు మేము చెప్పింది అని వాళ్ళనడం…చివరాఖరికి వాళ్ళ ఇంగ్లీష్ లెవల్స్ కి మేము దిగి వాళ్ళు చెప్పింది అర్ధం చేసుకునేసరికి చుక్కలు కనిపించాయి …..

నాలుగు నెలలు నను వీడని నీడ లాగా ఈ ప్రాసెస్ వదల్లేదు… ఓ రోజు మా క్లైంట్ సాన్ తో అనర్గళంగా జాపనీస్ మాట్లడేస్తున్నట్లు కలొచ్చింది..మొత్తానికి నాకు మెంటలెక్కిందని అర్ధమయ్యింది…

ఆ తరువాత క్లైంట్ కోరినట్లే మొత్తానికి ఫినిష్ చేసి యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అనిపించుకున్న(పడిన కష్టము,చికాకు,ఫ్రస్ట్రేషన్,విసుగంతా ఈ ఒక్క మాట తో ఆవిరయ్యిపోయింది.ఈ మాటలో ఏదో మాయ ఉందనుకుంటా) …అప్పుడు నా మొహం ఇలా అయ్యింది… 🙂

తరువాత గో లైవ్ ఫేస్ కి ఓ.కె చెప్పడంతో హమ్మయ్య అని అనుకున్నాము…

ఈ నాలుగు నెలల్లో ఫ్రెండ్స్ తో ఛాటింగ్ బంద్,కాఫీ బ్రేక్స్ బంద్,ఓ కునుకు తీద్దామంటే ప్రాజెక్ట్ కలలు …

ఇక ప్రాజెక్ట్ గో లైవ్ ఫేస్ కి వెళ్ళాక అందరం ఊపిరి తీసుకున్నాము…ఓ రెండ్ రోజులు సపోర్ట్ చేసాక  ప్రాజెక్ట్ అయ్యిపోయిందంటూ మమ్మల్ని బల్లలోకి వేసేసారు..(అదే అండి బెంచ్)…రెండు రోజులు పన్లేకుండా బా….గానే అనిపించింది..తరువాత అర్ధమయ్యింది ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమో..

ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేద్దామంటే పర్సనల్ ఈ-మెయిల్ సైట్స్ బంద్..

ముఖ పుస్తకమైనా చూద్దామంటే అదీ బంద్…

పోనీ బ్లాగులు చూద్దామంటే అదీ బంద్…

ఆన్లైన్ మాగ్జైన్స్ చదువుదామంటే అదీ బంద్…

హేపి గా బెంచ్ లో ఉన్నారు ఎంజాయ్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్…టైం పాస్ లేకుండా ఎంజాయ్ ఎట్టా చేయాలో నాకర్ధం కాలేదు…చూద్దాము ఈ ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు ఉంటుందో…

హమ్మయ్య నాలుగు నెలలుగా ఉన్న టెన్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్క టపా తో తగ్గిపోయిందన్న మాట…మొత్తానికి నేను హేపీస్… 🙂

ఒక స్పందన »

  1. ఆత్మ సీత
    కెవ్వ్ కేక!
    ఈ జపానోల్లు ఉన్నారే ప్రపంచం లో ఎవ్వరినీ అర్ధం చేసుకోలేరు
    మొత్తానికి ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసిన ఆనందం లో ఉన్నారు కాబట్టి
    ఇదే సంతోషం లో మూడు నాలుగు పోస్ట్ లు రాసి పెట్టేసి పోస్తుతూ ఉండాలని కోరుకుంటూ
    టామ్ అండ్ జెర్రీ ఫాన్స్!

  2. చాలా రోజులకి స్నిగ్ధ గారు మల్లి మంచి టపా తో తిరిగి రంగ ప్రవేశం చేసారు…!
    మంచిది..
    డెవలపర్ కష్టాలు చెప్పారు
    కానీ మా టెస్టింగ్ టీం మీద ఇన్ని అబండలు వేస్తారా..!
    అయినా టపా బాగా ఉంది అని ఒకే కారణం తో మిమల్ని ఇక్కడి తో వదిలేస్తున్న .

    • విరించి గారు..కష్టాలు ఫుల్లుగా చెప్పలేదండి…టెస్టింగ్ టీం మీద నేనేమి అభాండాలు వేయలేదండి..అయినా డెవలపర్-టెస్టర్ భాయి భాయి..:)

      కామెంటినందుకు ధన్యవాదాలు..:)

  3. సాఫ్టీలందరికీ ఈ కష్టాలు కామన్ కదండీ. పీక్ స్టేజ్ లో ఏ రేంజ్ లో పిచ్చెక్కుతుందో చెప్పక్కర్లేదు. కచ్చితం గా కల లోకొస్తాయ్ 😉 ఇప్పుడా పిరియడ్ అయిపోయింది కాబట్టీ సాగినంతకాలం బల్ల మీద ఎంజాయ్ చెయ్యండీ.

    వెల్కం బ్యాక్. 😉 😉

    • కరెక్టేనండి…కాకపోతే xxx-సాన్ లతో డీల్ చేసేప్పుడు వేరేగా ఉంటాయని ఇప్పుడే అర్ధమయ్యింది…

      బల్ల మీద ఎంజాయ్మెంటా…మీరూ మరీనూ…దేనికి ఆక్సెస్ లేదండి…ఏం చేయమంటారు??
      🙂

      కామెంటినందుకు థాంక్సండి…

  4. ఎల్కం ఎల్కం అమ్మాయిగారు ఎల్కం… 🙂

    ఎటూ ప్రాజెక్టు ఫినీష్ చేసి జపనీస్ కూడా మాట్లాడేస్తున్నట్టు కలగంటున్నారు కాబట్టి మీ లీడువాడిని ఆన్సైట్ లో జపాన్ పంపమని అడగండి. నూడిల్స్ -చాప్ స్టిక్స్ లా మహబాగా కలిసిపోతారు 😉

    >>నువ్వేమైనా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా…కింగ్ ఈస్ బాక్ అని స్టేట్మెంట్లు ఇవ్వడానికి

    ఇదన్యాయం… రేప్పొద్దున బ్లాగ్ పోస్టులో ఈ డవిలాగు వాడదామనుకుంటున్నా… మీరిలా మా బ్లాగారాం గాడికి హింట్స్ ఇస్తే ఎలా నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటాడు ః(

    • థాంక్స్ బ్రదర్….బహుకాల బ్లాగు దర్శనం..ఏమయ్యిపోయారు….
      ఆన్సైటు అదీ జపానా…ఎందుకండీ…నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండడం మీకిష్టం లేదా…:)

Leave a reply to స్నిగ్ధ స్పందనను రద్దుచేయి