అదేదో సినిమాలో వీక్ అంతా ఏం చేస్తుంటారు అంటే వీక్ ఎండ్ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పినట్లు..వీకంతా ఎదురు చూస్తే వీక్ ఎండ్ రానే వచ్చింది. ఈ వీక్ ఇది చేద్దాము అది చేద్దాము అని ఆలోచిస్తూ చిస్తూండగానే వీక్ ఎండ్ కాస్తా ఎండూ అయ్యింది. సరే పోని కాసింత కళా పోషణ అన్నా చేద్దాము అని టి.వి పై పడ్డా.
అక్కడా పొద్దున చూసిన తెలుగు సినిమా డబ్బింగ్ రూపం లో హిందీ ఛానెల్ లో తేలుతోంది. హతవిధీ!! ఏమిటీ స్వామి ఈ పరీక్ష అని అడగ్గా వేరే కార్యక్రమాలను చూడమ్మా అని చెప్పాడు.సరే అని ఇంకో ఛానెల్ చూస్తే అక్కడేమో వేడి వేడి దోషలు, గ్రౌండ్ నట్స్ ,ఇంకేదో నట్స్ తో ఏవో మిక్సర్లు చేయడం ఎలాగా అని చూపిస్తున్నారు.
ఇవి ఇంకో వీక్ ఎండ్ చెయ్యొచ్చులే అని ప్రస్తుతానికి ఈ దోషాలు,నట్లూ మనకొద్దని ఇంకో ఛానెల్ కి వెళ్ళా..అక్కడేమో సినిమా యాడ్ కి ముందు ఆ సినిమా గురించిన ఇంట్రొ చెప్తున్నాడు సన్ టి.వి వాడు. వారి ఇంట్రొ కూడ ఓ సినిమా ట్రెయిలర్ లా ఉంటుంది.
“భారతీయ ఛానెల్స్ లో మొదటి సారిగా, వెండి తెర కి వచ్చిన కొద్ది నెలలకే మీ బుల్లి తెర పై ఈ సూపర్ హిట్ చిత్రం” (actual గా అక్కడ తమిళ్ లో చెప్తే ఇక్కడ అనువదించా,ఛానెల్ కి నాకు తెలుగు పదం తెలీలేదు,మీకేమైనా తెలిస్తే చెప్పగలరు…)
ఇది అయ్యాక అసలు సినిమా యాడ్ వస్తోంది.సరే కాసింత ఇంటెరెస్టింగా అనిపించడంతో ఈ సినిమా సూద్దామని డిసైడ్ అయ్యిపోయా.సాయంత్రం త్వర త్వరగా పనులు అవీ ముగించుకుని సినిమా చూడ్డానికి సెటిల్ అయ్యాను.
టైటిల్స్ స్క్రోల్ అవుతూంటే ఇది డైరెక్టర్ శంకర్ నిర్మించిన చిత్రమని తెలిసింది. శంకర్ నిర్మాణ సంస్థ నుంచి అంటే కూసింత డిఫరెంట్ గా ఉంటుందేమో సినిమా అని ఒక చిన్న ఆష.
ఇప్పుడు కథ చెపుతా వినండి.
బాలా అనబడే బాల సుబ్రమణ్యం, రే అనబడే రేవతి, వాళ్ళ అబ్బాయి ఆనంద్.తన పేరెంట్స్ చనిపోయిన 15 ఏళ్ళ తరువాత బాలా హాలిడే ట్రిప్ అని చెప్పి రేవతి ,ఆనంద్ ని తమ స్వస్థలానికి తీసుకు వస్తాడు.బాలా తన తల్లితండ్రులతో కలిసి చిన్నప్పుడు ఉన్న ఇంట్లోనే దిగుతారు.ఆ ఇంటికి రావడంతోనే ఆనంద్ కి వాళ్ళు కాక ఇంకెవరో ఉన్నట్లు,అక్కడేదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది.సరిగ్గా మాటలు రాకపోవడం వల్ల పలానా జరుగుతోంది అని వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పలేకపోతాడు.పైగా ఈ జరుగుతున్నవి తనకి బాగా నచ్చుతాయి.త్వరలోనే రేవతి కి ఇంట్లో జరుగుతున్నవి తెలిసిపొతాయి.ఇంట్లో ఏవో దయ్యాలు ఉన్నాయని తాము ఆ ఇంట్లో ఉండదొద్దని తిరిగి చెన్నై వెళ్ళిపోదామని భర్తతో చెప్తుంది.దానికి బాలా రేవతివి అర్ధం లేని భయాలు అని చెప్పి కొట్టి పారేస్తాడు. ఇంతలో బాలా ఫ్రెండ్ జీవా చెన్నై నుంచి వస్తాడు. వీళ్ళిద్దరు తన దగ్గర ఏదో దాస్తున్నారని రేవతి గ్రహిస్తుంది.వీళ్ళిద్దరినీ వెతుక్కుంటూ సేఠ్ ఒకడు చెన్నై నుంచి వస్తాడు.
అప్పుడు అసలు విషయం తెలుస్తుంది…సేఠ్ వీళ్ళకి అప్పిచాడని..అది తీర్చలేక బాలా ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి హాలిడే ట్రిప్ అని చెప్పి ఇక్కడకి వచ్చాడని రేవతికి తెలుస్తుంది.సేఠ్ వీళ్ళనేమో పాపం హౌస్ అరెస్ట్ చేసెస్తాడు.జీవా ఇల్లమ్మమని సలహా ఇస్తాడు. దానికి సరే అన్న బాలా ఇల్లు అమ్మకానికి పెట్టగా వచ్చిన వాళ్ళు ఇల్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని సంఘటనలు ఎదురవ్వడంతో భయపడి ఎవరూ కొనడానికి ముందుకు రారు.
ఈ సమస్య నుంచి బాలా ఎలా బయట పడ్డాడు? ఇంట్లో వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు? హౌస్ అరెస్ట్ నుంచి బయటకి వచ్చారా లేదా అన్నది మిగతా కథ.
ఈ సినిమాలో స్టార్స్ లేరు..పట్టుమని సినిమా మొత్తం మీద ఓ పదిహేను పాత్రలు కూడా లేవు..కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు…మనం చెప్పుకునే ఎంటర్ టెయిన్ మెంట్ ఫాక్టర్ లేదు.కంపల్సరి గా ఉండే ఓ కుత్తు సాంగ్ లేదు….
కానీ ఉన్నదల్లా excellent ఫొటోగ్రఫి, మంచి బాక్ గ్రౌండ్ స్కోర్.నటీ నటుల నటన ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది.ఇంతకీ సినిమా పేరు చెప్పడం మర్చిపోయా…’ఆనందపురత్తు వీడు’..అలాగే అచ్చ తెలుగులో కి అనువదిస్తే ‘ఆనందపురం ఇల్లు’.మన నేటివిటి కి దగ్గరగా ఉంటుందని ‘ ఆనంద విలాస్’ అని నేను తెలుగులో కి మార్చా…
ఈ సినిమాలో ఇల్లు కూడా అంతే ముఖ్య పాత్ర పోషించింది. ఇల్లైతే ఎంత బాగుందో…పాత కాలం పేద్ద బంగళా..ఇంటి ముందు వెనక బోలేడంత స్థలం..ఇంట్లోనే ఓ నాచురల్ స్విమ్మింగ్ పూల్…నాకైతే భలే నచ్చేసింది…
సినిమా చూసాక అనిపించింది ఏంటంటే మల్టి ప్లెక్స్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి తీసినట్లు అనిపించింది.కాని అటెంప్ట్ బాగుంది.
ఇంత చెప్పాక ఈ సినిమా డైరెట్రు గురించి చెప్పాలి…మీకు ఓ పదీ ,పన్నెండేళ్ళ ముందు రహస్యం అని ఓ సీరియల్ ఈ టి.వి లో వచ్చేది గుర్తుందా? ఆ తరువాత వీడని వీరభద్రుడని జెమిని టి.వి లో..అప్పట్లో ఈ సీరియల్స్ బాగా పాపులరయ్యింది…మేమైతే క్లాస్లో టైం దొరికితే ఆ వారం మొత్తం నెక్స్ట్ ఏమి జరుగుతుందా అని మాట్లాడుకునే వాళ్ళము.ఆ సీరియళ్ళ డైరెట్రే ఈ సినిమా డైరెట్రు..పేరు నాగ….రహస్యం సీరియల్ అంత థ్రిల్లింగా దీన్ని కూడా తీసాడు.
ఇదంతా బానే వుంది..అసలు అర్ధం కాని విషయమేమిటంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావని…అరె కనీసం అటెంప్ట్ కూడా చెయ్యరెందుకని? ఓ రెండేళ్ళ ముందు రీలీజ్ అయ్యిన “ఈరం” సినిమాని వైశాలి అనే పేరుతో డబ్ మాత్రం చేస్తారు…
నాకు తెలిసి ఈ సినిమా అక్కడ బాగా ఆడలేదనుకుంటా…అందుకే మనకి ఇక్కడ రాలేదు..లేకపోతే ఎప్పుడో ఈ సినిమాని దిగుమతి చేసేసి ఉందురు…
నేను చూడమని స్ట్రాంగ్ గా రికమెండ్ చేయను ఎందుకంటె నాకూడా అక్కడక్కడా బోర్ కొట్టింది…కాని చివరకి ఏమవుతుందా అని మొత్తం చూసేసా…. ఏది ఏమైనా ఈ వీకెండ్ ఓ డిఫెరెంట్ సినిమా చూసిన అనుభూతిని కలిగించింది ఈ ఆనందపురత్తు వీడు.….